మొదటి, రెండవ, మూడవ ర్యాంకుల్లో వరుసగా ప్రకాశం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల విద్యార్థులు




విజయవాడ (ప్రజా అమరావతి);


*రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 2022-23 అడ్మిషన్ ఫలితాల్లో  ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా*


*మొదటి, రెండవ, మూడవ ర్యాంకుల్లో వరుసగా ప్రకాశం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల విద్యార్థులు


*


*ర్యాంకులు సాధించిన వారిలో 76.97  శాతం మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే...66% సీట్లు సాధించిన బాలికలు..*


*10వ తరగతి మార్కుల ఆధారంగా ఆరేళ్ల కోర్సులకు  అభ్యర్థుల ఎంపిక*


*ఐఐఐటీల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు ఖర్చుకు వెనకాడబోం*


*ప్రపంచస్థాయి పౌరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం*

 

:- *రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*


                     రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 2022-23 సంవత్సరానికిగానూ ఐఐఐటీ అడ్మిషన్ల ఫలితాల విడుదలలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గురువారం విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న లెమన్ ట్రీ ప్రీమియర్ మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఐఐఐటీలో ఆరేళ్ల కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ల ఫలితాల సీడీని విడుదల చేశారు. 


                   అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు ఐఐటీ స్థాయి నాణ్యమైన సాంకేతిక ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 2022-23 సంవత్సరం అడ్మిషన్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన జల్లెల నందిని మయూరి ఓపెన్ కేటగిరిలో ప్రథమ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన చక్రపాణి బెహర రెండవ ర్యాంకు, గుంటూరు జిల్లా మున్నంగి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సోమిశెట్టి ఫణీంద్ర రామకృష్ణ మూడవ ర్యాంకు సాధించారన్నారు. 


అడ్మిషన్స్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారిలో 76.97 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కాగా, 23.03 శాతం మంది ప్రైవేట్ విద్యార్థులున్నారని మంత్రి తెలిపారు. ఫలితాల్లో 66.04 శాతం సీట్లు బాలికలు సాధించగా, 33.96 శాతం సీట్లు బాలురు సాధించారని వెల్లడించారు. 600 మార్కులకు గానూ అన్ని క్యాంపస్ లలో 93 నుండి 95 శాతం మార్కులను కేటగిరీల వారీగా కటాఫ్ గా నిర్ణయించామన్నారు. ఒక్కో కేటగిరీకి కటాఫ్ లో స్వల్ప మార్కులే తేడా ఉన్నాయన్నారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన, ప్రతిభావంతులకు మాత్రమే అడ్మిషన్ లు పారదర్శకంగా కేటాయించామన్నారు. సీట్ల కేటాయింపులో ఎటువంటి రెకమండేషన్లకు  తావివ్వలేదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ఇకపై కౌన్సిలింగ్ రాష్ట్రంలోని 4 క్యాంపస్ లలో జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు..


ఐఐఐటీల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు ప్రభుత్వం తరపున ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ఒంగోలులో అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న క్యాంపస్ ను రెండు మూడేళ్లలో కనిగిరికి పూర్తిస్థాయిలో తరలించాలని, అక్కడ నిర్మిస్తున్న శాశ్వత భవనంలో అన్ని వసతులతో క్యాంపస్ ను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పౌరులుగా మన రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారన్నారు. 


       అడ్మిషన్స్ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అయినా  మార్కులు ఎక్కువగా వచ్చి సీటు రాని విద్యార్థులెవరైనా ఉంటే వారు క్యాంపస్ లో ఛాన్స్ లర్ ను సంప్రదించాలన్నారు. ప్రతి ఏటా ఎస్.టి కేటగిరీలో సీట్లు మిగిలేవని వాటిని ఎస్.సి కేటగిరికి డైవర్ట్ చేసేవాళ్లమన్నారు. ఈ సారి ఎస్.టి కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య పెరగడం సంతోషమన్నారు. న్యాయస్థానం సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.  


      దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదవి, ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో 2008లో  రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నెలకొల్పారన్నారు. దీనిని తన మానసపుత్రికగా భావించి దివంగత వైఎస్ఆర్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏలూరు జిల్లాలోని నూజివీడు, వై.ఎస్.ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఆర్.కె.వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల వద్ద మొత్తం 4 క్యాంపస్ లు ఉన్నాయన్నారు. ఒక్కో క్యాంపస్ లో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. గతంలో 4,000 సీట్లు మాత్రమే ఉంటే వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరి క్రింద మరో 400 సీట్లు చేర్చామన్నారు. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికీ సీట్లు దొరుకుతున్నాయన్నారు.   


              రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్స్ ఫలితాల్లో అన్ని వర్గాల వారు టాప్ ర్యాంకులు సాధించారని ఆర్.జి.యు.కె.టి ఛాన్స్ లర్ కె.సి.రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయన్నారు. ఇప్పటివరకు క్యాంపస్ లలో విద్యనభ్యసించిన విద్యార్థులకు 93 శాతం ప్లేస్ మెంట్ ల కల్పన జరిగిందన్నారు.  ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని, ప్లేస్ మెంట్స్ శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే కాలంలో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్ అందేలా అడుగులు వేస్తామన్నారు. అధిక శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకు మాత్రమే ప్రాధాన్యతిస్తున్నారని, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో చదివిన వారికి కూడా క్యాంపస్ సెలక్షన్ లో అంతే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆయా విభాగాల్లో చేరాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు. తమ విద్యా సంస్థల్లో డ్రాపౌట్ల సంఖ్య తక్కువేనని, ఆరేళ్ల కోర్సుని పదేళ్ల వరకు పూర్తి చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశముందన్నారు. తమ సంస్థల్లో చదివే విద్యార్థులపై ఎలాంటి ఒత్తిళ్లుండవన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే క్యాంపస్ లక్ష్యమన్నారు.


               పదో తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ కు ఎంపిక చేయబడిన అభ్యర్థుల లిస్ట్ ను తమ వెబ్ సైట్ www.rgukt.in లో పొందుపరిచామని వైస్ ఛాన్స్ లర్(ఎఫ్.ఎ.సి) ప్రొఫెసర్ కె.హేమ చంద్రారెడ్డి వెల్లడించారు. వెబ్ సైట్ లో అభ్యర్థులు తమకు సంబంధించిన హాల్ టికెట్లను, కాల్ లెటర్స్ ను డౌన్ లోడ్ చేసుకొని  కౌన్సెలింగ్ హాజరుకావాలన్నారు.  అక్టోబర్ 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్. కె. వ్యాలీ, ఇడుపుల పాయ క్యాంపస్ లో, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్ లో, 15,16వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల క్యాంపస్ లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. అక్టోబర్ 17వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. 


                           ఫలితాల విడుదల కార్యక్రమంలో ఐఐఐటీ క్యాంపస్ ల డైరెక్టర్లు ప్రొఫెసర్ జి.వి.ఆర్. శ్రీనివాసరావు, ప్రొఫెసర్ బి.జయరామిరెడ్డి, ప్రొఫెసర్ పి.జగదీశ్వర్ రావు, అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.ఎస్.ఎస్.వి. గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments