ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటిఐ లలో ఇంజినీరింగ్, ఇంజినీరింగేతర విద్యా విభాగాలలో చేరేందుకుగాను ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి


విజయవాడ (ప్రజా అమరావతి);

2022-23 సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశానికి గాను దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్  బి. లావణ్యవేణి ఒక ప్రకటనలో కోరారు.   

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటిఐ లలో ఇంజినీరింగ్, ఇంజినీరింగేతర విద్యా విభాగాలలో చేరేందుకుగాను ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.   ఆన్ లైన్ దరఖాస్తు ఫారం ను పేర్కొనిన రీతిలో పూర్తి చేసి ది. 30-06-2022 తేదీ లోగా పంపించాలన్నారు.  ఒకే విద్యార్థి  ఒకటికి మించి ఐటిఐ కాలేజీలలో  దరఖాస్తు చేసుకోవచ్చునని,   దరఖాస్తు అనంతరం యూనిక్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ అభ్యర్థికి కేటాయిస్తారన్నారు.  విద్యార్థుల 10వ తరగతి మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారని తెలిపారు.  దరఖాస్తు చేసిన అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో  ఒరిజినల్ విద్యా ధ్రువపత్రాల వివరాలను సమర్పించాలని,   ధ్రువపత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు.   షెడ్యూల్డ్ కులాలు, తెగలు బిసి అభ్యర్థులకు సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ ఉంటుందన్నారు.  రిజర్వేషన్ నియామకాల తదుపరి మిగిలిన సీట్లను జనరల్ కేటగిరి పూల్ లో భర్తీ చేస్తారన్నారు.  29 శాతం సీట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కేటాయింపు చేస్తారన్నారు.  అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలన్నారు.  మొత్తం సీట్లలో 33 1/3 వంతు సీట్లు ఆయా విద్యా విభాగాల వారీగా మహిళలకు రిజర్వు చేయడం జరిగిందని తెలిపారు.  వినికిడి లోపం, అవయవ లోపం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు, మాజీ సైనికుల పిల్లలకు  సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

మైనారిటీ ఐటిఐ కళాశాలల్లో జాయిన్ అయ్యే విద్యార్థులు మైనారిటీ గుర్తింపు ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు.  జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రాతిపదికన మైనారిటీ కళాశాల్లో సీట్లు భర్తీ చేస్తారని ఆమె తిలిపారు.    అభ్యర్థులు తమ సందేహాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు కన్వీనర్ ల నుండి నివృత్తి చేసుకోవాలని లావణ్యవేణి  కోరారు. 


Comments