హైకోర్టు జడ్జి జస్టిస్ కొంగర విజయలక్ష్మి సేవలను కొనియాడిన హైకోర్టు సిజె:పికె మిశ్రా
అమరావతి,19 సెప్టెంబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ కొంగర విజయలక్ష్మి పదవీ విరమణ సందర్భంగా సోమవారం నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోని మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల నుండి న్యాయశాస్తంలో పట్టా తీసుకున్నజస్టిస్ కొంగర విజయలక్ష్మి అత్యధిక మార్కులు సాధించినందుకు సర్టిఫికెట్ అందుకోవడమే గాక ఆంధ్రవిశ్వకళా పరిషత్ నుండి మెడల్ కూడా సాధించారని చెప్పారు.హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె తన 5ఏళ్ళ సర్వీసులో 9వేల 700 కేసులను పరిష్కరించారని సిజె జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.1985లో న్యాయవాదిగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించి 1991 నుండి 1995 వరకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గాను,1996 నుండి 2004 వరకూ గవర్నమెంట్ ప్లీడర్ గాను సేవలందించారని ఆయన గుర్తు చేశారు.అదే విధంగా 1996-97 మధ్య అదనపు అడ్వకేట్ జనరల్ గాను,తదుపరి కాలంలో జువనైల్ జస్టిస్ కమిటీకి చైర్ పర్సన్ గాను కూడా సేవలందించారని తెలిపారు.ఈవిధంగా వివిధ హోదాల్లో ఆమె న్యాయవ్యవస్థకు మెరుగైన సేవలు అందించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కొనియాడారు.
ఈవీడ్కోలు సభలో హైకోర్టు న్యాయమూర్తిగా ఇప్పటి వరకూ సేవలందించిన జస్టిన్ కొంగర విజయలక్ష్మి మాట్లాడుతూ ముందుగా తన కేరీర్లో ఇంతటి స్థాయికి చేరేందుకు తనకు తోడ్పడిన ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు,సహచర న్యాయమూర్తులు,తన తల్లిదండ్రులు సహా ప్రతి ఒక్కరికీ ముందుగా తన ధన్యవాదాలు తెలియజేశారు.1985లో తాను న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని నేడు హైకోర్టు న్యాయమూర్తిగా పూర్తి సంతృప్తితో పదవీ విరమణ పొందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.తన గురువులు,సీనియర్ల నుండి ఎన్నో అత్యంత ప్రామాణికాలు,నైతిక విలువలను నేర్చుకున్నానని ఈమె ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా ఉండి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సత్వర న్యాయసేవలు అందేలా కృషి చేయాలని జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ విజయలక్ష్మి ప్రతి అంశంపైనా పూర్తి అవగాహన కల్పించుకునేవారని చెప్పారు.ఆమె తన న్యాయమూర్తి కెరీర్లో అనేక ముఖ్యమైన అంశాల్లో తీర్పులు ఇచ్చారని అన్నారు.హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకీరామి రెడ్డి మాట్లాడుతూ 1960లో కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన జస్టిస్ కొంగర విజయలక్ష్మి గ్యాడ్యుయేషన్ అనంతరం ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల నుండి న్యాయశాస్త్ర పట్టాను,హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్ఎం పట్టాను పొందారన్నారు.న్యాయవాదిగా వివిధ హోదాల్లో పనిచేసిన తదుపరి 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది అనేక విప్లవాత్మకమైన కేసుల్లో తీర్పులు వెలువరించారని ఆయన గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో జస్టిస్ విజయలక్ష్మి న్యాయవ్యవస్థలో మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హర్ నాధ్ మాట్లాడుతూ సిఆర్ రెడ్డి కళాశాల నుండి వచ్చిన వరుసగా రెండవ న్యాయమూర్తికి జరుగుతున్న వీడ్కోలు సభని అన్నారు.ఆమె శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖంగా సాగాలని ఆయన కాక్షించారు.
ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,రిజిస్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment