*- మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలపై శిష్ట్లా లోహిత్ ఆగ్రహం*
*- కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయనడం దారుణం*
*- హైకోర్టు అనుమతితోనే పాదయాత్ర చేస్తున్న రైతులు*
*- రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందే*
*- గుడివాడలో విజయవంతం చేయడం పట్ల కృతజ్ఞతలు*
గుడివాడ, సెప్టెంబరు 26 (ప్రజా అమరావతి): అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శిష్ట్లా లోహిత్ మీడియాతో మాట్లాడుతూ యాత్రలను అడ్డుకోవడం ఐదు నిమిషాల పని అని, కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయంటూ మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడడం దారుణమన్నారు. హైకోర్టు అనుమతితోనే అమరావతి రైతులు అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారని గుర్తుచేశారు. రైతుల మహా పాదయాత్ర కృష్ణాజిల్లా మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ నెల 23 వ తేదీన గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం దగ్గర మహా పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిందన్నారు. 24 వ తేదీన గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాలు, గుడివాడ పట్టణంలో జరిగిన మహా పాదయాత్రకు వేలాది మంది ప్రజలు మద్దతు తెలిపారన్నారు. 25 వ తేదీన నందివాడ మండలం మీదుగా మహా పాదయాత్ర సాగిందన్నారు. అడుగడుగునా ప్రజలు అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికారని తెలిపారు. ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని నినాదంతో చేపట్టిన మహా పాదయాత్రకు గుడివాడ నియోజకవర్గంలో అనూహ్య స్పందన వచ్చిందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సాగిన అమరావతి రైతుల మహా పాదయాత్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి అని అన్నారు . రాష్ట్ర హైకోర్టు అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించినా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచేలా అమరావతి రైతులు మహా పాదయాత్రను చేపట్టారని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షను మహా పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చి దుశ్చర్యకు పాల్పడడంతో పాటు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని పలువురు మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ పేరును మార్చి స్వార్ధ రాజకీయాలకు ఎవరు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని శిష్ట్లా లోహిత్ డిమాండ్ చేశారు.
addComments
Post a Comment