*పోలీస్‌స్టేషన్ నాకు ఇప్పుడు అత్తారిల్లులా మారిపోయింది*
*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్*
తెనాలి, (ప్రజా అమరావతి) : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టడం సంగతి అటుంచి అన్నా క్యాంటీన్లు పెట్టినవారిని కొడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో ఇటీవల మృతిచెందిన తమ పార్టీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల తర్వాత నరేంద్రనాథ్ తనకు పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు. మంగళగిరి, కుప్పం, తెనాలిలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతోందని ప్రశ్నించారు.
రాజారెడ్డికే భయపడలేదు..ఈయనకు భయపడతామా? : టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు. జగన్ తాత రాజారెడ్డికే భయడపలేదని, ఈయనకు భయపడతామా? అని వ్యాఖ్యానించారు. తనపై 15 కేసులు పెట్టారని.. ఏడు సార్లు జైలుకు తీసుకెళ్లారని లోకేశ్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, వైసీపీ నేతల దాడులకు భయపడేది లేదన్నారు. గతంలో ఎన్నడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని చమత్కరించారు. ఈ పర్యటనలో లోకేశ్ వెంట పార్టీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment