*- ఎన్టీఆర్ పేరు మార్చడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించాలి*
*- జగన్ ను ఒప్పించి ఎన్టీఆర్ పేరు కొనసాగేలా చూడాలి*
*- ఎన్టీఆర్ పేరు మార్చే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదు*
*- హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే*
*- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్*
గుడివాడ, సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పటికైనా స్పందించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ తనకు దేవుడని చెప్పుకుంటూ వస్తున్నారన్నారు. గుడివాడలో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ను కూడా నెలకొల్పి ప్రతి ఏటా జనవరి నెల్లో సంక్రాంతి సంబరాలను జరుపుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెల్త్ వర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించిందన్నారు. ప్రభుత్వంలోనే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పే కొడాలి నాని సీఎం జగన్ ను ఒప్పించి హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగేలా చూడాలన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మాభిమానమని గుర్తు చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారన్నారు. యువతకు రాజకీయాల్లో బంగారు బాట వేశారన్నారు. అటువంటి ఎన్టీఆర్ ను ప్రజల నుండి దూరం చేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఎన్టీఆర్ పేరును మార్చిందన్నారు. తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఎన్టీఆర్ కు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును మార్చే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. 36 ఏళ్ళ ఎన్టీఆర్ ఆలోచనలతోనే విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ చేసిన కృషి కారణంగా ఆయన పేరును తర్వాత వచ్చిన ప్రభుత్వాలు హెల్త్ వర్సిటీకి పెట్టాయన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం అర్థరహితమన్నారు. సీఎం జగన్ కన్నా ముందు అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారని చెప్పారు. కక్షపూరితంగా ఎన్టీఆర్ పేరును మార్చలన్న ఆలోచన ఎవరూ చేయలేదన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించగలరేమో గాని ప్రజల గుండెల నుండి మాత్రం చెరిపివేయలేరన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాల్సిందేనని శిష్ట్లా లోహిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
addComments
Post a Comment