*పోలవరం డ్యామ్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ*
అమరావతి, జూలై 14 (ప్రజా అమరావతి): పోలవరం డ్యామ్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబందిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్రంలోని వరద పరిస్థితులపై సమీక్షించారు. గత కొన్నిరోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రత్యేకించి పోలవరం డ్యామ్ పరిసర ప్రాంతంలో సంభవిస్తున్న వరదల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల ద్వారా వారికి అవసరమైన ఆహారం, త్రాగునీరు ఇతర నిత్యావసరాలు సమకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర రెవిన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఇ.ఓ. సెక్రటరీ ఎం.గిరిజా శంకర్, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్సు ద్వారా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment