ప‌ట్ట‌ణ పేద‌కు జ‌గ‌న‌న్న కానుక - నేడే సొంతింటి ఆవిష్క‌ర‌ణ‌ వేడుక

 


ప‌ట్ట‌ణ పేద‌కు జ‌గ‌న‌న్న కానుక - నేడే సొంతింటి ఆవిష్క‌ర‌ణ‌ వేడుక


ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇళ్లు నిర్మించి రిజిస్ట్రేషన్‌ చేసి పత్రాలు అంద‌జేత‌

సారిప‌ల్లిలో నేడు జ‌గ‌న‌న్న‌ టిడ్కో కాల‌నీ ప్రారంభించ‌నున్న మంత్రులు బొత్స‌, ఆదిమూల‌పు సురేష్‌, ముత్యాల‌నాయుడు

800 మంది ల‌బ్దిదారుల‌కు నేడు ఇళ్లు అంద‌జేయ‌నున్న మంత్రులు


విజ‌య‌న‌గ‌రం, జూన్ 22 (ప్రజా అమరావతి): న‌గ‌రంలోని ఇళ్లులేని నిరుపేద కుటుంబాల సొంత ఇంటి క‌ల నెర‌వేర‌బోతోంది. న‌గ‌రానికి స‌మీపంలోని సారిప‌ల్లి వ‌ద్ద రాష్ట్ర ప్ర‌భుత్వ అనుబంధ సంస్థ‌ ఏపి టిడ్కో(ఏపి టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం నిర్మించిన జ‌గ‌న‌న్న కాల‌నీ ఇళ్ల‌ను రాష్ట్ర మంత్రులు గురువారం ప్రారంభించి, అర్హులైన ల‌బ్దిదారుల‌కు ఇళ్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. న‌గ‌రంలోని ఇళ్లులేని నిరుపేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్య‌యంతో 2656 ఇళ్ల‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఏ-కేట‌గిరిలో 300 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో 1536 ఇళ్లు, బి-కేట‌గిరీ కింద 365 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి-కేట‌గిరీ కింద 430 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో 928 డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నారు.


సారిప‌ల్లిలో నిర్మిస్తున్న ఇళ్ల‌లో 800 పూర్త‌య్యాయ‌ని వాటిని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ఇన్ చార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు త‌దిత‌రులు గురువారం మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు ఇళ్ల‌ను ప్రారంభించి అర్హులైన ల‌బ్దిదారుల‌కు ఇళ్ల మంజూరు ప‌త్రాల‌తో పాటు, ఇళ్ల ల‌బ్దిదారుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసిన డాక్యుమెంట్ల‌ను కూడా అంద‌జేస్తార‌ని ఏపి టిడ్కో కార్య‌నిర్వాహ‌క ఇంజనీర్ ఎస్‌.జ్యోతి తెలిపారు. ఏ-కేట‌గిరికి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్ల‌ను, సి-కేట‌గిరికి సంబంధించి 10 బ్లాకుల్లోని 430 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను సంబంధిత ల‌బ్దిదారుల‌కు అంద‌జేస్తార‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి ఖ‌ర్చులు లేకుండా, వ్య‌య ప్ర‌యాస‌లు లేకుండా ఈ ఇళ్ల‌ను ల‌బ్దిదారుల పేర్ల‌తో ఉచితంగా రిజిస్ట్రేష‌న్ చేయించి డాక్యుమెంట్ల‌ను అంద‌జేస్తోంద‌ని ఇ.ఇ. చెప్పారు.


రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ-కేట‌గిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించ‌గా ఇందులో కేంద్ర ప్ర‌భుత్వం రూ.1.50 ల‌క్ష‌లు ఇస్తే, మిగిలిన రూ.5.05 ల‌క్ష‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించి ఏ-కేట‌గిరి ల‌బ్దిదారుల‌కు కేవ‌లం రూ.1/- ఒక్క రూపాయికే రూ.6.55 ల‌క్ష‌ల విలువ‌గ‌ల ఇంటిని ఉచితంగా అంద‌జేస్తోంది.


సి-కేట‌గిరి కింద నిర్మించే 430 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంగ‌ల‌ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు ఒక్కో ఇంటికి రూ.8.55 ల‌క్ష‌ల నిర్మాణ వ్య‌యం అవుతుండ‌గా, ఇందులో కేంద్రం రూ.1.50 ల‌క్ష‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2.90 ల‌క్ష‌లు, ల‌బ్దిదారు త‌న వాటా కింద రూ.50వేలు స‌మ‌కూరుస్తుండ‌గా, బ్యాంకు రుణం కింద రూ.3.65 ల‌క్ష‌లు స‌మ‌కూరుస్తున్నారు.


సారిప‌ల్లి లే అవుట్‌లో నిర్మాణంలో వున్న మిగిలిన 1856 ప్లాట్ల‌ను ఆగ‌ష్టు, 2022 నాటికి పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు అంద‌జేసే ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఇ.ఇ. జ్యోతి వివ‌రించారు. ఈ లేఅవుట్‌లో ల‌బ్దిదారుల ఇళ్ల‌కు సామాజిక‌, మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ.41.02 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇక్క‌డి జ‌గ‌న‌న్న కాల‌నీలో ల‌బ్దిదారుల‌కు తాగునీటి స‌ర‌ఫ‌రా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల‌కు రూ.2.55 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.1.61 కోట్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధిప్లాంట్ కోసం రూ.4.92 కోట్లు, కాల‌నీ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.11.27 కోట్లు టిడ్కో ఖ‌ర్చు చేస్తోంద‌ని ఇ.ఇ. వెల్ల‌డించారు.


ఈ కాల‌నీతో పాటు జిల్లాలోని సోనియా న‌గ‌ర్‌లో 1120, నెల్లిమ‌ర్ల‌లో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 క‌ల‌సి మొత్తం 3712 ప్లాట్లు వివిధ ద‌శ‌ల్లో నిర్మాణంలో వున్నాయ‌ని, వీటిని పూర్తిచేసి డిసెంబ‌రు, 2022 నాటికి ల‌బ్దిదారుల‌కు అంద‌జేసే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.


ఇళ్ల ల‌బ్దిదారుల‌కు పూర్తిగా టైల్స్‌తో కూడిన గ‌చ్చులు, బెడ్ రూం, గ్రానైట్ ఫ్లాట్‌ఫాంతో కూడిన వంట‌గ‌ది, సింక్‌, ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన టాయిలెట్‌, లివింగ్ రూంతో 300 చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.


కాల‌నీలో 40 అడుగుల వెడ‌ల్పుతో కూడిన రోడ్ల‌ను ఇప్ప‌టికే పూర్తిచేశారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇప్ప‌టికే క‌ల్పించారు. అన్ని వ‌స‌తుల‌తో సిద్ధ‌మైన ఇళ్ల‌ను ల‌బ్దిదారులు వ‌స‌తుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌కుండా చూసే ల‌క్ష్యంతో సిద్ధం చేశారు.





Comments