తెలుగు భాష అమలుకు పెద్దమనుసుతో కృషి చేయండి
మాతృ భాషాభివృద్దికి ముఖ్యమంత్రి సహకారం భేష్
తెలుగులో జీవోల జారీ కోసం తర్జుమా కమిటీ
రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
విజయనగరం, సెప్టెంబరు 16. (ప్రజా అమరావతి) ః
పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష అమలుకు ప్రతీఒక్కరూ పెద్ద మనసుతో కృషి చేయాలని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, భాషాభివృద్ది ప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. మూడు నెలల్లో ఖచ్చితమైన మార్పు రావాలని ఆయన ఆదేశించారు. తెలుగు భాషావృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని అభినందించారు.
ప్రభుత్వ శాఖల్లో తెలుగు భాష అమలుపై, ఆయన కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల్లో తెలుగు అమలు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ, భాషకు సేవ చేసిన వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ఆదికవి నన్నయ చేత మహాభారతాన్ని తెలుగులో అనువదింపచేసిన రాజరాజ నరేంద్రుడు, నంది తిక్కన కారణంగా మనుమసిద్ది, తన పాలనలో తెలుగు భాషకు స్వర్ణయుగం తెచ్చిన శ్రీకృష్ణదేవరాయులు లాంటి మహారాజులు చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించారని చెప్పారు. విద్యలనగరమైన విజయనగరం కూడా తెలుగుభాషకు గొప్ప సేవ చేసిందన్నారు. మహాకవి గురజాడ అప్పారావు, చాగంటి సోమయాజులు, రోణంకి అప్పలస్వామి, పురిపండా అప్పలస్వామి, గిడుగు రామ్మూర్తి పంతులు, ఆదిభట్ల నారాయణదాసు లాంటి మహనీయుల సాహితీ సేవను కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ, పివి నర్సింహరావు, జలగం వెంగళరావు, ఎన్‌టిరామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు భాషాభివృద్దికి చేసిన సేవలను వివరించారు. వైఎస్ జగన్ మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అధికార భాషా సంఘాన్ని పునరుద్దరించడమే కాకుండా, భాషాభివృద్ది ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, తెలుగు భాష అమలుపై తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారని అన్నారు. ఇంతే కాకుండా, తెలుగు అకాడమీ పునరుద్దరణ, నెల్లూరులో తెలుగు భాష అధ్యయన కేంద్రం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించారని చెప్పారు.
పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష వాడకాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్రస్థాయిలో కూడా కృషి జరుగుతోందని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీఓలు, ఇతర ముఖ్యమైన పత్రాలను తెలుగులోకి అనువదించేందుకు, అమరావతిలో భాషా నిపుణులతో తర్జుమా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. చట్టం ప్రకారం ప్రతీ షాపు, వాణిజ్య సంస్థా, తెలుగులో తప్పనిసరిగా బోర్డు పెట్టాలని, దీనికి కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖా కృషి చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు పేర్లు, జారీ చేసే సర్క్యులర్లు, నోటీసులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, సమాచారం, అన్నీ తెలుగులోనే ఉండాలని, అభివృద్ది పనులకు ఏర్పాటు చేసే శిలాఫలకాలు కూడా జీవో 40 ప్రకారం, తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీనిని పాటించకపోతే జరిమానా, జైలుశిక్ష కూడా విధించే అధికారం సంస్థకు ఉందన్నారు. తెలుగు వాడకంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిఆర్ఓకు సూచించారు. భాష అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నామని లక్ష్మీప్రసాద్ వివరించారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ముందుగా మాట్లాడుతూ, జిల్లాలో తెలుగు భాష అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలుగు సాహిత్యానికి, భాషకు విజయనగరం గడ్డపై చేసిన కృషిని వివరించారు. గురజాడ, ఆదిభట్ల, గిడుగు లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయాలను స్మరించుకుంటూ, భాషాభివృద్దికి, తెలుగుభాష అమలుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఆంగ్ల పదం లేకుండా మాట్లాడటం కష్టమైన ఈ రోజుల్లో, క్రమక్రమంగా మార్పును తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రోజువారీ పాలనా పరమైన కార్యక్రమాల్లో తెలుగును సంపూర్ణంగా అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
సమావేశంలో ముందుగా డాక్టర్ యార్లగడ్డ జీవిత విశేషాలు, ఆయన గొప్పతనం, సాహిత్య సేవను వివరిస్తూ, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యార్లగడ్డకు, ఆయన చిత్రపటాన్ని, బొబ్బిలి వీణను కలెక్టర్ జ్ఞాపికగా అందజేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ, తమతమ శాఖల్లో సంపూర్ణంగా తెలుగు భాషను అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్డిఓ సూర్యకళ, అధికార భాషాసంఘం పూర్వ సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ వెలమల సిమ్మన్న, పరవస్తు సూరి, గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర, కాపుగంటి ప్రకాష్ తదితర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*తెలుగు భాష అమల్లో సమాచార శాఖకు అగ్రస్థానం*
జిల్లాలో తెలుగుభాష అమల్లో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖకు అగ్రస్థానం దక్కింది. శాఖాపరంగా శతశాతం తెలుగు భాషను అమలు చేసినందుకు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్‌ను, అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ అంశంలో వెనుకబడి ఉన్న ఎపిఎస్ఐడిసి, ఎపి టిడ్కో, వాణిజ్య పన్నుల శాఖ తదితర పలు శాఖల్లో తెలుగు వాడకాన్ని పెంచాలని ఛైర్మన్ సూచించారు.
addComments
Post a Comment