అసెంబ్లీ, అమరావతి (ప్రజా అమరావతి);
*వ్యవసాయరంగంపై శాసనసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
సభలో నిన్న విద్య, వైద్య రంగాలలో నాడు–నేడు.. గతానికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందనేది చర్చించాం. అదే విధంగా నాడు–నేడు అన్న పోలిక బాగా తీసుకువచ్చే మార్పు వ్యవసాయరంగంలో కూడా జరిగింది. గ్రామస్ధాయిలోనే ప్రతి రైతన్నకు కూడా మార్పు కనిపించే విధంగా ఆర్బీకేలు చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం, గొప్ప విప్లవాత్మక మార్పు మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగింది.
సభలో తెలుగుదేశం సభ్యులు కూడా ఉండి ఉంటే బాగుండేది. వాయిదాతీర్మానం ఎందుకు ఇస్తారో తెలియదు. రైతుల సమస్యల మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇస్తారు. చర్చ జరిగే సమయానికి ఉండకుండా అదే పనిగా సస్పెండ్ అయ్యేటట్టు చేసుకుని సభ నుంచి వెళ్లిపోతారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోపే అమలు చేశాం. అంతే కాకుండా, మొత్తంగా మేనిఫెస్టో హామీల్లో 98.4 శాతం హామీలను మూడున్నరేళ్లకు ముందే అమలు చేసిన, చేస్తున్న ప్రభుత్వం మనది.
మంచి చేస్తున్నాం కాబట్టే ప్రజల చల్లని దీవెనలతోపాటు దేవుడి దయ నిరంతరం ఉంటూ మన ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. కాబట్టే మన 40 నెలల పాలనలో ఒక్క ఏడాది కూడా... ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.
*కరువు-బాబు కవలలు అనేది నానుడి.*
అదే చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే. 2014లో 238, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018లో 347 మండలాలను కరవు మండలాను ఖరీప్‌లో ప్రకటిస్తే.. 2019లో ఆయన దిగిపోయిన ఏడాదిలో రబీలో 257 మండలాలను ప్రకటించారు. అందుకే చంద్రబాబు నాయుడు పాలన గురించి ఒక నానుడి కూడా ఉంది. కరువు–బాబు కవలలు అనేది నానుడి.
ఇక, ప్రస్తుతానికి వస్తే... సెప్టెంబర్ రెండో వారంలో కూడా పుష్కలంగా నీరు... కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు... చెరువులు, దొరువులు, కాల్వలు, వాగులు, వంకలు, నదులు... ఇలా అంతటా నీరు కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ఐదు ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా అన్నీ కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న ఘట్టం ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నాం.
కృష్ణా గోదావరి డెల్టాలతో పాటు, రాయలసీమకు అత్యధికంగా సాగునీటిని ప్రాజెక్టుల ద్వారా... కాల్వల ద్వారా నీరు ఇచ్చింది కూడా ఈ మూడేళ్ళలోనే దేవుడి దయతో చేయగలిగాము.
రాష్ట్రం మొత్తాన్ని తీసుకున్నా, సగటున భూగర్భ జలాలు 2018 వర్షాకాలం తరవాత 12.65 మీటర్లు... అంటే దాదాపు 42 అడుగుల లోతున ఉంటే.... 2021 వర్షాకాలం తరవాత సగటున భూ గర్భజలాలు రాష్ట్ర వ్యాప్తంగా 5.78 మీటర్లకు, అంటే దాదాపు 19 అడుగులకు చేరాయి. దేవుడి దయతో గొప్ప మార్పు జరిగింది.
ఆహార ధాన్యాల దిగుబడిలో కూడా గడచిన మూడేళ్ళ కాలంలో రికార్డు స్థాయి దిగుబడి వచ్చింది. ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో పోలిస్తే, దేవుడి దయ వల్ల గత మూడేళ్ళలో– ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 13.29 లక్షల టన్నులు పెరిగింది.
2014–19 మధ్య అంటే గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు అయితే... అది, మనందరి ప్రభుత్వంలో మొదటి మూడేళ్లలో సగటున 167.24 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అంతకు ఏమాత్రం తగ్గకుండా వస్తుంది.
ఈ దిగుబడి ఏం చెపుతోందంటే, రైతే కాదు వ్యవసాయం మీద ఆధారపడిన కార్మికుడు కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తోంది. దేవుడి దయ వలన రైతుపక్షపాత ప్రభుత్వంగా ఈ 40 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం రైతన్నల కోసం వ్యవసాయ రంగంలో చేసిన ఖర్చు...రూ.1,28,634 కోట్లు.
*ఎలాంటి లబ్ధి చేకూర్చామో, వ్యవసాయంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చామో చెపుతాను.*
*వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్*
ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీ, రూ. 12,500 చొప్పున రైతు కుటుంబాలకు నాలుగేళ్ళలో రూ. 50,000 ఇస్తాం అని చెప్పాం. ఇచ్చిన హామీకన్నా మిన్నగా, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 సహాయంగా అందిస్తున్నాం.
రైతులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్ పత్రాలు పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు, ఆలయాల భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా మనందరి ప్రభుత్వం ఏటా పెట్టుబడి సాయం చేస్తోంది.
వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకంలో వరసగా నాలుగో ఏడాది, ఈ ఖరీఫ్ సీజన్‌లో తొలి విడత సహాయం కూడా చేశాం. అక్టోబరులో రెండో విడత సహాయం కూడాఅందజేస్తున్నాం.
రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయంగా ఇచ్చిన మొత్తం రూ.23,875.29 కోట్లు.
*వైయస్సార్ ఉచిత పంటల బీమా.*
ముందుగా ఒక విషయం చెప్పాలి.
మన రైతన్న తన పంటను బీమా చేసుకోవాలంటే ఒక్క రూపాయి కూడా తన చేతినుంచి చెల్లించాల్సిన అవసరం లేకుండా, మొత్తం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం... మనదే.
అంతేకాకుండా, ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి మళ్ళీ ఆ సీజన్ ప్రారంభం అయ్యేలోపే పరిహారం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే.
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ మూడేళ్లలో 44.28 లక్షల రైతులకు రూ.6684.84 కోట్ల పరిహారం కింద ఇచ్చామని గర్వంగా చెబుతున్నాం.
*ఇ– క్రాప్.*
ఈ–క్రాప్ నమోదు ఆధారంగా వాస్తవ సాగుదారుడికి బీమా రక్షణ కల్పించడం, దేశంలోనే ఎక్కడా లేదు. దేశం కూడా మన ఆర్బీకేలను చూసి అక్కడ ఇ– క్రాప్ ఎలా చేస్తున్నామో తెలుసుకుంటున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చి ఈ పథకాన్ని దేశమంతా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి.
2012–13కు సంబంధించి బకాయిగా ఉన్న ఇన్సూరెన్స్ సొమ్మును కూడా, . గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా మనందరి ప్రభుత్వం కేంద్రంతోనూ, ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. ఆ మేరకు అప్పుడు పంటలు నష్టపోయిన రూ. 120 కోట్ల పరిహారం ఇప్పించాం.
అలాగే గత ప్రభుత్వ హయాంలో.. అంటే 2018–19కి సంబంధించి బకాయిగా మిగిలిన బీమా పరిహారం రూ.596.40 కోట్లు రైతులకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇప్పించడం జరిగింది.
పంటల బీమాలో ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో రైతులకు చాలా నష్టం జరిగింది. పైగా బాబు పాలనలో ఐదు సంవత్సరాలు కూడా కరవు సంవత్సరాలే. రైతులు అత్యధికంగా నష్టపోయిన సంవత్సరాలు కూడా అవే. అటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ రాకపోతే పరిస్థితి ఏమిటన్నది అర్ధమయ్యే సంవత్సరాలు అవి.
అలాంటి సంవత్సరాల్లో వ్యయసాయ బీమాగా చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కట్టలేదు. కాబట్టే బీమా పరిహారం రైతులకు అందని పరిస్థితి చూశాం. అలా, గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన మొత్తం రూ.715.84 కోట్లను కూడా పంటల బీమాగా మనమే చెల్లించడం జరిగింది. ఇది ఇన్సూరెన్స్ చరిత్రలో మర్చిపోలేని ఘట్టం. ఇన్సూరెన్స్ రంగంలో ఇన్ని మంచి మార్పులు జరుగుతున్నా కూడా... గతంలో ఎప్పుడూ ఇవ్వనంత ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నలకు మనం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నా... ఇలాంటివి బాబుకు కానీ, ఆయన వంది మాగధులుకు కానీ కనిపించదు. వాళ్లూ దీని గురించి ఏ రోజూ మాట్లాడరు.
*వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం.*
ఇ–క్రాప్‌లో నమోదు చేసుకుని, లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు, మన ప్రభుత్వం ఆ వడ్డీ భారాన్ని తానే మోస్తోంది.
ఆ మేరకు నిధులను నేరుగా బటన్ నొక్కి ౖరైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో జమ చేస్తున్నాం. ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పంట రుణాల కింద 65.65 లక్షల రైతులకు రూ.1282.11 కోట్ల వడ్డీని నేరుగా, చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలతో సహా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
2020–21 రబీ, 2021 ఖరీఫ్‌లకు సంబంధించిన వడ్డీ రాయితీని ఈ నవంబరులో విడుదల చేస్తున్నాం. ఇది కూడా పద్దతిగా జరుగుతుంది.
*మరో విషయం చెప్పాలి..*
పూర్తిగా, బేషరతుగా రుణ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికల వాగ్ధానం చేసారు. రూ.87,612 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. ఆ రుణ మాఫీ కథ వింటే పంచపాండవులు, మంచం కోళ్ళ కథ గుర్తుకు వస్తుంది. వెంటనే ఆ రూ.87,612 కోట్లు రుణాలు మాపీ చేస్తానని, రుణాలు కట్టవద్దని, చివరకి సున్నావడ్డీ కూడా ఎగ్గొట్టి ఐదేళ్లలో రుణమాఫీ అని ఇచ్చింది రూ.15వేల కోట్లు. కానీ రైతుల వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోయాయి. బాబు మాట నమ్మి రైతులు మరో రూ. 87 వేల కోట్లకు పైనే నష్టానికి గురయ్యారు.
*ఆయన ఇచ్చిన హామీ ఏమిటి ? ఊసరవెల్లి కన్నా వేగంగా ఎలా మాట మార్చాడన్నది చూద్దాం. ( సీఎం వీడియో ప్రజంటేషన్)*
రుణమాఫీ చేస్తానని మోసం చేయడమే కాకుండా ఆ మోసాన్ని కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్తూ దాన్ని సమర్ధించుకోవడం అన్నది.. ఇలాంటి వాళ్లు ఉండబట్టే రాజకీయ నాయకులకు, మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయింది. మరలా రాజకీయనాయకులకు, మేనిపెస్టోకు విలువ ఎప్పుడు వచ్చిందంటే.. మరలా ఈ మూడు సంవత్సరాల మన పరిపాలన తర్వాతనే వచ్చింది.
రుణమాఫీ వాగ్దానానికి మాత్రమే కాకుండా... రైతులకు సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ... ఇలా అన్నింటికీ సున్నా చుట్టిన ఘనత... చంద్రబాబుది. ఇలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అటకెక్కించిన మరో పథకం రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు.
*సున్నా వడ్డీ పంటరుణాలు..*
2014 నుంచి 2019 వరకు గత తెలుగుదేశం ప్రభుత్వం 39.05 లక్షల రైతులకు బకాయి పెట్టి పోయిన పంట రుణాల సున్నా వడ్డీ సొమ్ము రూ.784.71 కోట్లు. ఆయన ఇవ్వకపోతే బ్యాంకులకు మనం కట్టాం.
*ఇన్‌పుట్ సబ్సిడీ...*
‘ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి పూర్తి పరిహారం అందాలి. అదీ సకాలంలో అందాలి’.. ఇదే మనందరి ప్రభుత్వ విధానం. అలా అందకపోతే అది వృధా అవుతుంది. రైతుకు ఉపయోగపడదు. దీన్ని కచ్చితంగా అమలు చేస్తూ... గత ప్రభుత్వ హయాంలో కంటే పూర్తి భిన్నంగా, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లించే గొప్ప విప్లవాత్మక మార్పు మన హయాంలోనే జరిగింది. దీనికోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో కార్యక్రమం ‘ఇన్‌పుట్ సబ్సిడీ’.
అందుకోసం రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేయగా, 2020 ఖరీఫ్ సీజన్ నుంచి పలు దఫాలుగా 16.67 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 12.15 లక్షల రైతులకు రూ.932.07 కోట్ల సహాయం చేశాం.
2021 సెప్టెంబరులో గులాబ్ తుపాన్ వల్ల 35 వేల ఎకరాల్లో 28 వేల మంది రైతులకు వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టం జరిగింది. వీరికి 45 రోజుల్లోనే రూ.22 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇచ్చాం.
అదే విధంగా 2021 నవంబరులో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల 10.10 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ పంటలు నష్టపోయిన 5.97 లక్షల రైతులకు మూడు నెలల్లోనే రూ.542.09 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం.
అంతకు ముందు 2019–20లో పలు ప్రకృతి వైపరీత్యాల వల్ల 1.83 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 1.47 లక్షల రైతులకు కూడా రూ.116.63 కోట్ల పెట్టుబడి రాయితీ అందజేయడం జరిగింది.
ఆ విధంగా ఈ మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 20.85 లక్షల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.1,795.39 కోట్లు ఇచ్చాం.
దేశంలోనే తొలిసారిగా మరో విప్లవాత్మక మార్పు మన రాష్ట్రంలో జరిగింది. అది ఆర్బీకేల ఏర్పాటు.
రాష్ట్ర వ్యాప్తంగా మనం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల్లో 24,424 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లోమా చేసిన ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
ప్రతి ఆర్బీకేలో వీరు గ్రామ వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన సహాయకుడు, పట్టు పరిశ్రమ సహాయకుడు, పశు సంవర్థక సహాయకుడు, మత్స్య సహాయకుడుగాను పనిచేస్తున్నారు. వీరందరితో పాటు ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు çకూడా పని చేస్తున్నారు.
నీతీ ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, ఎఫ్‌యేవో( పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) లాంటివి అన్నీ వచ్చి, చూసి ప్రశంసించి వెళ్తున్నారు. ఎందుకంటే... ల్యాబ్ టూ ల్యాండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేసే కేంద్రాలు ఇవి. అంటే వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విప్లవాత్మక మార్పుల్ని రైతుకు, పొలానికీ చేరవేసే కేంద్రాలు ఇవి.
*విత్తనం నుంచి విక్రయం వరకూ...*
విత్తనం నుంచి అమ్మకం వరకు అడుగడుగునా రైతుకు అండగా ఉండేందుకు మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతన్న నేస్తాలు... ఈ ఆర్‌బీకేలు.
ప్రభుత్వం సర్టిఫై చేసినవిత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోపాటు... రైతు కోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములన్నీ, గ్రామాలలో ఇ–క్రాప్ ద్వారానే ఆర్‌బీకేల నుంచి రైతులకు చేరుతున్నాయి. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో ఇవి దొరకాలంటే పెద్ద, పెద్ద లైన్లు కనిపించేవి. నియోజకవర్గ కేంద్రానికో, మండల కేంద్రానికో వెళ్తే తప్ప గతంలో దొరికేవి కావు. లైన్లో నిలుచున్నా ఎంత ఇస్తారన్నది కూడా రేషన్ ప్రకారమే. అందులో నాణ్యత కూడా సందేహమే. అలాంటి పరిస్థితుల నుంచి నేడు పూర్తిగా మార్పులు జరిగాయి. గ్రామ స్దాయిలోనే లైన్లు లేకుండా నాణ్యత నిర్ధారించి ఇస్తున్నాం.
వీటన్నింటికీ మించి... గోదాములు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు గ్రామ స్ధాయిలో ఆర్బీకేల పరిధిలోనే జరుగుతున్నాయి. వీటన్నింటి కోసం ఆగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ కింద రూ.17వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
రైతన్నలు తాము పండించిన పంట ఏ రకమైన నాణ్యత ఉంది, తాను వేసేటప్పుడు అవి నిజంగానే నాణ్యతతో ఉందా లేదా చూసుకోవడం అని... వివిధ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం వైయస్సార్ ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు తీసుకొచ్చాం. ఈ ల్యాబ్‌లు రైతులు మోసపోకుండా టెస్టింగ్ ఆర్బీకేల నుంచి మొదలుపెడితే గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 ల్యాబ్‌లు, పూర్వపు జిల్లా స్థాయిలో 13, మరో 4 రీజినల్ ∙సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. 147 అసంబ్లీ నియోజవర్గస్ధాయి ల్యాబ్‌లకు గానూ ఇప్పటికే 70 నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తున్నాయి. మిగిలినవి ఈ డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం.
*వైయస్సార్ యంత్రసేవా పథకం.*
రైతులు సాగు ఖర్చు తగ్గించుకునేందుకు, తద్వారా నికర ఆదాయం పెంచుకునేందుకు వ్యవసాయ యంత్రీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్బీకేను యూనిట్ కింద తీసుకుని ప్రతి ఆర్బీకేను కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద రైతులతో కూడిన ఒక గ్రూపునకు ఈయంత్రాలను అప్పగిస్తారు.యంత్రాలను 40 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులు ఇవ్వడం, మరో 50 శాతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు కేవలం 10 శాతం రైతులు పెడితే యంత్రసేవలు అందుబాటులోకి వస్తాయి.
ఆ దిశలోనే వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులు వారు వాడుకోవడమే కాకుండా.. ఆ ఆర్బీకే పరిధిలో తక్కువ అద్దె (బాడుగ)కు ఇచ్చే విధంగా ‘వైయస్సార్ యంత్రసేవా పథకం’ మొదలు పెట్టాం.
ఆర్బీకేల స్థాయిలో 10,750 గ్రామాల్లో ఒక్కోటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో, యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
అలాగే వరి ముఖ్య పంటగా ఉన్న మండలాల్లో 1615 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన ఒక్కోటి రూ.25 లక్షల విలువైన పరికరాలతో ‘క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు’గా ఏర్పాటు చేస్తున్నాం.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు కాగా, వాటిలో రూ.691 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది.
*ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు*
కిసాన్ డ్రోన్లు కూడా ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పరిజ్ఞానంలో రైతులను ప్రోత్సహించాలని మనందరి ప్రభుత్వం నిర్ణయించింది.
కిసాన్ డ్రోన్లతో పురుగు మందులు పిచ్‌కారీ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయొచ్చు. అలాగే పురుగు మందు వినియోగాన్ని కూడా తగ్గించగలుగుతాం. ఈ ఏడాది తొలిసారిగా 2 వేల డ్రోన్లతో యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాబోయే రెండు సంవత్సరాలలో వీటిని లాంచ్ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దీనివల్ల కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద గ్రూపు ఏర్పాటు అవుతుంది... ఆగ్రూపులో పదో తరగతి కంటే ఎక్కువ చదివిన ఒకరికి డ్రోన్ ఫ్లైయింగ్ లైసెన్స్ వస్తుంది. వీరికి శిక్షణ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఒక్కో డ్రోన్ ఖర్చు దాదాపు రూ.10 లక్షలు అవుతుంది. వీటిని 2వేల ఆర్బీకేల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ప్రతి ఆర్బీకే పరిధిలో ప్రతి రైతుకు కూడా తన పొలంలో సాయిల్ టెస్ట్ చేసి, సాయిల్ హెల్త్ కార్డులు కూడా ఇస్తూ.. సాయిల్ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని ఈ మార్చి నుంచి అమల్లోకి తీసుకుని రాబోతున్నాం. దీనివల్ల ఏ పంటకు ఎంత ఎరువులు, ఏ ఎరువులు వేయాలన్నది ప్రతి రైతుకు అర్ధమవుతుంది. దానివల్ల ఇష్టమొచ్చినట్టుగా వాడకం కాకుండా.. సరిపడా వేసే పరిస్థితి వస్తుంది.
*ఉచిత విద్యుత్ సరఫరా...*
ఉచిత విద్యుత్ గతంలో లేని విధంగా జరుగుతోంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట విద్యుత్ శాఖ అధికారులను అడిగాను... పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాం. అది ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాలని చెప్పాం. మనం ఇవ్వాలనుకున్నా ఇవ్వలేమని అధికారులు చెప్పారు. దానికి ఫీడర్లు, సబ్‌స్టేషన్లు అప్‌గ్రేడ్ చేయాలి. దానికోసం మరో రూ.1700 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ రైతన్నలకు పగటిపూట, 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు, మూడేళ్లలో ఏటా సగటున రూ. 9,000 కోట్లు... అంటే మొదటి మూడేళ్లలోనే రూ. 27,000 కోట్లు ఉచిత విద్యుత్తు సబ్సిడీగా; రూ. 1700 కోట్లు ఫీడర్లు, సబ్ స్టేషన్ల ఆధునికీకరణకు మనందరి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్తు ద్వారా లబ్ధి పొందుతున్న మొత్తం రైతులు 18.70 లక్షలు.
అంతే కాకుండా... గత ప్రభుత్వం, తాను దిగిపోయే ముందు, వ్యవసాయ విద్యుత్తుకు రూ.9,000 కోట్ల మేర డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా వదిలేసింది. ఈ బకాయిల్నీ మనమే చెల్లించాం.
ఆక్వా రైతుకు కరెంటు సబ్సిడీకి మూడేళ్ళలో రూ.2500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనది మాత్రమే. కరెంటు చార్జీలు పెరుగుతున్నా పది ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకూ అంటే 95 శాతం మందికి రూ.1.50కే ఆక్వా రైతుకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ప్రభుత్వం కూడా మనదే.
ధాన్యం చెల్లింపుల విషయంలో పెట్టిన రూ.960 కోట్ల బకాయిలు, విత్తనాల విషయంలో పెట్టిన రూ. 430 కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది.
*ఉచిత విద్యుత్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి...*
ఎల్లో మీడియా, చంద్రబాబు కావాలని వక్రీకరించాలని మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పు అన్నట్టు చెప్తున్నారు. వీళ్లు ఏ ప్రపంచంలో ఉన్నారు. అసలు వీళ్లకు చిత్తశుద్ధి ఉనేది అందా అనిపిస్తుంది.
మనం ఎక్కడా కూడా ఏ రైతు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు, చేయం, చేయబోం. ఈ మూడు పదాలు చాలా ముఖ్యమైనవి. ఇటువంటి నేపధ్యంలో మీటర్లు రావడం వల్ల జరిగే మంచి ఏమటన్నది అందరూ తెలుసుకోవాల్సి ఉంది.
మీటర్లు రావడం వల్ల ప్రతి రైతన్నకు మనం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతాం. దీనివల్ల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు. రైతు వరకు నాణ్యమైన విద్యుత్ చేరుతుంది. ఇదొక గొప్ప మార్పు. దీనితో పాటు డిస్కంలను ప్రశ్నించే హక్కు రైతులకిస్తున్నాం. ఇన్ని మంచి జరిగే కార్యక్రమాలను జరుగుతున్నా.. కావాలనే వక్రీకరించడం, సగం తెలిసి, సగం తెలియని తనం.. ఈ రెండింటి కారణాల వల్ల రైతులు నష్టపోకూడదు. రైతులను మనం కాపాడుకోగలిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. రైతు సురక్షితంగా ఉండాలి, రైతు సంతోషంగా ఉండాలంటే రైతుకు మనం ఇచ్చే ప్రతి పనిలోనూ నాణ్యత ఉండాలి. అది లేకుండా ఏం చేసినా రైతు నష్టపోతాడు.
*ధరల స్ధిరీకరణ నిధి*
రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంతగా నష్టపోతాడో మనందరికీ తెలిసి విషయమే. దీనికోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా రూ.6903 కోట్ల విలువైన 20.10 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసి రైతన్నను కాపాడుకోగలిగాం. ఇవాళ ఆర్బీకే స్ధాయిలోనే సీఎంయాప్ ఉంది. సీఎంయాప్ అంట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి పంటకు కూడా ఏది గిట్టుబాటు ధర అనే పోస్టర్ ఉంటుంది. దానికన్నా పంటకు రేటు తగ్గిపోతే అక్కడున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యాక్టివేట్ అయి మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కు, జేసీకు నివేదిస్తాడు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ పద్దతి ప్రకారం విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేలు చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమానికి అడుగులు వేశాం.
ధాన్యానికి, పత్తి కొనుగోలుకి సంబంధించి కూడా చెప్పాలి. గతంలో చంద్రబాబు హయాంలో ధాన్యానికి సంబంధించి రూ.7, రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.... మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రూ.14వేల నుంచి రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తూ.. రైతన్నకు తోడుగా ఉంటున్నాం.
రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు. ఇది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. కారణం వ్యవసాయానికి, రైతుకు గుండెతో, మనసుతో... మనం చేయగలిగినదంతా చేస్తున్నాం. అయినా... గత ప్రభుత్వంలో వరస కరువు ప్రభావం వల్ల, బాబు వాగ్దానాలు నమ్మి అప్పు కట్టకుండా వడ్డీలు, చక్రవడ్డీలు పెరగటం వల్ల... ఇతరత్రా కారణాల వల్ల దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని మనం ఎలా పట్టించుకున్నామన్నది చాలా అవసరం. ఇక్కడ కూడా మానవతాదృక్పధంతో ఎప్పుడూ గత ప్రభుత్వాలు చూపని విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి రైతుకు గతంలో మాదిరిగా కాకుండా పరిహారాన్ని రూ. 7 లక్షలకు పెంచాం.
పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు, సీసీఆర్సీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి కౌలుదారుడికీ పొరపాటున వారు చనిపోయిన తర్వాత రూ.7 లక్షలు పరిహారం అందని కుటుంబం కనీసం ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది. అంత పారదర్శకంగా ఆర్బీకేలు స్పందిస్తున్నాయి. కలెక్టర్లు దగ్గర రూ.1 కోటి ఇంప్రెస్ అమౌంట్ కూడా పెట్టాం. నష్టం జరిగిన వెంటనే కలెక్టర్లు అప్పటికప్పుడు ఇచ్చే గొప్ప సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది.
గతంలో చంద్రబాబు హాయాంలో, 473 మంది రైతులు రూ.5 లక్షల పరిహరం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రైతులు చనిపోతే పట్టించుకోలేదు. 473 కుటంబాల వారికి కూడా రూ.5 లక్షల పరిహారం కింద రూ.23.65 కోట్ల పరిహారం మనందరి ప్రభుత్వం ఇచ్చింది. గతంలో రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ఒప్పుకుంటే పరిహారం ఇవ్వాల్సి వస్తుందేమోనని, లేదా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆత్మహత్యలను అక్నాలెడ్జ్ కూడా గత ప్రభుత్వం చేయలేదు.
అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చి రైతన్న ఎక్కడ చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలన్న భావన, భరోసాతో మానవతాధృక్పధంతో రైతు ఎక్కడ చనిపోయినా కచ్చితంగా నమోదు అయ్యేట్టు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.
దీనిలో భాగంగానే 2019 జూన్ 1 నుంచి డిసెంబరు 31 వరకు బలవన్మరణాలకు పాల్పడిన 308 రైతుల కుటుంబాలకు మనందర ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21.56 కోట్ల పరిహారం అందజేసింది. ఆ క్రమంలోనే 2020లో 260 రైతుల కుటుంబాలకు కూడా రూ.7 లక్షల చొప్పున రూ.18.20 కోట్ల పరిహారం ఇవ్వడం జరిగింది.
2021లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ సంవత్సరంలో 126 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, వారి కుటుంబాలకు కూడా రూ.7 లక్షల చొప్పున రూ.8.82 కోట్లు పరిహారంగా ఇచ్చాం. ఇలా, రైతుల కుటుంబాలకు మొత్తం రూ.72.145 కోట్ల పరిహారం ఇవ్వడం జరిగింది.
ఇక 2021–22 ఏడాదిలో ఇందు కోసం రూ.20 కోట్లు కేటాయించగా, అందులో నుంచి రూ.15.345 కోట్లు రైతుల కుటుంబాలకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. కౌలు రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మానవతాదృక్పధంతో వ్యవహరించడం మొదలు పెట్టింది.
ఇతర రైతుల మాదిరిగా కౌలు రైతులకు కూడా అన్ని ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో ‘పంటల సాగుదారుల హక్కు చట్టం’ (సీసీఆర్‌ఏ)ని మనందరి ప్రభుత్వమే తీసుకువచ్చింది. ఆ చట్టం 2019, ఆగస్టు 17 నుంచి అమలు అవుతోంది.
భూ యజమానికి ఎలాంటి ఇబ్బందీ కలగని విధంగా, కౌలు రైతులు 11 నెలలు సాగు చేస్తే, వారికీ రైతులతో సమానంగా అన్ని పథకాలు, రుణాలు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కౌలు రైతులు ఇంకా ముందుకు వచ్చి ఈ సీసీఆర్సీని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను.
*వ్యవసాయ సలహా మండళ్లు...*
రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించే లక్ష్యంతో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఇ–క్రాపింగ్ జరుగుతుంది. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పంటలప్రణాళిక రూపొందించాలి. రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించే లక్ష్యంతో ఈ మండళ్లు స్ధాపించాం.
ఆర్బీకేల స్థాయిలో ప్రతి నెల మొదటి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం ఈ మండళ్లు సమావేశం అవుతున్నాయి. పరిష్కారాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది.
మొత్తం 1.14 లక్షల రైతులు, నిపుణులు సలహా మండళ్లలో సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ఇంతకముందు జరగని విధంగా నాడు–నేడు అని తేడా కనిపించే విధంగా అడుగులు వేశాం.
*మరికొన్ని వాస్తవాలను అందరి ముందుంచుతాను.*
మన రాష్ట్రంలో 67 శాతం రైతు కుటుంబాలకు సగటున ఉన్న పొలం 1 ఎకరా 05 సెంట్లు. ఆ తరవాత 20 శాతం రైతు కుటుంబాలకు సగటు కమతం లేదా పొలం 3 ఎకరాలు. అంటే 87 శాతం మన రైతులు సన్న రైతులు. ఈ 87 శాతం కుటుంబాలు, వీరే రైతులు, కౌలు రైతులు, వీరిలో కొందరు వ్యవసాయ కార్మికులు కూడా.
కేవలం 13 శాతం మాత్రమే తమ కమతంలో వ్యవసాయం చేయనివారు... అంటే కార్మికులు కాని భూస్వాములు ఉన్నారు.
మనం ఇచ్చే ప్రతి పథకం కూడా ఈ దిగువన ఉన్న రైతన్నలకు అంటే 87 శాతం కుటుంబాలకు వెళుతోంది. కేవలం రైతుల పథకాలే కాదు.. మన నవరత్నాల్లో ప్రతిదీ వీరికి వెళుతోంది.
కాబట్టే రైతులు వేరు రాష్ట్రాలకు దిన సరి కార్మికులుగా వలస పోయే చంద్రబాబు కరువు సంవత్సరాల పరిస్థితులు ఈ రోజున చాలా తగ్గిపోయాయి. ఇవన్నీ విజయాలు. గతంలో లేని పరిస్థితులు, మార్పులు వల్ల సాధ్యమవుతున్నాయి. గతంలో లేని పథకాలు, మార్పులు దీనికి దోహదపడుతున్నాయి. ఇలాంటివి దురదృష్టవశాత్తూ చంద్రబాబుకి, ఎల్లో మీడియాకు కనిపించవు.
వ్యవసాయానికి సంబంధించి, రైతు కుటుంబాలకు సంబంధించి..మనం చేయగలిగినది ఏంటి ? మనం అధికారంలలోకి వచ్చిన తర్వాత చేసినది ఏంటి ? అన్నది గమనించినట్లైతే.. మనం చేయగలిగినది.. దళారీ వ్యవస్థను నిర్మూలించటం. మనం చేయగలిగినది... రైతుకు అడుగడుగునా అండగా నిలవటం, నాణ్యమైన విద్యుత్తును పగటిపూటే ఇవ్వటం. మనం చేయగలిగినది...నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులూ, పురుగుమందులను బాబు హయాంలో మాదిరిగా కిలోమీటర్ల క్యూలు లేకుండా ఇవ్వటం. మనం చేయగలిగినది... ఫామ్ మెకనైజేషన్‌ను చిత్త శుద్ధితో రైతులకు గ్రామస్ధాయిలో అందుబాటులో ఉండేటట్టు చేయగలగడం. మనం చేయగలిగినది... ప్రతి పేద రైతన్న అన్నం తిన్నాడా లేదా... అన్నది ఆలోచన చేయడం. ఆ రైతు పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారా లేదా అన్నది ఆలోచన చేయడం. ఆ కుటుంబంలో అవ్వాతాతలకు పింఛన్ అందుతోందా లేదా? అన్నది ఆలోచించటం.
మనం చేయగలిగినది... ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఉచిత ఇళ్ళ పట్టాలు వంటివి ఇవ్వగలిగామా ? లేదా? అన్నది ఆలోచించటం.
మనం చేయగలిగినది... పాడి రైతుకు మరో రూ. 5 నుంచి రూ.15 వరకు అదనంగా పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకు రాగలిగామా ? లేదా ? అన్నది ఆలోచించాలి.
మనం చేయగలిగినది... నియోజకవర్గానికి ఇప్పటికే ఒక యానిమల్ అంబులెన్స్‌ను పంపి... మరొకటి కూడా ఈ నవంబరులో పంపే ఏర్పాటు చేయటం.
మనం చేయగలిగినది... ఖర్చు భరించలేని రైతులకు ప్రభుత్వం ఖర్చుతో 2 లక్షల బోర్లు వేయించి, మోటార్లు కూడా వేయించి కార్యాచరణ చేయడం.
రైతులకు ఇలాంటి మేలు చేయాలంటే... మన అడుగులు కరెక్టుగా పడ్డాయా ? లేదా ? అన్నది చూసుకోవాలి.
గడచిన 40 నెలలుగా ప్రతి రైతన్నను మనసులో పెట్టుకుని, ప్రతి కుటుంబానికి కూడా మంచి చేయాలన్న తపనతో ఇవన్నీ మనసుపెట్టి ఆలోచన చేసి, , ప్రతి అడుగులోను మంచి చేశాం.
మంచి చేయగలుగుతామా? లేదా? అన్నదగ్గర నుంచి చేశామూ అని గర్వంగా చెపుతున్నాను. ఇవన్నీ దేవుడు దయ వలన చేయగలిగాం. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.
addComments
Post a Comment