*గురువులు అందరికీ పూజనీయులు*
*ఎం.పీ. డాక్టర్ బి.వి. సత్యవతి*
అనకాపల్లి, సెప్టెంబర్ 5 (ప్రజా అమరావతి): బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అందరికీ పూజనీయులు అని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి. సత్యవతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పెంటకోట కన్వెన్షన్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆమె మాట్లాడుతూ బాధ్యత గల పౌరులుగా, వివిధ రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసేవారు గురువులేనని చెప్పారు. అధ్యాపక వృత్తి శ్రమ, ఓర్పుల మిళితమని, మేథో సంపత్తిని పిల్లలకు బోధించడమే కాకుండా వారికి క్రమశిక్షణ, నడవడిక నేర్పవలసిన బాధ్యత కూడా వారిదే నన్నారు. ఉపాధ్యాయుల వల్లనే తాము ఈనాడు ఈ స్థితికి వచ్చామని చెప్పారు. ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం క్రింద పాఠశాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా సౌకర్యవంతంగా ఉంటున్నాయన్నారు. అయితే ప్రస్తుతం పిల్లలలో ఐ.క్యూ. పెరిగినందున ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిని తీర్చిదిద్దాల్సిందిగా కోరారు. బమ్మెర పోతన వ్రాసిన మహాభారతంలో ప్రహ్లాదుడు గురువుని గురించి చెప్పిన పద్యాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధ్యక్షోపన్యాసం చేస్తూ గురువు మార్గదర్శకత్వం ప్రతివారికి భవిష్యత్తు లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమాజంలో లో గురువులకు ప్రత్యేకస్థానం ఉన్నదని, మనిషి నడవడికను, సామర్ధ్యాన్ని, విజ్ఞాన పటిమను తీర్చిదిద్దేది గురువేనని తెలిపారు. విద్యనభ్యసించిన గురువు పట్ల నిజమైన శిష్యుడికి గౌరవం, అభిమానం, ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయితే తమ భవిష్యత్తుకు బాటలు వేసిన గురువును సత్కరించేందుకు ఒక రోజును ఏర్పాటు చేసుకున్నారని అదే మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం అని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల అందరికీ అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా ప్రజల సంక్షేమానికే నని గుర్తించవలసినదిగా సూచించారు. ఉపాధ్యాయులు అందరూ కష్టపడి దీక్షతో పనిచేసి జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బి.వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు మాట్లాడారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.ఈ.ఓలు, ఉపాధ్యాయులను సత్కరించారు అంతకుముందు అతిథులందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నాట్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, విద్యా శాఖ ఏడి రవి, టీచర్ యూనియన్ నాయకులు, ఎన్ యు వోలు జిల్లాలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment