ప్రజలకు తక్కువ వ్యవధిలో న్యాయం అందేలా న్యాయవాదులు పనిచేయాలి.

 


విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ కోర్టు భవనాల సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ముందుగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. బహుళ కోర్టు సముదాయాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం  ఏర్పాటు చేసిన సభలో సీజేఐ, ముఖ్యమంత్రి  తెలుగులో చేసిన ప్రసంగాలు సభికులందరినీ ఆకట్టుకున్నాయి. 

 ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాఢిన తర్వాత తాను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితమని తెలిపారు. న్యాయమూర్తులు అనర్గళంగా ఇంగ్లీషు లో మాట్లాడారు, ముఖ్యమంత్రి తెలుగులో ప్రసంగించడం శుభ పరిణామన్నారు.  2013 మే 11న  ఈ భవనానికి శంకుస్థాపన చేసినా రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ..  మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, కేంద్రం ఆ బాధ్యతను తీసుకోవాలని గతంలోనే ప్రతిపాదనలు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు తన ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఎన్నో కేసులు న్యాయ వ్యవస్థ లో పెండింగ్‌లో ఉన్నాయని, అవకాశం ఉన్నంతవరకూ ప్రజలకు తక్కువ వ్యవధిలో న్యాయం అందేలా  న్యాయవాదులు  పనిచేయాలన్నారు.  న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోతే  ప్రజా స్వామ్య మనుగడే కష్టమని, న్యాయవాదులందరూ ప్రజలకు న్యాయం అందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.  విజయవాడతో, బెజవాడ బార్ అసోషియేషన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా  గుర్తు చేసుకున్నారు. సమాజంలో మార్పు కోసం  అపార అనుభవం గల సీనియర్ న్యాయవాదులు వారి జూనియర్ లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతకి,  తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల అన్ని రంగాలలో వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పని చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కి కృషి చేయాలన్నారు. కేంద్రం కూడా అవసరమైన ‌నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన రెండేళ్ల పదవీ కాలంలో 250 హైకోర్టు న్యాయ మూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామన్నారు.  నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు.   రూ. 55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ  సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ. 100 కోట్లు దాటిందని,  ఏపీ ప్రభుత్వం సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. విశాఖలో కూడా పెండింగ్‌లో ఉన్న భవనం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సహకారం అందించాలని కోరారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులకు, పెద్దలకు అందరికీ సీజేఐ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. 

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ‌ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని తెలిపారు. జస్టిస్ ఎన్.వి.రమణ గారి చేతుల మీదుగా కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం కావడం ఎప్పుడూ గుర్తుండిపోయే ఘట్టమని తెలిపారు. 2013లో రమణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి... ఇప్పుడు ఆయన చేతుల మీదే ప్రారంభం కావడం ఇదొక అరుదైన ఘట్టమని, దేవుని విధి అని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు.   

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ... విజయవాడలో అధునాతన భవనంలో కోర్టు లు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్ ఏర్పాటు వల్ల కేసుల విచారణ వేగం పెరుగుతుందని, పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ బి. దేవానంద్, జస్టిస్ కృపాసాగర్, జస్టిస్ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్థన్, బార్ అసోసియేషన్ కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Comments