ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది


నెల్లూరు, ఆగస్టు 6 (ప్రజా అమరావతి): గత ప్రభుత్వ హయాంలో తాను శాసనసభ్యుడిగా పని చేసినప్పుడు అనేక సమస్యలతో ప్రజలు తన వద్దకు వచ్చే వారని, పింఛన్లు కావాలని, ఇల్లు మంజూరు చేయాలని పదేపదే అడిగేవారని, వారి సమస్యలు తీర్చలేని పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఇంటి వద్దకే పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇతర అనేక సంక్షేమ పథకాలను సచివాలయాల ద్వారా అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శనివారం సాయంత్రం తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాలెం గ్రామంలోని రామలింగాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

 తొలుత ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశభక్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామస్తులకు ఇంటి నివేశ పత్రాలు, బాలింతలకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. 

 అనంతరం గ్రామంలోని ప్రతి గడప కి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణంగా మూడేళ్లు పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజల్లోకి వెళితే గ్రామాల్లో అనేక సమస్యలు చెబుతారని, కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఏ గడపకు వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంద


ని, అర్హత ఒకటే ప్రామాణికంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందజేశామని, అందుకే స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. గ్రామాలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు మంజూరు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు కూడా పొజిషన్ సర్టిఫికెట్లు అందిస్తున్నామని, ఇంటి నిర్మాణానికి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం, సాంకేతిక కారణాలతో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. 


 ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శేషమ్మ, సర్పంచ్ దువ్వూరు కల్పన, ఎంపీడీవో హేమలత, తాసిల్దార్ శ్యామలమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments