---- రైతు, కౌలు రైతుల సంక్షేమానికి కృషి
___ పథకాలు, కార్యక్రమాల అమలుకు ప్రణాళికాయుత చర్యలు
___ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ
కాకినాడ, ఆగస్టు: 16 (ప్రజా అమరావతి);
గతంలో ఎన్నడూలేని విధంగా రైతు, కౌలురైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని వీటితోనే రైతులు వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారని అయితే ఈ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలు లేవనెత్తారని, వీటి సత్వర పరిష్కారానికి కృషిచేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
మంగళవారం కాకినాడ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ ఛైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, ఐ వెంకటేశ్వరరావు, జగ్గంపేట, అనపర్తి, పిఠాపురం శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జెడ్పీ ఉపాధ్యక్షులు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఇటీవల వరదల వల్ల ఎదురైన సమస్యలు, పరిష్కారాలు 2022, ఖరీఫ్‌కు సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, నీటిపారుదల, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, రహదారుల అభివృద్ధి తదితర అజెండా అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ప్రాంత అంశాలను లేవనెత్తగా అధికారులు వివరాలు అందించారు. ఈ అంశాలపై భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
సమస్యల పరిష్కారానికి ప్రణాళికాయుత చర్యలు
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో సమస్యలను ప్రణాళికాయుతంగా పరిష్కరించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.
అదే విధంగా ఇటీవల వరదల సమయంలో కష్టించి పనిచేసి ప్రజలకు భరోసానిచ్చిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తూ చేసిన తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించినట్లు వివరించారు. పేదల సంక్షేమం లక్ష్యంగా వారి కష్టాలను తీర్చడమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం కృషిచేస్తోందని.. అయితే అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థల సైన్యం ద్వారా సమాచారాన్ని సేకరించి, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, ప్రజావసరాలను తీర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సమావేశంలో కీలక చర్చ జరిగిందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి పాలనలో మార్పులు తెచ్చారని ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల అవసరం ఏంటన్నది ఇటీవల సంభవించిన వరదల వంటి విపత్తులు సంభవించినప్పుడు అర్థమవుతుందని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 వరదల తర్వాత ఏటిగట్లను పటిష్టం చేయడం, ఇరిగేషన్, డ్రెయిన్ వ్యవస్థలను ఆధునికీకరించడం వంటి పనులు చేపట్టారని ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రణాళికలతో వరద ప్రభావాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సీసీఆర్సీ కార్డులపై భూ యజమానులు, కౌలు రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
జెడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ 1986, 2006 తర్వాత ఇటీవల అతిపెద్దగా గోదావరికి 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అయినా ఈ వరద ప్రభావాన్ని సమర్థం ఎదుర్కోగలిగామన్నా, పెద్దగా నష్టం లేకుండా చూశామన్నా అందుకు కారణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ పాలనా కాలంలో చేపట్టిన పనులేనని పేర్కొన్నారు. ఇటీవల 15 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టించి, ప్రజలకు తోడ్పాటునందించారన్నారు. ముఖ్యమంత్రి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సాధారణ సభలో వ్యవసాయం, ఇరిగేషన్, రహదారులు, హౌసింగ్ వంటి కీలకమైన అంశాలపై కూలంకషంగా చర్చించి గౌరవ సభ్యులు లేవనేత్తిన సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని వేణుగోపాలరావు వెల్లడించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ కృతికా శుక్లా, హిమాన్షు శుక్లాలు తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు
addComments
Post a Comment