ఘనంగా ప్రభుత్వ ఇ-హాస్పిటల్ అవార్డుల ప్రదానోత్సవం 7 విభాగాల్లో మొత్తం 20 మందికి అవార్డులు ప్రదానం..


విజయవాడ (ప్రజా అమరావతి);


ఘనంగా ప్రభుత్వ ఇ-హాస్పిటల్ అవార్డుల ప్రదానోత్సవం

7 విభాగాల్లో మొత్తం 20 మందికి అవార్డులు ప్రదానం..


రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ఇ-హాస్పిటల్ విధానంపై ఉత్తమ పనితీరు కనబర్చిన ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్. నవీన్ కుమార్ అవార్డులను ప్రదానం చేశారు. వారిని శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేసి అభింనదనలు తెలిపారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం నాడు విజయవాడ బందర్ రోడ్ లోని ఆర్ అండ్ బీ బిల్డింగ్స్ లోని 3వ ఫ్లోర్లో ఉన్న ఎన్ఐసీ కార్యాలయంలో నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మొత్తం 7 కేటగిరీలలో (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, అన్ని మ్యాడ్యూల్స్ లో ఉత్తమ పనితీరు కనబర్చిన ఆస్పత్రులు, డాకర్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రోలవుట్ మేనేజర్లు) 20 మందికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ... ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ఇ-హాస్పిటల్ సాఫ్ట్‌ వేర్ ను రాష్ట్రవ్యాప్తంగా 54 ఆసుపత్రులు అమలు చేశాయన్నారు. 12 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు (జీజీహెచ్), , 14 జిల్లా ఆసుపత్రులు, 28 ఏరియా ఆసుపత్రుల్లో ఈ డిజిటల్ సేవలను జనవరి 2022లో ప్రారంభించామని తెలిపారు. ఇ-హాస్పిటల్ సాప్ట్ వేర్ లో పేషెంట్ రిజిస్ట్రేషన్ (OPD & క్యాజువాలిటీ), IPD (అడ్మిషన్, డిశ్చార్జ్ & ట్రాన్స్‌ఫర్), బిల్లింగ్, ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రేడియాలజీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, క్లినిక్ (OPD & IPD), ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఇ- బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ,  స్టోర్స్, డైటరీ, లాండ్రీ మరియు OT నిర్వహణ వంటి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన12 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పిటల్‌ లోని వైద్యులు, ఆపరేటర్లు,సిబ్బందికి ప్రతి మాడ్యూల్‌పై తగిన శిక్షణ ఇచ్చామన్నారు. సాఫ్ట్‌ వేర్ సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలను కలుగజేసి ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనివిధాలా కృషి చేస్తుందని నవీన్ కుమార్ తెలిపారు.  ఇ-హాస్పిటల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ను ముందుకు తీసుకెళ్లడంలో వివిధ అధికారుల సహకారాన్ని గుర్తించడానికి ఈ అవార్డుల కార్యక్రమం ఎంతో ప్రొత్సాహాన్నిస్తుందని అవార్డు గ్రహీతలు తెలిపారు. ఇప్పటి వరకు 13.35 లక్షల మంది రోగుల రిజిస్ట్రేషన్లు, 42926 ల్యాబ్ పరీక్షలు, 13896 క్లినికల్ చికిత్సలు, 151 రేడియాలజీ పరీక్షలు నిర్వహించామన్నారు. 9047 ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌ లు తయారయ్యాయని  నవీన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

….2

//  2    //

అవార్డు గ్రహీతల వివరాలు.. 

ఉత్తమ పనితీరు కనబర్చిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు విభాగంలో డా. బి. సౌభాగ్యలక్ష్మి (విజయవాడ), డా. పి. వెంకట బుద్ద (కాకినాడ), డా. టి. భారతి (ఎస్.వి.ఆర్.ఆర్., తిరుపతి)  అవార్డులు కైవసం చేసుకున్నాయి.  ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లా ఆసుపత్రులు విభాగంలో డా. ఎ.వి.ఆర్. మోహన్ (ఏలూరు), డా. కె. సీతారామరాజు (విజయనగరం), డా. పాల్ సతీష్ కుమార్ (రాజమహేంద్రవరం) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. ఉత్తమ పనితీరు కనబర్చిన ఏరియా ఆస్పత్రులు డా. కె. సుబ్బారావు (కావలి), డా. ఎం. హరి (అరకు వాలీ), డా. ఎస్. ప్రవీణ్ (రాజమహేంద్రవరం) సాధించాయి. అన్ని మాడ్యూల్స్ లో ఉత్తమ పనితీరు కనబర్చిన ఆస్పత్రులు డా. నీలం ప్రతిభావతి (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, గుంటూరు), డా. డి. సత్యనారాయణ (జిల్లా ఆసుపత్రి, మచిలీపట్నం) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ పనితీరు కనబర్చిన డాక్టర్లుగా డా. జి. దుర్గా ప్రసాద్ (జీజీహెచ్, గుంటూరు), డా. పల్లవి జి. (ఏరియా ఆసుపత్రి, పలమనేరు), డా. కొప్పోలు రాకేష్ (ఏరియా ఆసుపత్రి, కుప్పం) అవార్డు సాధించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కన్నెపల్లి మౌళీధర్ (జీజీహెచ్, శ్రీకాకుళం) డి. నాగార్జున (జీజీహెచ్, కాకినాడ), కె. వెంకట సుబ్బారావు (జిల్లా ఆసుపత్రి, ఏలూరు)లు నిలిచారు. ఉత్తమ పనితీరు కనబర్చిన రోలవుట్ మేనేజర్లు గా కుచిపూడి బాబు (ఎస్.వి.ఆర్.ఆర్, తిరుపతి), డేగల మణికంఠ (జీజీహెచ్, కాకినాడ), కళ్లేపల్లి రాకేష్ కుమార్ (జిల్లా ఆసుపత్రి, మచిలీపట్నం) అవార్డులు సాధించారు.

అవార్డు గ్రహీతల స్పందన... 

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమం అమలులో భాగంగా అన్ని పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని బెస్ట్ ఫెర్ఫామింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గా విజవాడ జీజీహెచ్ ఎంపికావడం ఎంతో సంతోషకరమని సూపరింటెండెంట్ డా. బి. సౌభాగ్య లక్ష్మి అన్నారు.  గుంటూరు జీజీహెచ్ అన్ని మాడ్యూల్స్ లో ఉత్తమ పనితీరుకు అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని సూపరింటెండెంట్ డా. నీలం ప్రతిభావతి తెలిపారు. గుంటూరు జీజీహెచ్ లో ఓపీ, ఐపీ, ఫార్మసీ, రేడియోలజీ వంటి అన్ని మాడ్యూల్స్ ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.  ఉత్తమ పనితీరు కనబర్చిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా అవార్డు రావడంతో మేం పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. పి. వెంకట బుద్ద తెలిపారు. ఈ పథకం అమలులో మొదటి వారం రోజులు కొంత ఇబ్బంది పడ్డామని, వారం తర్వాత సమర్థవంతంగా నిర్వహించామన్నారు.  


Comments