నెల్లూరు, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): జిల్లాలో విరివిగా జాబ్ మేళాలను ఏర్పాటు
చేసి నిరుద్యోగులను గుర్తించి, వారికి అవసరమైన వృత్తి నైపుణ్యంపై శిక్షణనిచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సాంబశివారెడ్డి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీ వినీల్ కుమార్ వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్రతినెలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులను గుర్తించి, పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. సచివాలయాల వారీగా కుటుంబం సభ్యుల వివరాలను పరిశీలించి నిరుద్యోగ యువతను గుర్తించి, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాబ్ మేళాల్లో పరిశ్రమల నిర్వాహకులను భాగస్వామ్యం చేసి, ఎంపికైన అభ్యర్థులకు మెరుగైన జీతభత్యాలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతను గుర్తించి, వారికి అవగాహన కల్పించి వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ సురేష్ కుమార్, సెట్నల్ సీఈవో శ్రీ పుల్లయ్య, బీసీ కార్పొరేషన్ ఈడి శ్రీ బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐ టి ఐ, డీకే డబ్ల్యూ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment