*ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి గారి పేరు మీద ప్రత్యేక కథనం*
*గడ్డిపోచ మొలవని చోటైనా పారిశ్రామిక పూదోట పూయించేదే "ఏపీఐఐసీ" : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*
*3 ఏళ్లల్లో 2,512 యూనిట్లకు భూమి కేటాయింపు*
*పారదర్శకతకు పెద్దపీట వేస్తూ 14 ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి*
*ఒకే నెలలో రూ.40 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లతో సరికొత్త రికార్డ్*
*యజ్ఞంలా పర్యావరణకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామికపార్కుల్లో పర్యావరణ డ్రైవ్*
*ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల 572 పరిశ్రమలకు పునరుజ్జీవం*
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వక హస్తం అందిస్తోంది. "మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉంటే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి" అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి పరిశ్రమ ఏర్పాటులో "మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా స్థాపించేవరకూ నిరంతరం తోడుంటాం" అని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో రాష్ట్రంలో సంక్షేమంతో పోటీ పడుతూ పారిశ్రామిక ప్రగతి పరవళ్లు తొక్కుతోంది.
రాష్ట్రంలో ప్రతి అభివృద్ధికి నాణ్యమైన మౌలిక సదుపాయాలే పునాది. ఆ వసతుల కల్పనలో భాగంగా పరిశ్రమ స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపు, నీరు, విద్యుత్, డ్రైనేజ్ లు, వీధి దీపాలు, రహదారుల వంటి సకల సదుపాయాల బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దే. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) భూ కేటాయింపుల్లో పూర్తి పారదర్శక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గడిచిన మూడేళ్ల కాలంలో ఏపీఐఐసీ 2,512 యూనిట్లకు 4,677.44 ఎకరాల భూమిని కేటాయించింది. వీటి ద్వారా రూ. 34,755.87 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 1,88,363 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా. గడిచిన మూడేళ్ల కాలంలో ప్రకాశం (269), చిత్తూరు (238), అనకాపల్లి (229), కృష్ణ (218), తిరుపతి (165), ఎన్‌టీఆర్ (154) జిల్లాలు ఉన్నాయి. అదే పెట్టుబడుల విలువ పరంగా చూస్తే అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.11,456.68 కోట్ల పెట్టుబడులు రాగా, ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా (రూ.6,688.10కోట్లు), నంద్యాల (రూ.6,453.71 కోట్లు), తిరుపతి (రూ.5,273,94 కోట్లు) ఉన్నాయి.
*చిన్న పరిశ్రమలకు పెద్ద పీట..పారిశ్రామిక వికేంద్రీకరణ*
అత్యధికమందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఏపీఐఐసీ పెద్ద పీట వేస్తోంది. గత ప్రభుత్వ కేటాయింపులతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి 2,816 యూనిట్లకు భూమి కేటాయింపులు జరగ్గా , రెండేళ్లుగా కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ మూడేళ్లలో 2,512 యూనిట్లకు కేటాయింపు జరపడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికతకు నిదర్శనం. ప్రస్తుత ప్రభుత్వ హయంలో సగటున ఒక యూనిట్‌కు 1.86 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించగా, గత ప్రభుత్వ హయంలో ఒక యూనిట్‌కు సగటున 4.83 ఎకరాలు కేటాయించడం చూస్తే స్పష్టమవుతోంది. అలాగే గత ప్రభుత్వ హయంలో కేటాయింపులు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు దీనికి భిన్నంగా కేటాయింపుల్లో పూర్తి వికేంద్రీకరణ దిశగా ఏపీఐఐసీ ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వ హయంలో ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 885 యూనిట్లకు భూమిని కేటాయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా భూ కేటాయింపుల్లో చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నాం. ముఖ్యంగా ఎస్‌సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేస్తున్నాం.
*ఏడాదికాలంలో విప్లవాత్మక మార్పులు..సంస్కరణలు*
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడుగుబలహీనవర్గాల పక్షపాతి. వారి సంక్షేమంకోసం ఎటువంటి నిర్ణయానికైనా వెనుకాడరు. మాట ఇచ్చినవే కాకుండా హామీ ఇవ్వని వాటిపైనా మనసుపెట్టి ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. "వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం" కూడా అలాంటిదే. జీవో నంబర్ 7తో 572 పరిశ్రమలలో పునరుజ్జీవం నింపారు. 421 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కోల్పోతామనుకున్న తమ ప్లాట్లలో అదే ఎస్టేట్ లో వారి ప్లాట్ కేటాయించి నిజమైన బడుగువికాసానికి నాంది పలికారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు పాత ధరలకే భూ కేటాయింపుల లీజు నుంచి అమ్మకం పద్ధతిలోకి మార్చడం, యూనిట్ పూర్తి చేసేందుకు ఏప్రిల్ 1, 2022 నుంచి మరో మూడేళ్ల వరకూ కాలపరిమితి పొడగించడం వంటి వెసులుబాటు కల్పించి పాత పరిశ్రమలకు కొత్త ఊపరిలూదినట్లయింది.
*పారదర్శకతే పరమావధిగా ఏపీఐఐసీ ఆన్ లైన్ సేవలు, యాప్ అందుబాటులోకి*
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సమస్త సమాచారాన్ని మొబైల్ యాప్ రూపంలో అందించేందుకు సన్నద్ధమవుతున్నాం. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) పోర్టల్ ఆధారిత మొబైల్ యాప్ ను తయారుచేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిస్థితిని మొబైల్ యాప్ లోనే పక్కాగా చూపించేందుకు డ్రోన్ సహాయంతో సర్వే చేసి ఇందులో ఫోటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేయడం కోసం ఏజెన్సీని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడినుంచైనా ఏపీఐఐసీ నిర్వహించే పారిశ్రామిక పార్కుల్లో ఎన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి? వాటి ధర ఎంత? ఆయా ప్లాట్ల సరిహద్దులు, విస్తీర్ణం..సదరు ప్లాటుకు రోడ్డు, రైల్వే మార్గాల అనుసంధానం ఎంత దూరంలో ఉంది? ఖాళీ ప్లాటును కొనుగోలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు, భవిష్యత్ లో కొనుగోలు ధరను కూడా ఆన్ లైన్ లో చెల్లించే ఆప్షన్స్ వచ్చేలా అత్యాధునిక పద్ధతిలో యాప్ తీర్చిదిద్దుతున్నాం.
సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆన్‌లైన్ వ్యవస్థను ఏపీఐఐసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను ప్రారంభించింది. www. apindustries. gov. inకు ఏపీఐఐసీ సేవలు అనుసంధానించడం ద్వారా చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా చేసుకోవడం, కార్యాలయాల్లో అధికారుల కోసం ఎదురుచూపులకు ఆస్కారం లేకుండా స్వస్తి పలికినట్లు వెల్లడించారు. కేటాయింపుల బదిలీ, పరిశ్రమను మరొక నియోజకవర్గానికి మార్చడం, 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు సంబంధించిన ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు వంటి సేవలకు సంబంధించి పారిశ్రామికవేత్తల నుంచి 302కు పైగా దరఖాస్తులు రాగా 195 దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాం.
*5శాతం రాయితీ అవకాశమివ్వడంతో ఆస్తి పన్నుల వసూలులో ఏపీఐఐసీ రికార్డ్*
ఏపీఐఐసీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒకే నెలలో రూ.40 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసింది. అత్యధిక పన్ను వసూలైన నెలగా 'జూలై-2022' రికార్డ్ సృష్టించింది. పారిశ్రామికవేత్తలు తమ ఆస్తి పన్ను చెల్లింపులు జూలై 31,2022 లోగా ఒకేసారి చెల్లించినట్లయితే వారికి మొత్తం చెల్లింపులో 5శాతం రాయితీ వెసులుబాటును ఏపీఐఐసీ కల్పించింది. ఈ పిలుపుపై స్వతంత్రంగా స్పందించి సద్వినియోగం చేసుకున్న పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో అత్యధిక ఆస్తి పన్ను వసూళ్లు జరగడం ఇదే తొలిసారి.
*పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణ*
ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు కాలుష్యం, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్న వీటిని ప్రైవేటు పార్కులకు దీటుగా హరిత పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దడంలో ఏపీఐఐసీ సంకల్ప దీక్షతో సఫలీకృతమైంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే విధంగా జూన్ 20 నుంచి జూలై 5 వరకూ ఇండస్ట్రియల్ ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ డ్రైవ్ పేరుతో 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికపార్కులు హరితవనాలుగా మారాయి. 164 సైన్ బోర్డులు, 2,102 వీధి దీపాల ఏర్పాటు, 16,308 మీటర్ల మేర రోడ్లు, వాటి మరమ్మతులు, 477 కి.మీ పరిధిలో తుప్పల తొలగింపు, 76739 మీటర్ల మేర డ్రైనేజ్ లలో పారిశుధ్యం, 6,325 మొక్కల పెంపకం, 21,736 మీటర్ల పరిధిలో బ్లాక్ ప్లాంటేషన్ సహా చెట్లు నాటడం వంటి కార్యక్రమాల నిర్వహణతో పారిశ్రామిక పార్కులు పచ్చని వనాలుగా మారాయి.
addComments
Post a Comment