నూరుశాతం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:సిఎస్

 నూరుశాతం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:సిఎస్ 


అమరావతి,20 జూలై (ప్రజా అమరావతి):సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు(Sustainable Development Goals)సాధనలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశపు యాక్షన్ టేకెన్ రిపోర్టు (ATR),సియం హామీలు అమలు,గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జాతీయ స్థాయలో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించిన పలు అంశాలు,ఇతర అజెండా అంశాలపై కార్యదర్శులతో సమీక్షించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి నీతిఆయోగ్ నిర్దేశించిన కీఇండికేటర్ల ప్రకారం ఇండికేటర్ వారీ పూర్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని చెప్పారు.గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి పరిష్కరించాల్సిన వివిధ పెండింగ్ అంశాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే గత నెలలో ధర్మశాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించిన వివిధ అంశాలను కార్యదర్శులకు వివరించారు.వాటిలో ముఖ్యంగా పంటల మార్పిడి విధానం,నూతన విద్యా విధానం,ప్రకృతి వ్యవసాయం,కృషి విజ్ఞాన కేంద్రాల పటిష్టీకరణ,అధిక దిగుబడులను ఇచ్చే నూతన వంగడాలు,నూతన డ్రోన్ పాలసీ, గోవర్థన్ స్కీమ్,యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్,పియం గతిశక్తి పధకం, పౌష్టికాహార లోపం సవాళ్ళు,స్పోర్ట్స్ ఎకానమీ,దేశ జడిపిలో టూరిజం కాంట్రిబ్యూషన్ తదితర అంశాలపై వివరించారు.వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు రాష్ట్రానికి అధికంగా ఉపయోగ పడేందుకు వీలున్న వాటిపై ఆలోచన చేసి వాటిపై సంబంధిత శాఖల కార్యదర్శులు తగిన నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలని సిఎస్ డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ కార్యదర్శులతో సమీక్షించారు.

అంతకు ముందు సంబంధిత శాఖల కార్యదర్శులు వారి వారి శాఖలకు సంబంధించిన చర్యల నివేదిక,ఇతర అంశాలను సిఎస్ కు వివరించారు.

ఈసమావేశానికి ముందుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి అజెండా అంశాలపై మాట్లాడారు.సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్,బి.రాజశేఖర్,వై.శ్రీలక్ష్మి,అనంతరాము,అజయ్ జైన్,ఎస్ఎస్ రావత్,రజత్ భార్గవ,పూనం మాలకొండయ్య తోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,విభాగాధిపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

     

Comments