అర్హులందరికీ బిందు, తుంపర్ల సేద్య పరికరాలు
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం, సెప్టెంబరు 24. (ప్రజా అమరావతి) ః
అర్హులందరికీ బిందు, తుంపర్ల సేద్య పరికరాలను అందజేయాలని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ పరికరాలను వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, పంటల అధిక దిగుబడి సాధ్యపడుతుందని, సాగునీటి వినియోగం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. స్థానిక ఘోషా ఆసుపత్రి వద్ద, బిందు, తుంపర్ల సేద్య పరికరాల పంపిణీకి సిద్దం చేసిన వాహనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎపిఎంఐపి పథక సంచాలకులు పిఎన్‌వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో 2003-04 సంవత్సరంలో సూక్ష్మ నీటి పారుదల పథకం ప్రారంభమయ్యిందని చెప్పారు. అప్పటినుంచి 2019-20 సంవత్సరం వరకు సుమారు రూ.86.88 కోట్లు విలువైన రాయితీపై, దాదాపు 23,210 మంది రైతులకు 28,303 హెక్టార్ల మేర ఈ పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బిందు సేద్యం ద్వారా 70 శాతం సాగు నీరు ఆదా అవ్వడమే కాకుండా, 40 శాతం అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, ఇసుక నేలలు, ఎగుడుదిగుడు నేలలను కూడా సాగులోకి తీసుకురావచ్చని చెప్పారు. బోరు లేదా బావి తదితర నీటి వసతి, మోటార్ పంపులు, ఆయిల్ ఇంజన్లు ఉన్న రైతులు సూక్ష్మ నీటి పరికరాలను పొందవచ్చనని సూచించారు. చిన్న సన్నకార రైతులకు రూ.2,18,000 విలువైన డ్రిప్ పరికరాలను 90 శాతం రాయితీపై, 5 ఎకరాల వరకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 5నుంచి 12.5 ఎకరాల రైతులకు, 50శాతం రాయితీపై, రూ.3,10,000 వరకు పరిరకాలను అందిస్తామని చెప్పారు. తుంపర్ల సేద్య పరికరాలను, 5 ఎకరాలు వరకు 55 శాతం రాయితీపై, 5-12.5 ఎకరాలు వరకు 45 శాతం రాయితీతో అందిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2300 మంది రైతులకు, 2600 హెక్టార్ల మేర పరికరాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటివరకు 845.25 ఎకరాలకు సంబంధించి, 705 మంది రైతులు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 66 మంది రైతులకు ఇప్పటివరకు ఆమోదం లభించినట్లు పిడి లక్ష్మీనారాయణ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ రేవతీదేవి, ఎపిఎంఐపి పిడి లక్ష్మీనారాయణతోపాటు, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె.శైలజ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment