విశాఖపట్నం (ప్రజా అమరావతి);
*ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వోకేషన్ హాల్‌లో మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.*
*సాఫ్ట్ స్కిల్స్‌లో మైక్రోసాఫ్ట్ సంస్ధ ద్వారా శిక్షణ పొందిన విద్యార్ధులకు సర్టిఫికేట్లు అందజేసిన సీఎం*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలను పంచిపెడుతున్న ప్రతి చెల్లెమ్మకు, తమ్ముడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
వేదికపై ఉన్న మైక్రోసాప్ట్ ఇండియా ప్రతినిధి నవతేజ్ సింగ్ పాల్, లింక్డ్ ఇన్ ఇండియా ప్రతినిధి సాబా కరీం, నా కేబినెట్ సహచరులకు, విద్యార్ధులకు, విశాఖ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు.
*ఇవాళ గర్వకారణమైన రోజు...*
రాష్ట్ర విద్యావ్యవస్ధలో ఇవాళ చాలా గర్వకారణమైన రోజు. సుమారు 35,980 మంది విద్యార్ధులు మైక్రో సాప్ట్ అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాన్ని పూర్తి చే సుకున్నారు. దేశంలో ఈ తరహా కార్యక్రమంలో ఇదే మొట్టమొదటిది. 1.62 లక్షల మంది విద్యార్ధులకు ఈ రకమైన సర్వీసు ఒకే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్ధ కల్పించడం మునుపెన్నడూ లేదు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ అసోసియేట్స్‌గా క్వాలిఫై అయి, సర్టిఫికేట్లు సాధించిన విద్యార్ధులందరికీ నా అభినందనలు. ఈ నవంబరు నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్న మిగిలిన వాళ్లకు కూడా నా అభినందనలు.
*ఉద్యోగాల దిశగా – పాఠ్య ప్రణాళిక
*
ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్యప్రణాళికలో మనం సమూల మార్పులు తీసుకు వచ్చాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా, నైపుణ్యాలను పెంచేదిగా పాఠ్యప్రణాళికను తీర్చిదిద్దాం. సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నాం. రాష్ట్రంలోనూ, దేశంలో కూడా పెద్ద సమస్య ఉంది.
మనకు డిగ్రీలు ఉంటున్నాయి... కాని వాటిమీద ఉద్యోగాలు వస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి.
*1.62 లక్షల మందికి 40 కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ.*
ఈ కార్యక్రమంలో భాగంగా 1.62 లక్షల మంది విద్యార్ధులకు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, అజ్యూరి, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్ వర్కింగ్, వెబ్ డిజైనింగ్, ఐఓటీ వంటి 40 కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది.
ఈ కోర్సులు మన పిల్లలకు ఉద్యోగాల సాధనకు ఉపయోగపడతాయి. దాదాపుగా రూ.30వేలు ఖర్చు చేస్తేకాని ఇలాంటి శిక్షణ రాదు. అంటే దాదాపు రూ. 465 కోట్ల విలువైన శిక్షణను యువతకు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌తో చర్చించింది.
కంపెనీకూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చింది.
కేవలం రూ.32కోట్లకు శిక్షణ ఇచ్చింది. ఈ డబ్బును కూడా ప్రభుత్వం సమకూర్చింది. దీనివల్ల పిల్లలు ఉచితంగా శిక్షణ అందుకున్నారు.
*విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి...*
ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లిషు మీడియం ను ప్రవేశపెట్టాం. వీటితో పాటు అమ్మ ఒడి, నాడు –నేడు, విద్యాకానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణం వంటి పథకాలను ప్రాథమిక పాఠశాల విద్యలో అందిస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన తదుపరి విద్య వారికి అందిస్తున్నాం.
చదువుకునే వారికి అన్నిరకాలుగా సమగ్ర సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది.
*పోటీని తట్టుకునేలా – పాఠ్య ప్రణాళిక*
భవిష్యత్తు పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ విద్యార్ధుల పాఠ్య ప్రణాళికను జాబ్ ఓరియెంటెడ్‌గా తీర్చిదిద్దాం. 10నెలల పాటు ఇంటర్నెషిప్ తప్పనిసరి చేశాం. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నాం. బీటెక్ ఆనర్స్ లాంటి కోర్సులను అందిస్తున్నాం.ఉన్నత విద్యా రంగంలో ఈ తరహా మార్పులకు శ్రీకారం చుట్టాం.
పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నాం. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాం. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను కూడా అందిస్తున్నాం. దేశంలో తొలిసారిగా అండర్‌గ్రాడ్యుయేషన్ స్ధాయిలో 2020–21 నుంచి నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాం. నైపుణ్యాభివృద్దితో పాటు పరిశోధన దిశగా వీటిని అందిస్తున్నాం.
ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం డెవలప్డ్ లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్ధంను ప్రవేశపెట్టాం. ఇందులో భాగంగా 2500 వీడియో పాఠాలు, 451 ఆడియో బ్రాడ్‌కాస్ట్‌లను కూడా ఎల్‌ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాం.
*ఇండస్ట్రీ– ఇనిస్టిట్యూట్ కనెక్ట్..*
ఉన్నత విద్యాశాఖ ఒక పోర్ట్‌లను ప్రారంభించింది. విద్యార్దులకు ఇంటర్న్‌షిప్ కల్పించడం కోసం ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు 1,65,341 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఇప్పటికే నాస్కాం ప్యూచర్ స్కిల్స్, స్మార్ట్ బ్రిడ్జ్, సేల్స్‌ఫోర్స్, ఎడ్యుస్కిల్స్ పౌండేషన్ వంటి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. వర్చువల్ ఇంటర్నెషిఫ్‌లు చేపడుతున్నాం.
ఇప్పటివరకు 1.15 లక్షలమంది విద్యార్థులు 13 కంపెనీలతో ఇంటర్నెషిఫ్‌కు మ్యాప్ చేశాం. ఇవన్నీ ఏపీలో విద్యార్ధులకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. మల్టీ నేషన్ కంపెనీలు కూడా మన విద్యార్ధులవైపు ఆసక్తి చూపిస్తాయి. ఈ సర్టిఫైడ్ కోర్సులతో మైక్రోసాప్ట్‌తో పాటు మిగిలిన కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
*విద్యలో విప్లవాత్మక మార్పులు*
ఈ రోజు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే పేదరికం నుంచి బయటకు వస్తారు. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చాం. అది ఉద్యోగాలు కల్పించేదిగా ఉందా లేదా అన్నది చూసి, మార్పులు తీసుకురావాలన్న తపనతో సీఎం స్థాయి నుంచి కింది స్థాయి వరకూ మనసు పెట్టి ఆలోచన చేస్తున్నాం. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవాళ ఏపీలో ఒక తపన చూపిస్తున్నాం. ఏపీలో జీఈఆర్ మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు కాలేజీలలో చేరుతున్నారన్నది ... బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అమెరికా) దేశాలతో మనం సాధారంగా పోల్చుతాం. వాటితో పోల్చితే ఎంతమంది 18 –23 యేళ్ల మధ్యలో కాలేజీల బాటపడుతున్నారో చూస్తే.. మన దేశంలో ఆ సంఖ్య 26 లేదా 27 శాతం కనిపిస్తుంది. మిగిలివాళ్లు ఎందుకు కాలేజీల్లో చేరడం లేదో గమనిస్తే.. కారణం ఇక్కడ చదువులు చదువుకునే స్దోమత లేకపోవడమే. ఇలాంటి ప్రతి అంశాన్నికూడా క్షుణ్నంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నాం.
ఇంగ్లిషు మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్తు ఉండదని ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లిషు మీడియం పెట్టాం. పిల్లలను బడికి పంపించాలంటే... తల్లులను చైతన్య పరచాలని వారి కోసం అమ్మ ఒడిని తీసుకు వచ్చాం. వారు బడులకు పోయేటప్పటికి అక్కడ మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోతే పిల్లలు బడికి పోయినా ఉపయోగం ఉండదనే ఉద్దేశ్యంతో మన బడి – నాడు – నేడుతో మెరుగైన మౌలిక సదుపాయాలను సమకూర్చాం. అలాగే పుస్తకాలు, యూనిఫాం కొనుక్కోవడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని... విద్యా కానుక కింద వారి క్కావాల్సినవన్నీ సమకూర్చాం. మిడ్ డే మీల్స్‌క్వాలిటీని పెంచాం. గోరుముద్ద నాణ్యత కూడా పెంచేలా చర్యలు తీసుకున్నాం.
ఇంటర్ అయ్యాక ప్రతి పిల్లాడు కూడా పై చదువులు చదవాలని విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను తీసుకు వచ్చాం. యూనివర్సిటీలో కూడా విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నారు. ఆలస్యం కాకూడదని.. ప్రతి త్రైమాసికానికీ కూడా విద్యా దీవెన ఇస్తున్నాం. క్రమం తప్పకుండా ప్రతి ఏటా రెండుసార్లు వసతి దీవెన ఇస్తున్నాం.
ఇవన్నీ ఒకవైపున చేస్తూనే పాఠ్యప్రణాళికలో రూపు రేఖలు మారుస్తున్నాం. చదువుకున్న డిగ్రీకి ఉద్యోగం వచ్చే విధంగా అడుగులు వేశాం. వారి నైపుణ్యాలను పెంచడానికి అన్ని రకాలుగా అడుగులు వేశాం. ఆనై్లన్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికెషన్ పెట్టాం. ప్రతి విద్యార్థికీ ఇంటర్నెషిఫ్ మాండేట్ చేశాం. ఇవన్నీకూడా కూడా ఎందుకు చేస్తున్నామో ఆలోచన చేయాలి.
ఈ రోజు మైక్రో సాఫ్ట్ సర్టిఫికెషన్ ద్వారా దాదాపు 34వేలమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇంకా మెరుగు పరుస్తున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని, దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.... సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, టిటిడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment