నెల్లూరు, (ప్రజా అమరావతి);
జిల్లాలో ప్రతి కౌలు రైతుకి పంట సాగు హక్కు పత్రాన్ని ఇవ్వడంతో పాటు వారికి బ్యాంకుల రుణాల మంజూరుకు చర్యలు
తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మర్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
పొదలకూరులో పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో జరిగిన గొర్రెలు, మేకల సామూహిక నట్టల నివారణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని గొర్రెలు, మేకల రైతులకు డి వార్మింగ్ మందులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సంధార్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో 2.58 లక్షల పశువులు, మేకలు, గొర్రెలు వున్నాయని, వీటి అన్నిటికి పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా డివార్మింగ్ మందులను వేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం 108,104 అంబులెన్స్ లను తీసుకురాగ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేస్తూ పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 1962 నెంబరు తో సంచార పశు వైద్య వాహనాలను ప్రతి నియోజక వర్గంలో ఏర్పాటుచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని అన్నీ పశు వైద్య కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో కౌలు రైతులకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు 11 నెలల కాల పరిమితితో పంట సాగు హక్కు పత్రాలను ఇవ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,271 మంది కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 11,800 మంది కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను ఇవ్వడం జరిగిందని, మిగిలిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను కూడా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ మహేశ్వరుడు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు పశువులకు, మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టం జరుగుచున్నదన్నారు. జిల్లాలో మొత్తం 14 లక్షల గొర్రెలు, మేకలు, పశువులు వున్నాయని, వీటి అన్నిటికి నట్టల నివారణ కార్యక్రమాం ద్వారా డివార్మింగ్ మందులను ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలోని ప్రతి ఆర్.బి.కేల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జె.డి. తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పశు గ్రాస విత్తనాలు, వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుచున్నదని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ సుధాకర్ రాజు, మండల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment