ఎస్సీ గురుకులాల్లో విద్యాబోధనా సంస్కరణలు


ఎస్సీ గురుకులాల్లో విద్యాబోధనా సంస్కరణలు


మరింత మెరుగైన ఫలితాల సాధనకు చర్యలు

పోటీ పరీక్షలకు కోసం టీచర్లకు, విద్యార్థులకు శిక్షణలు

మంత్రి మేరుగు నాగార్జున.

అమరావతి, జూలై 20 (ప్రజా అమరావతి): బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులు అత్యుత్తమైన ఫలితాలను సాధించేందుకు విద్యా బోధనా విధానాలను పటిష్టం చేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే విద్యాబోధనలో పలు సంస్కరణలు తీసుకురానున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. దీనిలో భాగంగానే అటు విద్యార్థులతో పాటుగా ఇటు టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో  ఎస్సీ గురుకుల విద్యాసంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గురుకులాల్లో  ప్రస్తుతం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాల కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు ఎక్కువగా శిక్షణ అవసరమైన బోధనాంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాల్లో విద్యా బోధనకు సంబంధించిన టైమ్ టేబుల్ ను మార్చడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరగతులను వర్గీకరించడం జరుగుతుందని తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలలో విద్యార్థులు సాధించే మార్కులను బట్టి వారికి గ్రేడ్లను కూడా నిర్ణయిస్తామని  తెలిపారు. ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలకు విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను కూడా విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఐఐటీలు, మెడికల్ కళాశాలల్లో మరింత ఎక్కువగా సీట్లను సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగానే  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో చదివే విద్యార్థులలో ఇంటర్మీడియట్  ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి, వారందరినీ ఒకే చోటికి చేర్చి వారికి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించిన శిక్షణ ఇస్తామని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడానికి, పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులను స్కోర్ చేయడానికి వీలుగా లెక్కలు (మ్యాథ్స్) భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం( కెమిస్ట్రీ) బోధించే అధ్యాపకులకు విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసే విధంగా అవసరమైన ప్రత్యేక శిక్షణలు కూడా ఇస్తామని నాగార్జున తెలిపారు. అదే విధంగా ఆంగ్లమాధ్యమం బోధించడానికి టీచర్లకు కూడా తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. అన్ని స్థాయిల్లో విద్యాబోధనను పటిష్టపర్చడం ద్వారా గురుకులాల్లో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో అడ్మిషన్ల ప్రగతిని కూడా ఈ సందర్బంగా నాగార్జున సమీక్షించారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో  ఇది వరకు ఇంటర్మీడియట్ సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఉండేదని అయితే ఈసారి అలా కాకుండా ఒక్క సీటు కూడా మిగలకుండా పూర్తి స్థాయిలో ఇంటర్ సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని చెప్పారు. అలాంటి గురుకులాలను అధికారులు సందర్శించి వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగుచర్యలు తీసుకోవాలని కూడా గురుకులం అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ సమావేశంలో బీఆర్ అంబేద్కర్ గురుకులాల సంస్థ కార్యదర్శి పావన మూర్తి, డిప్యుటీ అకడమిక్ మానిటరింగ్ అధికారి మల్లికార్జున, గుంటూరు డీసీఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Comments