*విజన్ తో ముందుకెళ్లాలి... మరింత ప్రగతి సాధించాలి*
*విజయనగరంలో పర్యటించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
*కార్పొరేషన్ పాలకవర్గంతో ప్రత్యేక సమావేశం.. అభివృద్ధి పనులపై సమీక్ష
*విలీన పాఠశాలల ఆస్తులు మున్సిపాలిటీలకే చెందుతాయని స్పష్టం
*సొంతంగా నిధులు సమకూర్చుకోవటంపై దృష్టి సారించాలని సూచన
విజయనగరం, జూన్ 23 (ప్రజా అమరావతి) ః మంచి విజన్.. ఆచరణాత్మకమైన కార్యాచరణతో ముందుకెళితే నగరపాలక, పురపాలక సంస్థల్లో మరింత ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని నూతన పద్ధతులను అవలంబించటం ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని తద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. రోడ్లు అభివృద్ధిపై, కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజారోగ్యాన్ని కాపాడాలని హితవు పలికారు. టిడ్కో ఇళ్ల గృహ సముదాయం ప్రారంభోత్సవం నిమిత్తం గురువారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక కార్పొరేషన్ పాలకవర్గంతో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై, తీసుకున్న నిర్ణయాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యాచరణతో ముందుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ప్రజల నుంచి ప్రశంసలు పొందాలని పేర్కొన్నారు. స్థానికంగా షాపింగ్ లు నిర్మించటం ద్వారా ఇతర కార్యకలాపాలు నిర్వహించటం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని సూచన చేశారు. అలాగే విలీన పాఠశాలలకు చెందిన ఆస్తులు ఆయా పురపాలక, నగరపాలక సంస్థల అధీనంలోకి వస్తాయని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కు పరిపాలన పరమైన సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విపత్తుల సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లులు ఉంటే పెట్టుకోవాలని త్వరితగతిన మంజూరు చేసే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్లతో ముఖాముఖి నిర్వహించారు.
*టిడ్కో ఇళ్లను అందించాలన్నది సంకల్పం*
పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లు అందించాలన్నదే వైకాపా ప్రభుత్వ సంకల్పం అని పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో మందగమనం పాటించిందని, వైకాపా ప్రభుత్వం చొరవ చూపిందని గుర్తు చేశారు. రూ.1 కే రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నామని వివరించారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.4,500 కోట్ల కేటాయించిందని, అందుకే మాది సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి సురేష్ కు స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, రేవతి, కార్పొరేటర్లు, కమిషనర్ శ్రీ రాములు నాయుడు ఇతర అధికారులు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పనుల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, అదనపు ఆర్థిక నిధులు కేటాయించాలని విన్నవించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, రేవతి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్, ఎండీ శ్రీధర్, ఈఈ జ్యోతి, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, మెప్మా పీడీ సుధాకర్, మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈఈ దిలీప్, ఇతర అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment