ఎస్.సి.ల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుపై కేంద్ర సహాయ మంత్రి సమీక్ష

 *ఎస్.సి.ల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుపై  కేంద్ర సహాయ మంత్రి సమీక్ష


*

                                                                                                                                                                                  అమరావతి, సెప్టెంబరు  26 (ప్రజా అమరావతి):    రాష్ట్రంలో ఎస్.సి.ల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుకై కేంద్ర ప్రభుత్వం 2021-22 వ ఆర్థిక సంవత్సరంలో  18 శాఖలకు కేటాయించిన రూ.2,837 కోట్ల నిధుల వెచ్చింపు మరియు అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుపై కేంద్ర సామాజిక న్యాయం & సాధికారిత శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి సమీక్షించారు. సోమవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో సంబందిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై శాఖల వారీగా అమలు చేస్తున్న ఎస్.సి.కార్యాచరణ ప్రణాళికల అమలు  తీరును ఆయన సమీక్షించారు. వ్యవసాయ అనుబంద శాఖలతో పాటు విద్య, ఆరోగ్యం, కుంటుంబ సంక్షేమం, స్త్రీ,శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ది, త్రాగునీటి సరఫరా, పారిశుద్యం తదితర శాఖల ఎస్.సి.కార్యాచరణ ప్రణాళికల అమలు  తీరును ఆయన  ఈ సమావేశంలో సమీక్షించారు. పలు శాఖలు ఎస్.సి.కార్యాచరణ ప్రణాళికల అమలు తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ మరికొన్ని శాఖల కార్యాచరణ ప్రణాళికల అమలు తీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని సంబందిత శాఖ అధికారులకు ఆయన సూచించారు. 


అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి సంక్షేమం, అభివృద్దికై పలు కేంద్ర్ర పథకాలను అమలు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులను పలు రాష్ట్రాలకు కేటాయించడం జరుగుచున్నదన్నారు. ఇందుకై 2021-22 ఆర్థిక సంవత్సరంలో  దాదాపు రూ.1 లక్షా 42 వేల కోట్ల మేర నిధులను కేంద్రం పలు  రాష్ట్రాలకు కేటాయించిందన్నారు. అందులో  దాదాపు రూ.2,837 కోట్ల నిధులను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు శాఖలకు కేటాయించడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖకు రూ.356 కోట్లను, పశుసంవర్థక శాఖకు రూ.120 కోట్లను, ఉన్నత విద్యకు రూ.200 కోట్లను, పాఠశాల విద్యకు రూ.128 కోట్లను,  గ్రామీణాభివృద్దికై రూ.52 కోట్లను, పంచాయితీ రాజ్ కు రూ.24 కోట్లను, త్రాగునీరు & పారిశుద్యానికి  రూ.14 కోట్లను, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.134 కోట్లను, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమానికి రూ.468 కోట్లను మరియు వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకై రూ.55 కోట్లతో పాటు గృహ నిర్మాణానికై పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు. 


కేంద్రప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ అమల్లో భాగంగా రాష్ట్రంలో 95 లక్షల గృహాలను నేరుగా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి  వరకూ  54 లక్షల గృహాలకు మాత్రమే ట్యాప్ కనెక్షన్ లు ఇవ్వడం జరిగిందని, మిగిలిన వాటికి కూడా త్వరలో ట్యాప్ కెనక్షన్లు ఇవ్వడంతో పాటు సోక్ పిట్స్ కూడా నిర్మించాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.  రాష్ట్రంలో 125 ప్లోరైడ్ నీటి సమస్య  గ్రామాలు ఉన్నాయని, ఇందులో దాదాపు 15 గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, జగ్గయ్యపేట సమీపంలోని ఎ.కొండూరు గ్రామాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువగా గిరిజనులే  ఉన్నారన్నారు. ఈ సమస్యకు తగిన కారణాలను వివరిస్తూ పరిశోధనా నివేదిక తమకు అందించిన వెంటనే  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద రాష్ట్రంలో  ఆరోగ్య భీమా కార్డులను వచ్చే నెలలోగా జారీచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ లో నీటి సమస్య పరిష్కారానికై మంగళగిరి మున్సిపాలిటీ తాత్కాలికంగా నీటిని సరఫరా చేస్తున్నదని, ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు రూ.38 కోట్ల ప్రతిపాదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దాని డిపిఆర్, టెండరు పక్రియ త్వరలో పూర్తికానున్నట్లు కేంద్ర్ర సహాయక మంత్రి తెలిపారు.  పి.ఎం.ఏ.జి.వై. పథకం క్రింద రాష్ట్రంలో 92 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా చేపట్టడం జరిగిందని, అయితే మరో 120 గ్రామాలను ప్రతిపాదించడం జరిగిందని, వాటికి సంబందించిన కార్యాచరణ ప్రణాళిక రావాల్సిఉందన్నారు. ఆయా గ్రామాల్లో డా.బి.ఆర్.అంబేద్కర్, బాబుజగజ్జీవన్ రాం భవనాలు నిర్మాణానికి నిధులను ఇస్తామని, అందుకు ప్రతిపాదనలు పంపాలని  సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయ, అటవీ, ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. కన్వర్షన్ల మాస్టర్ ప్లాన్ లను రూపొందించుకోవాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. నేషనల్ ఎస్.సి. డెవలప్మెంట్ కార్పొరేషన్ కు రూ.143 కోట్లను ఇవ్వడం జరిగిందన్నారు.  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో వ్యర్థాల తరలింపుకు నేషనల్ సఫాయి కర్మచారీ డెవలప్మెంట్  కార్పొరేషన్ ద్వారా 112 సహాయక గ్రూపులకు  30 శాతం రాయితీ పై వాహనాలు  ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అయితే సఫాయి కర్మచారీ కుటుంబ గ్రూపులకు మాత్రమే రాయితీపై ఈ వాహనాలు ఇవ్వడం జరుగుతుంది తెలపడంతో అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు అందినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా నేషనల్ ఎస్.సి. డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల రాయితీపై పథకాలను అందజేయడం జరుగుచున్నదని, భవిష్యత్ లో రూ.1.00 లక్ష  రాయితీపై పథకాలను అందజేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. 


కొన్ని గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అద్దె భవనాల్లో నిర్వహించడం జరుగుచున్నదని, వాటికి శాశ్వత భవనాల నిర్మాణానికై కేంద్ర నిధులను మంజూరు చేసేందుకు ప్రతిపాదనల పంపాలని అధికారులకు సూచించామని,  ఆ ప్రతిపాదనలు అందిన వెంటనే నిధులను మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. దేశ వ్యాప్తంగా 30 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వాటిలో డా.బి.ఆర్.అంబేద్కర్ ఎక్స్ లెన్సు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.  సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన శిక్షణను ఈ సెంటర్లలో ఇచ్చేందుకు ప్రతి విద్యార్థికి రూ.75 వేలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అయితే దాదాపు 28 విశ్వవిద్యాలయాలు తమ ఆమోదం తెలిపాయని, ఆంద్రప్రదేశ్ లో అనంతపురం విశ్వవిద్యాలయంలో ఈ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఎక్కువ జనసాంద్రత ఉన్న విజయవాడ వంటి ప్రాంతాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందకు ప్రతిపాదనలు పంపినట్లైతే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 

              కేంద్ర సామాజిక న్యాయం & సాధికారిత శాఖ అదనపు కార్యదర్శి సురేంద్ర సింగ్,  రాష్ట్ర సాంఘిక, బి.సి. సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ, సంచాలకులు  కె.హర్షవర్థన్, బి.సి. సంక్షేమ శాఖ సంచాలకులు పి.అర్జున రావు తదితరులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.


 

Comments