అమరావతి (ప్రజా అమరావతి);
*అంకితభావంతో పని చేయడమే అసలైన దేశభక్తి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*
*ఉత్తమ సేవలందించిన ఏపీఐఐసీ ఉద్యోగులకు త్వరలో మంత్రి, ఛైర్మన్ చేతుల మీదుగా పురస్కారాలు : వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
*ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలో స్వాతంత్ర్య వేడుకలు*
*జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*
*స్వాతంత్ర్య సమరయోధులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
*చక్కని కథతో ఉద్యోగులలో స్ఫూర్తిని నింపిన ఎండీ సుబ్రమణ్యం*
అమరావతి, ఆగస్ట్, 15 : "ఏ రోజు పని ఆ రోజే అంకితభావంతో పూర్తి చేయడమే అసలైన దేశభక్తి" అని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పొందామన్నారు. ఆచరించే వారి ఆలోచనలనే సమాజం వింటుందని, పాటించకుండా నీతులు చెబితే ఇంట్లో పిల్లలు కూడా వినరన్నారు. మీడియాలో వార్తల ప్రాధాన్యత కూడా మారిపోయిందని, సమాజానికి కావలసినవాటి కన్నా, అక్కర్లేని విషయాలే ఎక్కువ వార్తలు వస్తున్నాయని ఛైర్మన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో శ్రీక్రిష్ణదేవరాయల పరిపాలనలో 500 చెరువులు నిర్మించారు. అలా ముందు చూపుతో సమాజహితం కోసం మంచి పనులు చేసే పద్ధతిని మర్చిపోతున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం, దేశభక్తి, విలువలు, నీతి లేకుండా ఎంత సాధించినా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఛైర్మన్ వివరించారు.
*మంచిని పెంచు..మంచిని పంచు : ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
ఉత్తమ సేవలందించిన ఏపీఐఐసీ ఉద్యోగులకు త్వరలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తామని ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, ఏపీఈడీబీలో అత్యుత్తమ పనితీరు కనబరిచే వారిన ఎండీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ, ఈడీబీ అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది నివాళులర్పించారు. మంచి సమాజం మంచి కుటుంబాల వల్లే సాధ్యమన్నారు. చిన్నతనం నుంచి కుటుంబంలో పిల్లలకి దేశభక్తి , సామాజిక స్పృహను అలవరచాలన్నారు. ఈర్షా, ద్వేషం, కోపం, అసూయలకు తావులేకుండా ఎదగాల్సిన పద్ధతి గురించి ఏపీఐఐసీ ఎండీ చక్కని కథతో ఉద్యోగుల్లో స్ఫూర్తినింపారు. నచ్చని విషయాలు, మనుషులను వదిలేసి దయ, మానవత్వంతో దేనినైనా సాధించవచ్చునన్నారు. మంచిని పంచాలి, మంచి పెంచాలంటే ముందు ఆ మంచిని గుర్తించి గౌరవించాలనే మనస్తత్వం కలిగిన పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డిల ఆధ్వర్యంలో బిల్ కలెక్టర్ స్థాయి నుంచి జోనల్ మేనేజర్ స్థాయి వరకూ అందరి పనితీరును గుర్తించి పురస్కారాలిస్తామన్నారు. ఏపీఐఐసీ గతేడాది అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. పారిశ్రామికవేత్తలు కార్యాలయాలకు రాకుండా, ఎదురుచూపులు లేకుండా 14 ఆన్ లైన్ సేవలు, జూలై 31 లోపు చెల్లించిన వారికి కట్టాల్సిన మొత్తంలో 5శాతం రాయితీ అవకాశం వల్ల వసూలైన ఆస్తి పన్ను వసూళ్ళు, పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ డ్రైవ్ వల్ల పార్కులన్నీ పచ్చదనం, పరిశుభ్రంతో మారిపోవడం వంటి కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ఉద్యోగుల పనితీరును మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఏడాదంత పని చేసినా రూ.70 కోట్లు దాటని ఆస్తి పన్ను వసూలు, ఈ ఏడాది 3 నుంచి 4 నెలల కాలంలోనే రూ.65 కోట్లు చేరడం ఐలా, జోనల్ మేనేజర్ల గొప్ప పనితీరుకు నిదర్శనమని ఎండీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీజీఎం(ఫినాన్స్) సుబ్బారెడ్డి, ఓఎస్డీ ల్యాండ్ సాధన, కంపెనీ సెక్రటరీ శివారెడ్డి, సీజీఎం(పర్సనల్) జ్యోతి బసు, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు వీఆర్ వీఆర్ నాయక్, గిరిధర్, ఏపీఈడీబీ ప్రతినిధులు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment