పారిశ్రామికవేత్తలకు వరంగా 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి



*పారిశ్రామికవేత్తలకు వరంగా 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*


*జీవో నంబర్ 7 అమలుతో 358 పరిశ్రమలకు నవోదయం : ఛైర్మన్*


*రాష్ట్రవ్యాప్తంగా  ఏపీఐఐసీకి 571 దరఖాస్తులు రాక : ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*


అమరావతి, జూన్, 30 (ప్రజా అమరావతి): 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం'  ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వరంగా మారిందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 7 అమలు ఆ పరిశ్రమలకు నవోదయమైందని ఆయన పేర్కొన్నారు. భూముల పునరుద్ధరణ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకోసం గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుపై బడుగు, బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చిందని ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఏపీఐఐసీ నిర్దేశించుకున్న 7 కేటగిరిల్లో 4 కేటగిరీలకు సంబంధించిన భూముల పునరుద్దరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్లాట్ల కేటాయింపు  ప్రక్రియ మొత్తం ఏపీఐఐసీకి చెందిన  కమిటీ  పారదర్శకంగా నిర్వహించింది.  లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటి  పాత ధరలనే వర్తింపజేయడం, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించడం, అన్ని భూ కేటాయింపులను లీజు నుంచి అమ్మకం(ఓఆర్ఎస్-ఔట్ రేజ్ సేల్) పద్ధతిలోకి మార్చడం, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడం, యూనిట్ ని పూర్తి చేసేందుకు ఏప్రిల్ 1 , 2022 నుంచి మరో మూడేళ్ళ వరకూ కాలపరిమితిని పెంచడం, తద్వారా కట్టాల్సిన మొత్తం, అందుకు వడ్డీ, దానిపై జరిమానాలు లేకుండా చూడడం వంటి వెసులుబాటుతో ఇపుడు 358 పరిశ్రమలు కొత్త ఉత్సాహంతో తిరిగి ప్రారంభం కానున్నాయన్నారు. మరికొన్ని పరిశ్రమలను పరిశీలించి నిర్ణయించాల్సి ఉందన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 జోనల్ ల నుంచి పరిశ్రమల పునరుద్ధరణకోసం దాదాపు 571 దరఖాస్తులు వచ్చాయని ఏపీఐఐసీ వీసీ,ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పష్టం చేశారు. ఒక్క విజయవాడ జోన్ నుంచే 125 దరఖాస్తులు వచ్చాయి. విశాఖ, అనకాపల్లి జోన్ లు కలిపి ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి.  ప్రకాశం జిల్లా నుంచి 65, కాకినాడ నుంచి 54, చిత్తూరు నుంచి 52 దరఖాస్తులు వచ్చాయి.  మొత్తం వచ్చిన 571 దరఖాస్తులను పరిశీలించి ఏపీఐఐసీ వాటిని 7 కేటగిరీలుగా విభజించి ప్లాట్లను తిరిగి కేటాయించే దిశగా  చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 358 యూనిట్లకు ప్లాట్లను రద్దయిన చోటే , అదే ఎస్టేట్ లోనే, అంతే విస్తీర్ణంలో వారికి ప్లాటు కేటాయించే ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.  రద్దయిన యూనిట్లు అక్కడే పునర్ ప్రారంభించేందుకు అనుగుణంగా 163 పరిశ్రమలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిందన్నారు. రద్దయిన యూనిట్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అదే ఎస్టేట్ లేదా మరో చోట 219 యూనిట్లను పునరుద్ధరించేందుకు ఏపీఐఐసీ  కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఏర్పాటైన చోట కాకుండా వేరే ఎస్టేట్ లో కోరుకున్న చోట, కోరుకున్నంత విస్తీర్ణం మేరకు  వీటిని కేటాయించనున్నారు.   అయితే మొత్తం దరఖాస్తులలో ఇంకా యూనిట్ రద్దు కాకుండా పాక్షికంగా చెల్లింపులు జరపకుండా 85 యూనిట్లు, రద్దు కాకుండా కొంచెం కొంచెం చెల్లింపులు జరుపుతూ వన్ టైమ్ సెటిల్ మెంట్ కోరుకునే యూనిట్ల జాబితా కలిపి 182 ఉన్నట్లు ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పష్టం చేశారు. 


*'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' నేపథ్యమిది*


 గతంలో ఏదైనా పరిశ్రమకు పదేళ్లపాటు భూమిని లీజుకు ఇచ్చేవారు. దానివల్ల పారిశ్రామికవేత్తలకు రుణమంజూరు సమస్యలు తలెత్తేవి. చిన్న పరిశ్రమలకు కలిగే ఈ ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం  ఏప్రిల్ 2008 నుంచి మార్చి 2020 వరకూ పరిశ్రమల ఏర్పాటుకై ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు పొంది వివిధ కారణాలు వల్ల పరిశ్రమలు నెలకొల్పలేనివారికి ఈ అవకాశాన్ని కల్పించింది. లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటిధరలను వర్తింపజేయడమేకాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే ఈ వెసులుబాటుకు గత మార్చి 31లోపు నమోదు చేసుకునే వీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటిధరలను వర్తింపజేయడమేకాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం పభ్రుత్వం కల్పిస్తున్నట్లు ఏపీఐఐసీ స్పష్టం చేసింది.  దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడమేకాకుండా, 3 నెలలలోపు వడ్డీలేకుండా నగదు చెల్లించేలా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్ మెంట్) అవకాశం ఇచ్చింది.  ఏపీఐఐసీమార్గదర్శకాలను అనుసరిస్తూ పరిశమ్రలను ఏర్పా టు చేసుకునేవారికే భూ కేటాయింపుల సేల్ డీడీ సాధ్యమని గత ఫిబ్రవరి 5న ఇచ్చిన జీవో నంబర్ 7 మార్గదర్శకాలలో పేర్కొంది. 



Comments