నిర్ణీత గడువులోపుగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణనిర్ణీత గడువులోపుగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ


వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు

త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న నిర్మాణ కమిటీ సభ్యులు

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, ఆగష్టు 18 (ప్రజా అమరావతి): 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన పనులు ఎక్కడా ఆలస్యం లేకుండా చురుగ్గా కొనసాగుతున్నాయని,నిర్ణీత గడువులోపుగానే విగ్రహావిష్కరణ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. వర్షాలు కొంత మేరకు ఇబ్బంది కలిగిస్తున్నా పనులు ఎక్కడా ఆగకుండా జరిగేలా ఏర్పాట్లు చేసామని తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో గురువారం ‘డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్’ పనుల పురోగతిని మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో విగ్రహ నిర్మాణానికి, దానితో పాటుగా నిర్మించనున్న కన్వెన్షన్ సెంటర్ ఇతర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న భవనాలను కూల్చివేసే పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. తొలగించిన భవనాల స్థానంలో అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ కు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమైయ్యాయన్నారు. కాంక్రీట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా స్లాబ్ కు సంబంధించిన పనులు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన కూలీలకు నిర్మాణ ప్రాంతంలోనే తాత్కాలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటుగా నిర్మాణ పనులు రాత్రీ పగలూ నిర్విరామంగా జరగడానికి వీలుగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నాగార్జున వివరించారు. 125 అడుగుల విగ్రహానికి సంబంధించి అసలు సైజులో బంక మట్టి, మైనంతో తయారు చేసిన నమూనా విగ్రహాన్ని పరిశీలించడానికి అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ కమిటీకి చెందిన మంత్రులు, అధికారుల బృందం త్వరలోనే ఢిల్లీకి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా నిర్మాణ పనులపై మరింత పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని అధికారులు ఈ సందర్భంగా నాగార్జున ఆదేశించారు. ఈ విషయంలో ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసి ఇంజనీర్ ఇన్ చీఫ్ సీహెచ్ఎస్ఎస్ ప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ అదనపు సంచాలకులు రఘురామ్, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసుదేవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 


Comments