మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా


  గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


ఆదివారం సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత పధకం కింద 3వ విడత ఆర్ధిక సాయాన్ని ముత్తుకూరు మండలానికి చెందిన 3,510 మంది లబ్ధిదారులకు 6.58 కోట్ల రూపాయల మెగా చెక్కును మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు.   ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి సంపూర్ణంగా, సంతృప్తికరంగా అమలు చేసినందువల్లనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి గర్వంగా వెళుతున్నామని, ప్రతి గడపలోను ప్రజలు తమకు సాదర స్వాగతం పలకడమే తమ ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు. కరోనా సమయంలో కూడా పేదవాడి ప్రగతి రథం ఆగిపోకూడదనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అందించినట్లు చెప్పారు. అర్హత ఒకటే ప్రామాణికంగా ప్రజల గడప వద్దకే సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా లక్షా 70 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 

 పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్కచెలెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించడం  జరుగుతుందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పధకం కింద   మొత్తం మూడు విడతల్లో  14,110.61 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 75,25,663 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.  జిల్లాలో మొత్తం మూడు విడతల్లో  645 కోట్ల రూపాయల  ఆర్ధిక సాయాన్ని 3,43,998  మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వైఎస్ ఆర్ చేయూత పధకం కింద  మూడు విడతల్లో 86.75 కోట్ల రూపాయల  ఆర్ధిక సాయాన్ని 46,265  మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని, ముత్తుకూరు మండల పరిధిలో  3వ  విడతలో 3,510మంది లబ్ధిదారులకు 6.58 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలు చిరు వ్యాపారాలకు, వ్యవసాయ, పాడి అవసరాలకు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ఆర్థికసాయంతో పాటు చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు బ్యాంకుల తోడ్పాటును కూడా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.


అక్టోబర్ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా మత్స్యకారేతర ప్యాకేజీ ఆర్థిక సాయం

........................ 

2019, ఏప్రిల్ 11 నాటికి ముత్తుకూరు మండలంలో తెల్లరేషన్ కార్డులు గల కుటుంబాలన్నింటికి ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారేతర ప్యాకేజీ ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి రూ 25 వేలను అక్టోబర్ నెలాఖరులోగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సుమారు 37 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు చెప్పారు. అలాగే నేలటూరు పాలెం వద్ద రూ 50 కోట్లతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు. 

 అనంతరం జాహ్నవి అనే దివ్యాంగ బాలికకు మంత్రి చేతుల మీదగా వీల్చైర్ ను అందించారు. అలాగే మత్స్యకార క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలకు మంత్రి జ్ఞాపికలు అందించారు. 


ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీ మలోల, ఎంపిపి శ్రీమతి గండవరం సుగుణమ్మ, జడ్పిటిసి శ్రీ నెల్లూరు శివ ప్రసాద్,  ఎం.పి.డి.ఓ శ్రీమతి ప్రత్యూష,  తాసిల్దార్ శ్రీ మనోహర్ బాబు, డిఆర్డిఎ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, మండల పరిధిలోని ఎంపిటిసీలు, సర్పంచ్ లు, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments