నెల్లూరు, సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు విక్రయించే డీలర్లకు అన్ని విధాల అండగా ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
నని రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం పొదలకూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఫర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యమంత్రి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సేవలను మెచ్చుకున్నారని, అనేక దేశాల ప్రతినిధులు సందర్శించి తాము ఊహించిన దానికంటే చాలా బాగున్నాయని కొనియాడారన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. అన్నదాతకు విస్తృత ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ నిర్ణయాల వల్ల డీలర్లకు పొరపాటున ఏవైనా సమస్యలు తలెత్తితే, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. డీలర్లందరూ రైతుకు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు మూడు పూటలా అన్నం పెట్టే రైతు శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రిని డీలర్ల అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వజ్రాల నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు పాలూరి మాల్యాద్రి రెడ్డి, సెక్రటరీ బచ్చు రాఘవరావు, ట్రెజరర్ రాజా శ్రీనివాసులు, ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment