ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడంపై కొడాలి నాని రాజీనామా చేయాలి *- ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడంపై కొడాలి నాని రాజీనామా చేయాలి


*

 *- లేకుంటే నిజస్వరూపాన్ని ప్రజలే అర్ధం చేసుకుంటారు* 

 *- ఎన్టీఆర్ పై కొడాలి నానికి కపట ప్రేమ ఉందనుకుంటాం* 

 *- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


గుడివాడ, సెప్టెంబర్ 21 (ప్రజా అమరావతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ డిమాండ్ చేశారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరును మార్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాను విభజించి చిన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరును పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాను తామే ఏర్పాటు చేశామని చెప్పుకునే సీఎం జగన్ అదే జిల్లాలో ఎన్టీఆర్ వర్సిటీని మార్చడమేంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును ప్రజలకు దూరం చేయాలనే కుట్రకు సీఎం జగన్ తెర తీశారని అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుతో ఈ కుట్ర బట్టబయలైందన్నారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చగలరేమో గాని ప్రజల గుండెల నుండి మాత్రం చెరిపివేయలేరన్నారు. ఎన్టీఆర్ పేరును మార్చడంపై తెలుగుజాతి యావత్తు దిగ్భ్రాంతికి లోనైందని చెప్పారు. అధికార భాషా సంఘం చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎంతో మనస్తాపానికి గురై పదవులకు రాజీనామా చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ను ఆరాధ్య దైవంగా కొలిచే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించాలని, లేకుంటే అతని నిజ స్వరూపాన్ని గుడివాడ నియోజకవర్గ ప్రజలే అర్ధం చేసుకుంటారన్నారు. ఎన్టీఆర్ పై కొడాలి నానికి ఉన్నది కపట ప్రేమ అని రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమవుతుందన్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు అన్యాయం చేశారంటూ ఎమ్మెల్యే కొడాలి నాని పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారన్నారు. అదే ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొడాలి నాని ఏ విధంగా సమర్ధిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తూ ఆయనపైకి ఎన్టీఆర్ అభిమానులను కొడాలి నాని ఉసిగొల్పుతూ వస్తున్నారని తెలిపారు. కొడాలి నాని చూపుతున్న కపట ప్రేమను ఎన్టీఆర్ అభిమానులు అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. గుడివాడ ప్రాంత ప్రజలకు వరంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరును కూడా మార్చి వైఎస్సార్ పేరు పెట్టినా ఆశ్వర్యపోనక్కర్లేదన్నారు. జగన్ తో కుమ్మక్కై ఎన్టీఆర్ స్టేడియం పేరును మార్చాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి తిప్పికొడతామని హెచ్చరించారు. ఎన్టీఆర్ ను ప్రత్యక్ష దైవంగా చెప్పుకునే లక్ష్మీపార్వతి కూడా రాజీనామా చేయాలన్నారు. ఎన్టీఆర్ పేరును మార్చి అవమానించిన వైసీపీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. కారణజన్ముడు ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి కొనసాగించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి గౌరవించామని చెప్పుకునే సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కేంద్రంతో సన్నిహితంగానే ఉంటోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించాలన్నారు. అప్పుడే సీఎం జగన్మోహనరెడ్డి చెప్పుకుంటున్నట్టుగా ఎన్టీఆర్ కు తగిన గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తామని శిష్ట్లా లోహిత్ అన్నారు.

Comments