విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలి

 విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలి


విపత్తుల సమర్ధ విర్వహణకు ప్రత్యేక యాప్ రూపొందించాలి

నైరుతి రుతుపవన సన్నాహకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సమీక్ష 

అమరావతి,8 జూన్ (ప్రజా అమరావతి):రానున్న నైరుతి రుతుపవన కాలంలో తుఫానులు,వరదలు వంటి విపత్తులు సంభవిస్తే సకాలంలో స్పందించి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉండగా కొంత ఆలస్యం అయిందని అన్నారు.జూన్ మొదటి రెండు వారాల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని చివరి రెండు వారాల్లో జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు పూర్తి స్థాయిలో పడనున్నట్టు వాతావరణ విభాగం అధికారులు తెలియజేశారని చెప్పారు.కావున రానున్న నైరుతి రుతుపవన కాలంలో తుఫానులు,అధిక వర్షాలతో వరదలు వంటి ఎలాంటి విపత్తులు సంభవించినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ఆస్థి,ప్రాణ నష్టాలు జరగకుండా నివారించేందుకు తగిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్దమై ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్.డా.సమీర్ శర్మ స్పష్టం చేశారు.ముఖ్యంగా అధిక వర్షాలతో రిజర్వాయర్లు,చెరువులకు గండ్లు పడితే వాటిని ఏవిధంగా సకాలంలో పునరుద్ధరించాలనే దానిపై ప్రత్యేక కార్యచరణతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు.రిజర్వాయర్ల గేట్లు సక్రమంగా పనిచేసేలా ఇప్పటి నుండి చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక తుఫానులు,వరదలు వంటి విపత్తుల సమాచారాన్ని సకాలంలో సంబంధిత శాఖల అధికారులు అందరూ పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను రూపొందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ ను సిఎస్ ఆదేశించారు.విపత్తుల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల వద్దగల వివిధ లైఫ్ సేవింగ్ పరికరాలన్నీ సక్రంగా ఉపయోగంలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆయా శాఖల అధికారులకు సూచించారు.

వీడియో లింక్ ద్వారా ఈసమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన డ్యాంలు,రిజర్వాయర్లు,ఇతర ముఖ్య చెరువులకు సంబంధించిన గేట్లన్నీ సక్రమంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అందరు చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.టిఆర్అండ్బి ఇఎన్సి మాట్లాడుతూ జెసిబిలు,ఇసుక బస్తాలు వంటి అత్యవసర మెటీరియల్ అంతటినీ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యంగా తాగునీరు,పారిశుధ్య నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు.మున్సిపల్,ఇంధన,వైద్య ఆరోగ్యం,వ్యవసాయ, మత్స్య,పౌరసరఫరాలు,అగ్నిమాపక,పోలీస్ శాఖలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలు,సంస్థలైన ఎన్డిఆర్ఎఫ్,ఇండియన్ నేవీ,ఆర్మీ,ఎయిర్ ఫోర్సు,ఇస్రో తదితర విభాగాలకు సంబంధించి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత శాఖల అధికారులు వీడియో లింక్ ద్వారా సిఎస్ కు వివరించారు.

ఇంకా ఈసమావేశంలో విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ డిజి శంకభాక్త బాగ్చి,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్,ఇడి నాగరాజు,ఐఎండి శాస్త్రవేత్త కరుణా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

      

Comments