దోమల వాడగా కాకినాడ

 దోమల వాడగా కాకినాడ 

  కాకినాడ, సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి): నగరంలోవ్గత అయిదేళ్లుగా వందల కోట్లు వెచ్చించి ఎత్తు పల్లాలు లేకుండా మురుగు పారని ఎత్తైన డ్రయిన్లు, రోడ్ల మీద రోడ్లను అనేక లేయర్లుగా అతిగా నిర్మించడం వలన అపారిశుద్ధ్య అవస్థలు ఎక్కువయ్యాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. రోడ్లు ఎత్తు చేసి డ్రెయిన్లు నిర్మించకుండా బిల్లులు చేసుకున్న దుస్తితి వలన డ్రైన్ నీరు ఎక్కడి కక్కడ నిలిచిపోతున్న అవస్థ పలు రహదారుల్లో ఉందని నగర పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మంగళవారం  ఓ ప్రకటనలో తెలిపారు . 

   దోమల లార్వా విపరీతంగా పెరగడానికి ఇవే ప్రధాన కారణమవుతున్నా యన్నారు. కాలువల్లో తీసిన పూడికలు, నరికి పడేసిన చెట్ల కొమ్మలు సకాలంలో తరలించక పోవడం వలన, పూడిక మట్టి కాలువలోకి, చెట్ల కొమ్మలు చెత్త కుప్పల్లా తయారయ్యి దోమల తీవ్రత పెంచుతున్నాయన్నారు. ఇండ్ల మధ్యన వున్న ఖాళీ స్థలాలు పలు లే అవుట్ భూములు, పార్కు ప్రదేశాలు, పాఠశాలల ప్రాంగణాలు, బ్రిడ్జి దిగువ కానులు, రైలు పట్టాల ప్రాంతాలు, సామర్లకోట కాలువ రోడ్ల చెత్త, కొవ్వూరు రోడ్డు పొడవునా, ఆర్టిసి కాంప్లెక్స్ రహదారిలో చెత్తా చెదారాలతో పోగులు  ఎక్కువవ్వడం వలన దోమల ఉత్పత్తి నివాసాలు అవుతున్నాయన్నారు. కాలువల్లో క్రిమి రసాయనాల స్ప్రే చేపట్టడం లేదన్నారు. తొట్టి ఆటోల్లో ఫాగింగ్ చేయడం వలన కాలువల్లో దోమలు ఇండ్లల్లోకి చేరుతున్నాయన్నారు. తడి చెత్త - పొడి చెత్త ప్రచార ప్రహసనం మినహా ఆరోగ్యకరమైన పారిశుద్ధ్య నిర్వహణ స్మార్ట్ సిటీలో లేదన్నారు.  బ్లీచింగ్ పౌడర్ లైమ్ పౌడర్ జల్లుతున్నామని 46.80 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినా ప్రోటోకాల్ పర్యటనలకు వాడటం మినహా ప్రజారోగ్య మెరుగుదలకు వినియోగం చేయడం లేదన్నారు.     

  కార్పోరేషన్ బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం ద్వారా మ్యాచింగ్ గ్రాంటుతో పారిశుద్ధ్య పనులకు 16.75 కోట్లతో  వెచ్చించినా డంపింగ్ యార్డ్ బెడద నడిబొడ్డున వుండడం వలన దోమల తీవ్రత తగ్గడం లేదన్నారు. 

వీధి దీపం వేయాలన్నా వెలిగించాలన్నా, చెత్తలు తొలగించాలన్నా,  బ్లీచింగ్ జల్లించాలన్నా,  ప్రతి పనికి ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఆదేశాలు వస్తే తప్పా అంగుళం పని కూడా చేయలేని దురావస్థలో కార్పోరేషన్ యంత్రాంగం అలవాటు పడిపోవడం వలన నగర అభివృద్ధి పౌర సౌకర్యాల పరిస్తితి లోపలి ప్రాంతాల్లో అగమ్యగోచరంగా వుందన్నారు. కమీషనర్, డిప్యూటీ కమీషనర్ షో ఫోటోలతో ప్రకటనలు చేయడం వలన ప్రయోజనం లేదన్నారు. స్లంప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ ఆకస్మిక పర్యటనలు చేసి ప్రజారోగ్యం పనులను మెరుగుపరచాలని సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కోరారు.

Comments