విజయవాడ (ప్రజా అమరావతి);
ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
• అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత
• ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయి.. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10లో అందరూ అబ్బాయిలే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద, మధ్యతరగతి వారికి ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు వినియోగించుకుని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పొందాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం ఈఏపీసెట్-2022 ఫలితాల విడుదల కార్యక్రమం జరిగింది. అనంతరం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి 10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... కరోనా పరిస్థితుల దృష్ట్యా గడిచిన రెండేళ్లు పరీక్షలు లేని కారణంగా ఈ సారి ఇంటర్ మార్కులుకు ఈఏపీ సెట్ 2022లో ఎలాంటి వెయిటేజీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది ఈఏపీసెట్‌లో జనరల్, ఓబీసీ విభాగంలో 25 శాతం (40 మార్కులు) వస్తే క్వాలిఫై అయినట్లు నిర్ధారిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైతే చాలు, వారిని క్వాలిఫై అయినట్లు పరిగణిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. ఈఏపీ సెట్ 2022కు మొత్తం 3లక్షల 111 మంది దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ విభాగంలో 2,05,518 మంది అగ్రికల్చర్ విభాగంలో 93,532 మంది, మరో 1061 మంది రెండు విభాగాల్లోనూ దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 1,49,118 మంది అమ్మాయిలు కాగా, 1,50,993 మంది అబ్బాయిలు నమోదు అయ్యారన్నారు. పరీక్షలకు 2,82,496 మంది హాజరు కాగా 2,56,983 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,94,752 మంది హాజరుకాగా, అందులో 1,73,572 మంది అంటే 89.12 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది హాజరుకాగా, అందులో 83,411 మంది అంటేగా 95.06 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. రాష్ట్రంలో మొత్తం 258 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, అందులో 1,48,283 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఫార్మసీలో 127 కాలేజీలు ఉండగా 16700 సీట్లు ఉన్నాయన్నారు. త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు.
ఈఏపీసెట్-2022కు ఏప్రిల్ 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, జూన్ 20వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించామని గుర్తు చేశారు. జూలై 4 నుంచి 8వ తేదీ వరకూ ఇంజినీరింగ్ విభాగానికి, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ లో కూడా రెండు కాలేజీల్లో సెంటర్లు నిర్వహించామన్నారు. 12వ తేదీనే ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలకు మూడు రోజుల సమయం ఇచ్చామన్నారు. పరీక్షలు నిర్వహించిన కేవలం రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేసిన అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఫలితాల్లో అబ్బాయిలదే హవా....
ఏపీ ఈఏపీ సెట్ -2022 ఫలితాల్లో టాపర్స్ గా అబ్బాయిలే ఎక్కువగా నిలిచారు. ఇంజనీరింగ్ & ఫార్మసీ విభాగంలో టాప్-10 లో అందరూ అబ్బాయిలే ఉండటం గమనార్హం.. అలాగే అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో టాప్ -10లో 8 మంది అబ్బాయిలు కాగా, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇంజనీరింగ్ & ఫార్మసీ విభాగంలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపూర్ కి చెందిన బోయ హారీన్ సాత్విక్ మొదటి ర్యాంక్ సాధించాడు. మొత్తం 160 మార్కులకు గాను 158.62 మార్కులు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి 158.56 మార్కులతో రెండో స్థానాన్ని సాధించాడు. మెండా హిమ వంశీ (శ్రీకాకుళం), త్రాసుల ఉమేష్ కార్తికేయ (పార్వతీపురం మన్యం)లు 3, 4 ర్యాంకులు సాధించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన గంజి శ్రీనాథ్ 5వ ర్యాంక్, జాస్తి యశ్వంత్ వీవీఎస్ 6వ ర్యాంక్, బుస శివ నాగ వెంకట ఆదిత్య 7వ ర్యాంక్ సాధించారు. వలవల చరణ్ తేజ (మల్కిపురం) 8వ ర్యాంక్, నందన్ మంజునాథ్ ఇమ్మడిశెట్టి (హైదరాబాద్) 9వ ర్యాంక్, నూతక్కి రిత్విక్ (మంగళగిరి) 10వ ర్యాంక్ సాధించి తమ సత్తా చాటారు. అలాగే అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన వజ్రాల దినేష్ కార్తీక్ రెడ్డి 155.57 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. మట్టా దుర్గా సాయి కీర్తి తేజ (జంగారెడ్డి గూడెం) రెండో ర్యాంక్, ఆసు ఇందు (పెనుగొండ, ప.గో. జిల్లా) 3వ ర్యాంక్, కల్లం తరుణ్ కుమార్ రెడ్డి (గుంటూరు) 4వ ర్యాంక్, గునుకుంట్ల తత్వ మయూఖ (వైఎస్సార్ జిల్లా కడప) 5వ ర్యాంక్, చిలక పార్థేందర్ అజయ్ (కొవ్వూరు) 6వ ర్యాంక్, వీ వీ ఎస్ శ్రీ శశాంక్ గోపిశెట్టి (తెలంగాణ) 7వ ర్యాంక్, సారెడ్డి సాయి విఘ్నేష్ రెడ్డి (తెలంగాణ) 8వ ర్యాంక్, సామల సాత్విక్ రెడ్డి (తెలంగాణ) 9వ ర్యాంక్, కొక్కిలిగడ్డ స్టాన్లీ ప్రణహిత్ (ఆకివీడు) 10వ ర్యాంక్ సాధించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్యామలరావు, జేఎన్‌టీయూకే అనంతపురం వైస్ ఛాన్సలర్ రంగ జనార్థన్, కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లక్ష్మమ్మ, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment