ఆహారం రూపంలో మనం తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్‌ వలన రక,రకాల వ్యాధుల బారిన పడుతున్నాం


వైయస్సార్‌ జిల్లా (ప్రజా అమరావతి);


*పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*హాజరైన ఎంపీ వైయస్‌.అవినాష్‌ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు.*


*ప్రకృతి సేద్యంపై పరిశోధనకు పులివెందులలో ప్రపంచ స్దాయి ఇండో–జర్మన్‌ అకాడమీ ఏర్పాటు*

*పులివెందులలోని ఏపి– కార్ల్‌లో న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఐజీ జీఏఏఆర్‌ఎల్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.... :*

 

*ప్రకృతి సాగు - సమగ్ర అవగాహన*

అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.

ఇవాళ మనం రక,రకాల కేన్సర్‌ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల కాలంలో కేన్సర్‌ పెరుగుదలతో పాటు విస్తరిస్తూ వస్తోంది. ప్రధానంగా మన ఆహారం వలన, ఆహారం రూపంలో మనం తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్‌ వలన రక,రకాల వ్యాధుల బారిన పడుతున్నాం


. దీన్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం... మనం ఆహారం రూపంలో తీసుకుంటున్న రసాయనాలు(కెమికల్స్‌)ను తగ్గించడమే. అది కేవలం గ్రామస్ధాయిలో సమగ్రమైన ఆవగాహన, విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రకృతివ్యవసాయంపై గ్రామస్ధాయిలో సరైన అవగాహన అవసరం.

మనం గ్రామస్ధాయిలో ఇప్పటికే ఆర్బీకేలు( రైతు భరోసా కేంద్రాలు) పేరుతో ఒక వ్యవస్ధను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సుమారు 10,700 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం ఉంది. 


*ఆర్బీకేలు - విత్తనం నుంచి విక్రయం వరకూ..*

రైతు భరోసా కేంద్రాలు రైతులను సాగులో చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు అంటే విత్తనాలు వేసుకున్నప్పటి  నుంచి మొదలు రైతులు తాము పండించిన పంటను విక్రయించేంత వరకు  రైతులకు సాయంగా నిలబడుతున్నాయి. ఇది రైతు భరోసా కేంద్రాల ప్రాధమిక విధి. రైతులకు చేయూతనందించే కార్యక్రమాల్లో భాగంగా ఆర్బీకేలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్‌ నాణ్యతను పరీక్షించి, వాటికి గ్యారంటీ ఇస్తూ... కల్తీ విత్తనాలు, ఎరువులును నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఆర్బీకేలు పనిచేస్తున్నాయి. 

 

ఈ రకమైన ఇన్‌పుట్స్‌ అందించడమే కాకుండా రైతుల ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఆర్బేకేల ద్వారా కల్పిస్తోంది. 


*ఆర్బీకేలు- ప్రకృతిసేద్యం*

వీటికి అదనంగా ఆర్బీకేలకు ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని కూడా జత చేస్తున్నాం. దీన్ని ఏ రకంగా నిర్వహించాలంటే... తొలుత మనం దీనికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అందుకు అవసరమైన మాస్టర్‌ ట్రైనర్స్‌ను, వ్యవసాయ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచుకోవాలి. 10,700 ఆర్బీకేల్లో కచ్చితంగా ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్‌ ట్రైనర్, సైంటిస్ట్‌ ఉండాలి. ఈ రకమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆర్బీకేలో ఉంటే... తను ఆ గ్రామంలో పెద్ద సంఖ్యలో రైతులకు శిక్షణ ఇవ్వగలుగుతాడు. అదే విధంగా గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌(సీఆర్పీస్‌), ఆగ్రి సైంటిస్ట్‌ ఇద్దరూ కలిస్తే వారికున్న పరిజ్ఞానాన్ని గ్రామంలో మిగిలిన రైతులకు అందించగలుగుతారు. అదే విధంగా రైతుభరోసా కేంద్రంలో ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కూడా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)ల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది.  వీళ్లంతా కలిసి ఆ గ్రామాన్ని ప్రకృతి సాగు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తారు.


ఈ ఆర్బీకేలలోకి ప్రకృతిసాగు విధానాలను తీసుకురాగలిగితే.. రసాయనాల వినియోగాన్ని క్రమంగా పక్కకు తప్పించవచ్చు. అయితే రసాయనాల వినియోగం నుంచి ప్రకృతి సాగు వైపు వస్తే.. వెంటనే విపరీతమైన ఆదాయాలు వస్తాయని కూడా నేను చెప్పడం లేదు. ఆదాయాలు తొలుత తగ్గవచ్చు కూడా. అందుకనే రైతుకు 3 ఎకరాల ఉంటే...  తొలి ఏడాది మూడోవంతు మాత్రమే ప్రకృతిసాగు చేపట్టాలి.  రెండో ఏడాది 50శాతం, మూడో ఏడాది మొత్తంగా ప్రకృతిసాగు వైపు మరలాలి. నాలుగో ఏడాది నాటికి కానీ రైతు తన మొత్తం పొలంలో ప్రకృతిసాగు వైపు వెళ్లడు. మూడేళ్లపాటు రైతు తన పొలంలో ప్రకృతిసాగుతో మమేకం కావడం వలన మంచి ఫలితాలను తీసుకురాగలుగుతాడు. దాని వల్ల నాలుగో సంవత్సరంలో పెస్టిసైడ్స్, ఎరువుల వాడకం లేకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మరో వైపు భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక లక్ష్యంతో జరుగుతున్న కార్యక్రమం.


*ఐజీ గార్ల్‌ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌)*

 అందులో భాగంగా ఇవాళ మనం ఇండో జర్మన్‌ గ్లోబల్‌ అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఐజీ జీఏఏఆర్‌ఎల్‌)ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. 

అత్యున్నతమైన ప్రపంచ శ్రేణి సంస్ధ వంటి ఏర్పాటు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. గ్రామస్ధాయిలో ఈ రకమైన శిక్షణ కోసం మనం ఈ అకాడమీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ దిశగా మందుకు వెళ్తున్నాం. 

జర్మన్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారాలతో మనం ప్రకృతి వ్యవసాయంలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా.. ప్రకృతిసేద్యంలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలతో పాటు పీహెచ్‌డిలు కూడా అందించబోతున్నాం. ఎప్పుడైతే ఈరకమైన డిగ్రీలను మనం అందుబాటులోకి తీసుకువస్తున్నామో... ఇక్కడ నుంచి వచ్చే విద్యార్ధులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుంది. అప్పుడు ఈ యూనివర్సిటీ నుంచే ప్రకృతి సేద్యం దేశానికే కాదు.. ప్రపంచానికే అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మన లక్ష్యం, మన స్వప్నం. ఆ లక్ష్యంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం.


రాష్ట్రంలో మొత్తం సుమారు 50 లక్షలు మంది రైతులుంటే.. కేవలం 6 లక్షలు మంది రైతులు మాత్రమే ప్రకృతిసాగులో మమేకమై ఉన్నారు. దీనికోసం ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం 6 లక్షల ఎకరాల్లో మాత్రమే ఉంది. మరోవైపు వ్యవసాయ శాస్త్రవేత్త, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌ ఆర్బీకేల్లో అందుబాటులో ఉండాలి. వీరి పాత్ర చాలా క్రియాశీలకమైనది.


*ఆర్బీకే- సర్టిఫికేషన్‌*

 సహజసాగు ఉత్పత్తులకు ఆర్బీకే స్ధాయిలో సర్టిఫికేషన్‌ చేసే సౌలభ్యం అందుబాటులో ఉన్నప్పుడే ... మన ఉత్పత్తులుకు అధిక ధరలు లభిస్తాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌పీఓ) కనీసం ఒక్కటి ఉండేలా భవిష్యత్తులో అడుగులు వేస్తాం. ఒక్కసారి ప్రకృతిసాగు  ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం ఎప్పుడైతే జరుగుతుందో.. అప్పుడు గ్రామంలో ఉన్న రైతులందరూ ప్రకృతిసాగు వైపు మరలడంతో పాటు రసాయనాల వాడకానికి స్వస్తి చెబుతారు. 


*ఇది మన స్వప్నం...*

ఇది మనం ఆశిస్తున్న మార్పు, మనం కంటున్న కల. దీనికి చాలా దూరంలో ప్రయాణించాల్సి ఉంది. మన స్వప్నం సాకారమయ్యే దిశలో ఇవాళ మనం మొదటి అంకంలో ఉన్నాం. ఈ ముందుకు ప్రయాణించే క్రమంలో ఏళ్లు పట్టవచ్చు. ఇవాళ మనం విత్తనం నాటాం... రానున్న మూడు నుంచి ఐదేళ్లలో మంచి ఫలితాలు రావచ్చు.  ఏడు, ఎనిమిదేళ్లలో అసారధారణమైన ఫలితాలు చూడవచ్చు. 


పులివెందులలో ఈ ఐజీ కార్ల్‌ గా ఉన్న కాలేజీ ఐజీ గార్ల్‌గా ఇవాల్టి నుంచి మారిపోతుంది. త్వరలోనే ఇది ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ నుంచి సహజసాగులోనే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డి విద్యార్ధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. జర్మన్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వామ్యులను చేసి ఇక్కడ నుంచి అటువంటి గొప్ప వ్యక్తులను తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతుంది. అది మన స్వప్నం. దేవుడి దయ వల్ల కచ్చితంగా జరుగుతుందని మనసారా ఆశిస్తున్నాను. ఇక్కడకు వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదములు అని సీఎం అన్నారు.

Comments