మంథన్' సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్

 'మంథన్' సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్ 


విశాఖపట్నం, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి): మెరుగైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, మరింత ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 8, 9 తేదీల్లో బెంగళూరులో నిర్వహిస్తున్న 'మంథన్' జాతీయ స్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్, ఈ శాఖ స్పెషల్ సి.ఎస్. కరికాల వల్లవన్ హాజరయ్యారు.  రాష్ట్రంలో జాతీయ రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమర్నాథ్, కేంద్రమంత్రి గడ్కరీకి వివరించారు. మంత్రి గడ్కరీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడు ఆశించిన లక్ష్యాలను సాధించగలమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజనీర్లు అందుబాటులోకి తేవాలని కోరారు. కోపరేషన్, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ తో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అన్నారు.  పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వాహనాలనే వినియోగించాలని ఆయన కోరారు. దేశంలో పెట్రోల్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ తో పాటు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆయన కోరారు. 

దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి అమర్నాథ్ వివరించారు.

Comments