నెల్లూరు (ప్రజా అమరావతి);
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే లక్ష్యంగా
ఎక్కడా రాజీ పడకుండా సంపూర్ణంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో పొదలకూరు మండలానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పధకం కింద 3వ విడత ఆర్ధిక సాయాన్ని 3555 మంది లబ్ధిదారులకు సుమారు 6.66 కోట్ల రూపాయల మెగా చెక్కును మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారం కోసం పనిచేసిందని, మన ముఖ్యమంత్రి పేదలకు ఎలా మేలు చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని చెప్పారు. వైయస్సార్ చేయూత, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, నేతన్న నేస్తం ఇలా అనేక రకాల సంక్షేమ పథకాల గురించి గతంలో ఏ ఒక్కరూ ఆలోచించలేదని, పేదల మేలుకోరే ముఖ్యమంత్రి కాబట్టే మన జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను పేదల గడప వద్దకే చేరుస్తున్నారని కొనియాడారు.
ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా లక్షా 70 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.
పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్కచెలెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పధకం కింద మొత్తం మూడు విడతల్లో 14,110.61 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 75,25,663 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 645 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 3,43,998 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వైఎస్ ఆర్ చేయూత పధకం కింద మూడు విడతల్లో 86.75 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 46,265 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని, పొదలకూరు మండలానికి సంబంధించి 3వ విడతలో 3555మంది లబ్ధిదారులకు 6.66 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలు చిరు వ్యాపారాలకు, వ్యవసాయ, పాడి అవసరాలకు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే పొదలకూరు మండలాన్ని నుడా పరిధిలో చేర్చామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. సిమెంటు రోడ్లు, సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
అనంతరం శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించి శరన్నవరాత్రి ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సాంబశివారెడ్డి, ఎంపీడీవో శ్రీమతి నగేష్ కుమారి, తాసిల్దార్ శ్రీ ప్రసాద్, జెడ్ పి టి సి తెనాలి నిర్మలమ్మ, ఎంపీపీ కందుకూరు సుబ్బరాయుడు, సర్పంచ్ చిట్టెమ్మ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల పరిధిలోని ఎంపిటిసీలు, సర్పంచ్ లు, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment