నెల్లూరు, జూలై 4 (ప్రజా అమరావతి): ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం
గా జలశక్తి అభియాన్ - క్యాచ్ ద రైన్ - 2022 కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్, జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఇ. రవిందరన్ పేర్కొన్నారు..
ఒకరోజు జిల్లా పర్యటనకు విచ్చేసిన అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఇ. రవిందరన్, జల శక్తి అభియాన్ శాస్త్రవేత్త శ్రీ రూపేష్ కుమార్ డ్వామా పిడి శ్రీ తిరుపతయ్యతో కలిసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుడిగాలి పర్యటన చేసి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెరువులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాముల నిర్మాణ పనులు, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.
తొలుత పొదలకూరు మండల పరిధిలోని తోడేరులో నిర్మిస్తున్న గ్రామకొలను పనులను వారు పరిశీలించి చెరువు నీటి మట్టం, అభివృద్ధి పనులను, వాటి ప్రయోజనాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగం మండలం వెంగారెడ్డిపాలెంలో మామిడి మొక్కలు, సంగంలో జామ మొక్కల తోటలను సందర్శించారు. తదుపరి ఏఎస్ పేట మండలం చందలూరుపాడులో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో ముఖాముఖిగా మాట్లాడారు. జమ్మవరంలో చెక్ డ్యామ్ ను పరిశీలించారు. అనంతరం కలిగిరి తాసిల్దార్ కార్యాలయంలో బోరు నీరు ఎండిపోకుండా బోరు చుట్టూ ఏర్పాటుచేసిన ఇంకుడు గుంత ను పరిశీలించారు. వింజమూరు మండలం ఊటుకూరులో చెక్ డ్యాం, ఇంకుడు గుంట, కొండాపురం మండలం పార్లపల్లి, జలదంకి మండలం రామవరప్పాడులో, కావలి మండలం కొత్త పల్లిలో పొలంకుంటలు, ఊట గుంటలు, పశువుల గుంతలను, చెక్ డ్యాంలను పరిశీలించి వాటి ప్రయోజనాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చివరిగా దగదర్తి మండలం కేకే గుంటలో రోడ్డుకిరువైపులా ఏర్పాటుచేసిన మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్, జల్ శక్తి అభియాన్ నోడల్ అధికారి ఇ. రవిందరన్ మీడియాతో మాట్లాడుతూ వర్షపు నీటిని వృధా చేయకుండా కాపాడుకుంటే భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్ తరాలకు నీటి వనరులు పుష్కలంగా లభిస్తాయన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా నీటి ఆవశ్యకతను గుర్తించి నీటి వనరులను కాపాడుకోవడం తమ వంతు బాధ్యతగా గుర్తించాలన్నారు.
డ్వామా పిడి తిరుపతయ్య మాట్లాడుతూ జిల్లాలో 33 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని, నీటి వనరులను కాపాడుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర అధికారులకు వివరించారు.
ఈ పర్యటనలో జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, డ్వామా ఏపీడీ శ్రీమతి నిర్మలా దేవి, ఆయా మండలాల ఎంపీడీవోలు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment