నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరిగేలా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాల
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి, అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లుపై మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అన్నీ మతాలకు, కులాలకు అతీతంగా జరగనున్న రొట్టెల పండుగకు వివిధ జిల్లాలు, పలు రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు భక్తి విశ్వాసాలతో హాజరవుతున్న దృష్ట్యా హాజరౌతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. రెండు రోజుల నుండే బారా షాహీద్ దర్గాకు భక్తులు రావడం జరుగుచున్నదన్నారు. జిల్లా ముస్లీం సోదరుల చిరకాల కోరిక మేరకు బారా షాహీద్ దర్గాలో మసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలను మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ తో గత రెండు సంవత్సరాలుగా రొట్టెల పండుగను నిర్వహించ లేకపోయామని, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని, తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఏర్పాటుచేస్తున్న మరుగుదొడ్లకు కర్టన్స్ ఏర్పాటుతోపాటు, నీటి సౌకర్యం కల్పించి, ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్ర పర్చేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. బారా షాహిద్ దర్గాను అభివృద్ది చేసేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలనుఈ సంధర్భంగా శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బారా షాహిద్ దర్గాలో మసీద్ నిర్మాణానికి 7.5 కోట్ల రూపాయలు, దర్గా ఆవరణలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి, దర్గా అభివృద్దికి మరో 7.5 కోట్ల రూపాయలు మొత్తం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే రొట్టెల పండుగ నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ కింద శ్రీ వేదగిరి నరసింహ స్వామి వారి దేవాలయాన్ని అబివృద్ది చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 50 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని శాసన సభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ రెండు పనులు పూర్తి అయితే జిల్లాకే తలమానికం కాగలవని తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, శాసన సభ్యులు, అధికారులు తో కలసి దర్గా ఆవరణలో, చెరువు ఘాట్ వద్ద చేపట్టిన ఏర్పాట్లు ను పరిశీలించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి, ఎస్.పి. శ్రీ విజయరావు జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీమతి హరిత, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ మాలోల, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనక దుర్గా భవాని, స్థానిక కార్పొరేటర్ వాసంతి, నిర్వాహక కమిటీ చైర్మన్ షాజహాన్, వైస్ ఛైర్మన్ శ్రీ ఖాదర్ భాషా, నెల్లూరు రూరల్ తహసీల్దార్ శ్రీ వెంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment