అవకతవకలకు ఆస్కారం లేకుండా నూతన బార్ పాలసీని రూపొందించాం


*అవకతవకలకు ఆస్కారం లేకుండా  నూతన బార్ పాలసీని రూపొందించాం*

*ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి*

                                                      

అమరావతి, ఆగస్టు 2 (ప్రజా అమరావతి):  నూతన బార్ పాలసీ లో ఎటువంటి అవకతవకలకు అవకాశo  లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా పాలసీని రూపొందించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి తెలిపారు. నూతన బార్ పాలసీ అమల్లో పలు అవకతవకలు జరుగుచున్నాయని వార్తా కథనాలు వెలువడుచున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.  నూతన బార్ పాలసీ అమల్లో భాగంగా ఇ-ఆక్షన్ విధానాన్ని అవలంబించడం జరుగుచున్నదన్నారు. ఇటు వంటి బహిరంగ విధానం అమలు వల్ల ప్రతి ఒక్కరూ ఈ బహిరంగ వేలంలో పాల్గొనే అవకాశం ఏర్పడుచున్నదన్నారు.  బార్ లైసెన్సుల వేలంకు సంబందించి ఆక్షన్ బిడ్డింగ్ సొమ్ము స్కీన్ పై అందరికీ ప్రస్పుటంగా  కనిపిస్తుందని, దీని ప్రకారమే పోటీదారులు అందరూ ఈ వేలంలో పాల్గొని, బార్ లైసెన్సులను దక్కించుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బార్ లైసెన్సుల వేలం విధానాన్ని ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, ఈ పక్రియలో ఎటు వంటి అవకతవకలకు అస్కారం ఉండదని ఆయన తెలిపారు. తనపై బురద జల్లాలనే దురుద్దేశంతోనే కల్పిత, ఊహా జనిత కథనాలను వ్రాయడం జరుగుచున్నదన్నారు. గత 40 ఏళ్ల నుండి ఎంతో నీతి నిజాయితీతో రాజకీయాల్లో ఉన్నానని, బార్ వ్యాపారస్తులతో తనకు ఎటు వంటి సంబంధాలు లేవని, అలా ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన అన్నారు. అలా నిరూపించకపోతే కల్పిన కథనాలు వ్రాసేవారు ఏమి చేస్తారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. 


                                                                                                         

Comments