శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు దేవస్థానం నందు "డయిల్ యువర్ ఇ.ఓ" కార్యక్రమం శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిచే మధ్యాహ్నం 3-00 గం.ల నుండి 4-00 గం.ల వరకు నిర్వహించుట జరిగినది. మొత్తము 9 మంది భక్తుల నుండి ఫోన్లు వచ్చియున్నవి. అందులో 1) విజయవాడ నుండి రేఖ అను భక్తురాలు ఫోన్ చేసి టోల్ గేటు నందు ఆటో పార్కింగ్ ఫీజు నిమిత్తం రూ.10 లు రెండు ఇచ్చియున్నారు అని, అలా కాకుండా ఉచితంగా పంపితే బాగుంటుందని తెలుపగా, కార్యనిర్వహణాధికారి వారు విచారణ చేస్తామని తెలిపారు. 2) విజయవాడ నుండి భాను అనే భక్తులు ఫోనుచేసి ఘాట్ రోడ్ నందు ఏర్పాటు చేసిన ఓం-కారం గుర్తు గతములో లాగా వెలుగుట లేదు అని, సదరు లైటింగ్ తిరిగి ఏర్పాటు చేయించవలసినదిగానూ, మరియు ఉత్సవముల సమయంలో లాగా ఆకర్షణ గా లైటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరియున్నారు. అందుకు కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ ఓం-కారం గుర్తు repair పనులు జరుగుచున్నవని, మరొక 2,3 రోజులలో పనులు పూర్తగునని, అలాగే ఉత్సవ సమయంలో లాగా లైటింగ్ శాశ్వత పద్దతిలో చేయుటకు పరిశీలిస్తున్నామని తెలిపియున్నారు. 3) జి.కొండూరు మండలం కవులూరు నుండి సువర్ణ కుమారి అను భక్తురాలు ఫోన్ చేసి, 5 మంది శ్రీ అమ్మవారి దర్శనం త్వరితగతిన పొంది, దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరం నందు మందులు తీసుకున్నామని, బాగా పని చేస్తున్నాయని, ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు కార్యనిర్వహణాధికారి వారికి ధన్యవాదములు తెలిపి, ఇటువంటి కార్యక్రమములు మరిన్ని నిర్వహించాలని కోరుచూ వారి యొక్క సంతోషమును తెలియపరిచారు. అందుకు కార్యనిర్వహణాధికారి వారు ధన్యవాదములు తెలిపారు.
4) విజయవాడ నుండి ఆదినారాయణ మూర్తి అనే భక్తులు ఫోనుచేసి ఆషాఢ మాస ఉత్సవములు మరియు ఇతర రోజులలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది సాదరంగా ఆహ్వానం పలికి, మంచిగా శ్రీ అమ్మవారి దర్శనము కల్పించారని సంతృపి వ్యక్తపరిచి, కార్యనిర్వహణాధికారి గారికి, అధికారులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపియున్నారు. అలాగే ఉత్సవ సమయములు మరియు ఊరేగింపు జరుగునపుడు ఆలయ వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగలవాయిద్యములతో పాటుగా, లలితా పారాయణ బృందముల వారిచే లలితా సహస్రనామ పారాయణలు ఉచితముగా పారాయణ చేయు బృందముల వారితో పారాయణ చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తపరిచగా, అందుకు కార్యనిర్వహణాధికారి వారు ఈ విషయమును పరిశీలించి తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేసియున్నారు.
5) విజయవాడ నుండి వెంకటేశ్వర రావు అనే భక్తుడు ఫోనుచేసి దేవస్థానము నందు రాత్రి పూట భక్తులు నిద్రచేయుటకు అవకాశం కల్పించవలసినదిగా కోరగా, కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ, మహామండపం 1 వ అంతస్తు నందు ప్రస్తుతం భక్తులు నిద్ర చేయుటకు వసతి ఉన్నదని, భక్తులు ప్రతిరోజు నిద్ర చేయుచున్నారని తెలియజేసియున్నారు.
6) భవానీపురం నుండి ప్రసాద్ అను ఒక భక్తులు ఫోను చేసి దేవస్థానము నందు తక్కువ రద్దీ ఉన్న సమయములలో కూడా ప్రధాన ఆలయ సెక్యురిటి సిబ్బంది త్వరగా పంపించేస్తున్నారని తెలుపగా, కార్యనిర్వహణాధికారి వారు తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
7,8) విజయవాడ నుండి సుబ్రహ్మణ్యం, వైజాగ్ నుండి అరుణ అను భక్తులు ఫోన్ చేసి, రూ.300/- లు టికెట్ తీసుకున్నా, కొందరు ID కార్డులు చూపించి బంగారు వాకిలి దర్శనం క్యూ -లైన్ లో వెళుతున్నారని తెలుపగా, సదరు విషయములు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణాధికారి వారు తెలిపారు.
9) విజయవాడ నుండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆలయము నందు రద్దీ తక్కువ ఉన్న సమయములో రూ.300/- టికెట్ వారికి బంగారు వాకిలి క్యూ లైన్ ద్వారా పంపితే బాగుంటుందని వారి అభిప్రాయం తెలుపగా, సదరు విషయములు పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణాధికారి వారు తెలిపారు.
తదుపరి డయల్ యువర్ ఈవో కార్యక్రమం 2 వారాల తరువాత నిర్వహించబడునని, ఈ విధముగా ఇక నుండి జరిగే ప్రతి “డయిల్ యువర్ ఇఓ” కార్యక్రమములో భక్తులు పాల్గొని, వారి విలువైన సలహాలు, సూచనలు తెలియపరచవలసినదిగా కార్యనిర్వహణాధికారి వారు కోరడమైనది.
addComments
Post a Comment