గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకే స్లాబ్ విధానం- సచివాలయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష


- ఆనాడు పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన హామీని నేరవేర్చారు

- గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకే స్లాబ్ విధానం


- స్లాబ్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7వేల యూనిట్లకు మేలు

- సమగ్ర భూసర్వే కోసం గ్రానైట్ పరిశ్రమ నుంచి సర్వేరాళ్ళను అందించాలి

- వచ్చే డిసెంబర్ నాటికి 30 లక్షల సర్వే రాళ్ళు అవసరం

- సర్వే రాళ్ళ కోసం ఎపిఎండిసి సొంత యూనిట్లును ఏర్పాటు చేసుకుంది

- ఇంకా డిమాండ్ మేరకు సర్వే రాళ్ళు కావాల్సి ఉన్నాయి

- వాటిని అందించడం ద్వారా గ్రానైట్ యూనిట్లకు కూడా పని లభిస్తుంది.

- సీఎం గారు ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూహక్కు-భూసర్వే నిర్వహిస్తున్నారు

- ఈ మహత్తర కార్యక్రమానికి గ్రానైట్ యూనిట్లు కూడా పూర్తి సహకారం ఇవ్వాలి

- మైనింగ్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి): 

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భూహక్కు-భూరక్ష కోసం అవసరమైన సర్వే రాళ్ళను అవసరానికి అనుగుణంగా అందించాలని గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులను అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.  సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం మైనింగ్ అధికారులు,  గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న భూహక్కు-భూరక్ష పథకం కింద వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 30 లక్షల సర్వే రాళ్ళు అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎపిఎండిసి ద్వారా ప్రకాశంజిల్లా బల్లికురులో సొంతగా సర్వేరాళ్ళను తయారు చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, అనకాపల్లిలో కూడా మరో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అయితే భూసర్వే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, రానున్న రెండుమూడు నెలల్లోనే లక్షల సంఖ్యలో సర్వే రాళ్ళు అవసరం అవుతున్నాయని తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా సర్వే రాళ్ళను అందించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న గ్రానైట్ యూనిట్లకు కూడా ఆర్డర్లు ఇవ్వాలని గనులశాఖ నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల గ్రానైట్ యూనిట్లకు కూడా పని లభిస్తుందని, ఈ పరిశ్రమపై ఆధారపడిన వారికి కూడా ఉపాధి కల్పన మెరుగువుతుందని అన్నారు. 


రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో పాదయాత్రలో శ్రీ వైయస్ జగన్ గారిని కలిసిన పలువురు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు తమ కష్టాలను వివరించారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా వారి కష్టాలను పరిష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చారని అన్నారు. దానిని ఆచరణలోకి తెస్తూ ఇటీవలే గ్రానైట్ పరిశ్రమలో స్లాబ్ విధానంను అమలు లోకి తీసుకువచ్చామని తెలిపారు. దీనివల్ల గ్రానైట్ పరిశ్రమకు మళ్ళీ మంచిరోజులు ప్రారంభమయ్యాయని అన్నారు. తాజాగా సమగ్ర భూసర్వే కోసం సర్వే రాళ్ళను రూపొందించే ఆర్డర్ లను కూడా గ్రానైట్ యూనిట్లకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వల్ల యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఇటు గ్రానైట్ పరిశ్రమకు ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూసర్వే కు రాళ్ళను అందంచడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమానికి గ్రానైట్ యూనిట్లు తమ సహకారాన్ని అందించినట్లు అవుతుందని అన్నారు. 


ఇటీవలే హైదరాబాద్ లో మైనింగ్ రంగంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో కాంక్లేవ్ జరిగిందని, పలు రాష్ట్రాలు ఈ కాంక్లేవ్ లో పాల్గొని తమ రాష్ట్రాల్లో మైనింగ్ ద్వారా ఏ రకంగా ఆదాయాన్ని పొందుతున్నాయో వివరించారని అన్నారు. పలు రాష్ట్రాలు వేల కోట్ల మేర మైనింగ్ ఆదాయాన్ని పొందుతున్నాయని ఈ కాంక్లేవ్ లో వెల్లడించాయని అన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పరిమితంగానే మైనింగ్ ఆదాయం లభిస్తోందని అన్నారు. మైనింగ్ ఏడి, డిడిలు పొరుగు రాష్ట్రాల్లో మైనింగ్ రంగంల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని,  అందుకు మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిఎంజిలు పూర్తి సహకారాన్ని అందిస్తారని తెలిపారు. మైనింగ్ ఆదాయంను కేవలం ఏడాది కాలంలో 9 వేల కోట్ల నుంచి 49 వేల కోట్లకు పెంచుకున్న రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో కూడా ఈ మేరకు ఆదాయాన్ని పెంచుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో గనులశాఖ ద్వారా రూ. 5వేల కోట్లు, ఎపిఎండిసి ద్వారా రూ.3 వేల కోట్లు మైనింగ్ రెవెన్యూ పెంచుకునేందుకు కృషి చేయాలని కోరారు.

ఇప్పటికే 21 మేజర్ మినరల్ బ్లాక్ లకు సంబంధించి ఎనిమిది బ్లాక్ లకు లీజు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని, ఇందుకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్ ను కూడా అందుకున్నామని గుర్తు చేశారు.  అలాగే మైనర్ మినరల్స్ కు సంబంధించి ఈఆక్షన్ విధానంను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని అన్నారు. దీనిద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వేల కొత్త లీజులను మంజూరు చేయబోతున్నామని వెల్లడించారు. దీనితోపాటు వివిధ ఖనిజాలకు సంబంధించిన లీజుల మంజూరీ ప్రక్రియను మరింత సరళతరం చేశామని అన్నారు. దీనివల్ల మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 


గ్రానైట్ పరిశ్రమకు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందిస్తున్న సహకారంకు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కృతజ్ఞతులు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 


ఈ సమావేశంలో మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, డిఎంజి విజి వెంకటరెడ్డి, పలువురు మైనింగ్ అధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.

Comments