నెల్లూరు, జులై 22 (ప్రజా అమరావతి):--ప్రజల నుండి అందే స్పందన అర్జీల పరిష్కారంపై సరైన అవగాహన కలిగి నాణ్యతతో పరిష్కరించే దిశగా దృష్టి సారించాల
ని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకటనారాయణమ్మ అధికారులకు సూచించారు.
శుక్రవారం ఉదయం నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ఎల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పందన కార్యక్రమం అమలు తీరుతెన్నులు అర్జీల రిజిస్ట్రేషన్, పరిష్కారం తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులు మళ్ళీ మళ్ళీ రావడం ఎక్కువగా ఉందని గమనించి స్పందన కార్యక్రమం పర్యవేక్షించే ఆర్ టి జి ఎస్ రాష్ట్ర బృందం జిల్లాకు వచ్చిందన్నారు.. ప్రజల సమస్యలు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే సాధ్యమైనంతవరకు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ప్రజల నుండి అందే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారున్ని సంప్రదించి అతని సమస్యలు తెలుసుకుని అతనికి అర్థమయ్యే విధంగా వివరాలు తెలియజేసి పరిష్కరిస్తే మళ్లీ అదే సమస్యపై అర్జీలు రావన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారి సాయి నుండి క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్కరు అర్జీల పరిష్కారంపై సరైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అంతే కాకుండా నిర్ణీత గడువులో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
స్పందన కార్యక్రమం శిక్షణ తరగతుల జిల్లా నోడల్ అధికారి డి ఆర్ డి ఏ పి డి శ్రీ కేవీ సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల ద్వారా అర్జీలు నాణ్యతతో పరిష్కరించేందుకు, మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వాస్తవ విషయాలతో సమాధానం తెలపాలన్నారు. ముఖ్యంగా అర్జీలను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయా లేదో ఒకసారి గమనించి తీసుకోవాలన్నారు. అర్జీదారులకు ఎండార్స్మెంట్ చేసే సమయంలో తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వకుండా సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఒకసారి సజావుగా ఉందో లేదో గమనించుకొని సంతకం చేసి పంపాలన్నారు. జిల్లాలో 21 శాతం అర్జీలు మరల వస్తున్నాయని ఇది చాలా హెచ్చరించదగ్గ విషయమని రాష్ట్రస్థాయిలో 5 శాతం లోగా ఉందని దీనిపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
స్పందన కార్యక్రమం రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ఎల్. శ్రీనివాసులు మాట్లాడుతూ అర్జీదారులకు న్యాయం చేసే విధంగా నాణ్యతతో పరిష్కారం ఉండాలన్నారు. జిల్లాలో 15,795 స్పందన అర్జీలు రాగా అందులో 15,509 అర్జీలు అనగా 98 శాతం అర్జీలు పరిష్కారం అయ్యాయన్నారు. అయితే ఇందులో 3283 అర్జీలు అనగా 21 శాతం అర్జీలు మరల వచ్చాయన్నారు. దీనికి కారణం అర్జీదారుల సమస్య పరిష్కరించినప్పటికీ దాన్ని సజావుగా ఒక పద్ధతి ప్రకారం సమాధానం చెప్పకపోవడం వల్ల అవి మరలా వచ్చాయన్నారు. ప్రధానంగా ఏపీ వైద్య విధాన పరిషత్, పాఠశాల విద్య,గ్రామ వార్డు సచివాలయాలు, పోలీసు తదితర శాఖల్లో అత్యధికంగా మరల దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్జీలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మెలకువలు పాటించాలని ముఖ్యంగా సరైన డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా సరి చూసుకోవాలని, అర్జీదారుని ఆధార్ నెంబర్కు అనుసంధానమైన మొబైల్ నెంబరు ఇచ్చారా లేదా ఒకసారి విచారించుకోవాలన్నారు. ప్రతిరోజు సచివాలయ పరిధిలోని ప్రజల నుండి అర్జీలను తీసుకొని క్షేత్రస్థాయిలోనే వారి అర్హతలను తెలియచెప్పాలన్నారు. ఎందుకు అర్హత లేదో తెలియకపోవడం వలన అర్జీలు మరలా మరలా వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల జిల్లా సమన్వయకర్తలు ఈ-జిల్లా మేనేజర్ శ్రీరాములు, కిరణ్, హేమంత్ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు..
addComments
Post a Comment