రాజమండ్రి పర్యటనలో 'వాసిరెడ్డి పద్మ'

 

27 నుంచి రాజమండ్రి పర్యటనలో  'వాసిరెడ్డి పద్మ' 

- అక్టోబర్ ఒకటి వరకు మహిళాసంఘాలు, ఉద్యోగనేతలతో వరుస సమీక్షలు


అమరావతి (ప్రజా అమరావతి):

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం రాజమండ్రికి రానున్నారు. ఆమె వచ్చేనెల ఒకటో తేదీ వరకు రాజమండ్రిలోనే అందుబాటులో ఉంటారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో  'ఆకాశంలో సగం - అన్నింటా సగం..ఇది ఏపీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం..'అనే నినాదంతో అక్టోబర్ ఒకటో తేదీన రాజమండ్రిలో 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' జరుపుతున్న సంగతి తెలిసిందే..

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాసిరెడ్డి పద్మ ముందస్తు ప్రణాళికలో భాగంగా రాజమండ్రిలోనే అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఉంటారు. వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, సంఘాల ప్రతినిధులు, పలు ఎన్జీవోలు, ఉద్యోగ నేతలతో ఆమె వరుసగా సమీక్షలు నిర్వహించి, మహిళా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరనున్నారు. 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆనం రోటరీహాలులో ఐసీడీఎస్ సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్ వైజర్లతో సమావేశమవుతారు. 28న పట్టణ రిసోర్స్ పర్సన్లతోనూ ఇన్నర్ వీల్, రోటరీ క్లబ్ ల మహిళా ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు, ప్రముఖులతో సమావేశమై చర్చిస్తారు. 29న ఆర్టీసీ మహిళా కండక్టర్లతో స్థానిక ఆర్టీసీ హాలులో సమావేశమవుతారు. 30న మధ్యాహ్నం 12 గంటలకు మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. రాజమండ్రి ఆర్అండ్ బీ అతిథిగృహంలో బస చేయనున్న వాసిరెడ్డి పద్మ ..స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజావిజ్ఞప్తులు స్వీకరిస్తారు. 


అక్టోబర్ 1న సుబ్రమణ్య మైదానంలో 'దసరా సాధికారత ఉత్సవాలు'

---------------------

 మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండువేల మందితో మహిళల బైక్ ర్యాలీ, నారీశక్తిని చాటే కళాప్రదర్శనలు, సాధికారత నృత్యరూపకాలు, వేషధారణలు, స్టేజీ షోలు..

మహిళల కబడ్డీ, కర్రసాము, కరాటే, కోలాటం ప్రదర్శనలు జరగనున్నాయి. సబల రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల విజేతలకు రూ. 5లక్షల నగదు బహుమతులు అందజేయనున్నారు. 

మహిళలకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు కూడా ఉంటుంది. స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానాలు జరుగుతాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు ఆర్.కె. రోజా, తానేటి వనిత, ఉషాశ్రీ చరణ్, విడదల రజిని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్ రామ్, వంగా గీత, చింతా అనూరాధ, గొట్టేటి మాధవి, బి. సత్యవతి, వైఎస్ఆర్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరుకానున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతారు.


Comments