హిందూ దేవాలయాల నిధుల మళ్ళింపు వాస్తవం కాదు - దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

 హిందూ దేవాలయాల నిధుల మళ్ళింపు వాస్తవం కాదు - దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.


 సెక్రటేరియట్ పబ్లిసిటీ సెల్; తేదీ 18 జూలై (ప్రజా అమరావతి) :

    రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిధుల మళ్ళింపు జరిగినట్టు గత రెండు రోజులుగా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలు సత్య దూరమన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. సోమవారం పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో  5 లక్షల ఆదాయం, పైబడి ఉన్న ప్రతి దేవాలయం తమ ఆదాయం నుండీ కామన్ గుడ్ ఫండ్ కింద 9 శాతం మేర నిధులను దేవాదాయ శాఖకు జమచేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని, కాగా తమ ప్రభుత్వ హయాంలో 20 లక్షల మేర ఆదాయం ఉన్న దేవాలయాల నుండీ మాత్రమే నిర్దేశిత మొత్తం CGF కింద దేవాదాయ శాఖకు చెల్లించే ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ఈ వాస్తవం తెలుసుకోకుండా సదరు రాష్ట్ర నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకర మన్నారు.  కాగా, రాష్ట్రంలో ఉన్న 8 ప్రధాన దేవాలయాలకు అదనంగా వాటి తరువాత స్థానంలో ఉన్న మరో 32 దేవాలయాల పూర్తి స్థాయి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

  హిందూ దేవాలయాలు, భగవంతుని పట్ల తనకు, ముఖ్యమంత్రికి అపారమైన భక్తి, విశ్వాసాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఉన్న వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం తమ శాఖ అధికారులతో ప్రతివారం క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదాయం అధికంగా ఉన్న దేవాలయాల రాబడి నుండి చట్టంలో నిర్దేశించబడిన విధంగా 8 శాతం మొత్తం ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ గా, 1.5 శాతం మేర ఆడిట్ ఫండ్ గా,9శాతం మేర కామన్ గుడ్ ఫండ్ గా, మరో 3 శాతం మేర అర్చక సంక్షేమ నిధి గానూ డిపాజిట్ చేయిస్తున్నామని, ఈ మొత్తాల నుండి మాత్రమే తగిన ఆదాయం లేని దేవాలయాల నిర్వహణ, నిత్య ధూప, దీప నైవేద్యాల కోసం వచ్చే దరఖాస్తులకు అవసరం మేరకు చెల్లింపులు చేస్తున్నామని, తమ వద్ద నేటికి ఇంకా 3365 ఇలాంటి అభ్యర్థనలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.  వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, షెడ్యూల్డ్ నియోజకవర్గాలలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సాయం కోసం వచ్చే దరఖాస్తుల విషయంలో  మరికొంత వెసులుబాటు ఇచ్చి అధిక మొత్తం కేటాయిస్తున్నామన్నారు.

అలాగే అన్ని దేవాలయాల రాబడి, ఖర్చులపై మార్చి, 2022 చివరికల్లా ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించేందుకు నిర్ణయించామని, కాగా సెప్టెంబర్ 2022 చివరికి ఆడిట్ పూర్తి కోసం   అధికారులు గడువు కోరారన్నారు. ప్రతి దేవాలయం లోనూ భక్తుల కోరిక మేరకు అన్ని పూజలు, కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం, వారికి అవసరం అయిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వంలో  వారి పార్టీ సభ్యుడే కొన్నాళ్ళు దేవాదాయ మంత్రిగా పనిచేసి ఉన్నారని, ఆయన హయాంలో, వివిధ కారణాలతో రాష్ట్రంలో 44 దేవాలయాలను కూలగొట్టించారని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న నాయకుడు సదరు విషయం పై కనీసం విచారం కూడా వ్యక్తంచేయక పోవడం శోచనీయం అన్నారు. తమ శాఖలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదని, తమ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలను తీవ్రంగా పరిగణించి రుజువైన పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తమ శాఖ నిధుల నుండి అన్య మతాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని ఆరోపించడం అవాస్తవం, అసాధ్యం అన్నారు. దేవాలయాల ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో సంబంధిత దేవాలయ కార్యనిర్వహణాధికారి స్థాయి నుండి శాఖ కమిషనర్ వరకూ అందరూ జవాబుదారులేనన్నారు.

రాష్ట్రంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం అందే ప్రతిపాదనలపై ప్రభుత్వం అందించే నిధులకు  మాచింగ్ ఫండ్ మొత్తాలు  CGF నిధుల నుండీ సమకూర్చాల్సి ఉండగా వివిధ దేవాలయాల నుండీ ఈ పద్దుకు జమ కావాల్సిన మొత్తాలు సుమారు 160 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో ఉన్నాయన్నారు. అయితే అలా జమ కావాల్సిన మొత్తాలు కూడా ఆయా దేవాలయాల కమిటీలు మిగులు నిధులుగా పరిగణించి ఫిక్స్డ్ డిపాజిట్లు రూపంలో బ్యాంకులలోనే ఉంచారని,  వాటి విషయంలోఎక్కడా అవినీతి జరగలేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, వెంటనే వారు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఇకపై వాస్తవాలు తెలుసుకుని మాత్రమే మాట్లాడాలని సలహా ఇచ్చారు.

    అలాగే వివిధ దేవాలయాల పాలక మండళ్ళు వాటి కాల పరిమితి తీరే వరకూ అధికారంలో ఉంటాయని, కాల పరిమితి  తీరకుండా వేటినీ రద్దు చేసే సమస్య లేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, దుర్గ గుడి ఘాట్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచన చేస్తున్నామని, ఆ ఆలోచన అమలు చేసే సమయంలో ఘాట్ రోడ్డు మూసివేసి ప్రతి ఒక్కరికీ రాజ గోపురం మార్గం ద్వారానే ఆలయ ప్రవేశం కల్పించే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే, ఉత్సవాల సమయాల్లో ఓకే సమయంలో కనీసం 30, 40 వేల మంది భక్తులు కొండపై ఉండి వీక్షించే వీలు కల్పించే విధంగా, ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్ కి అదనంగా ఇంకో క్యూ కాంప్లెక్స్ కట్టే ఆలోచన ఉందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే శ్రీశైలం దేవస్థానం లో తూర్పు ద్వార ప్రవేశం కల్పన, అక్కడ అధికంగా వసూలు చేస్తున్న అభిషేకం రుసుముల విషయం తమ దృష్టికి తీసుకుని వచ్చిన పత్రికా ప్రతినిధులను ఆయన ఆ సందర్భంగా అభినందించారు. 

  ఈ కార్యక్రమంలో ఇంకా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


Comments