ఘనత మా జగనన్న ఇచ్చారు, నా పుట్టింటి వాళ్ళు కూడా ఇవ్వలేదు,


కుప్పం, చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);


*వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత*


*చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, ఈ రోజు మూడో విడత వైయస్సార్‌ చేయూత కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం, శ్రీ జగన్‌ గారు తన సుధీర్ఘ పాదయాత్రలో విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైయస్సార్‌ చేయూతకు అంకురార్పణ చేశారు. ఆయన సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే శాచురేషన్‌ మోడ్‌లో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అక్కచెల్లెమ్మలకు చేయూత అందజేస్తున్నారు. బటన్‌ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. మీ కష్టాలన్నీ తీరే రోజు ఈ రోజు, మంచి పరిపాలన అందిస్తున్న జగనన్నకి మన అందరి తరపునా హృదయపూర్వక ధన్యవాదాలు. 


*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు భూగర్భవనరుల శాఖా మంత్రి*


అందరికీ నమస్కారం, సీఎంగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కుప్పం రావడం సంతోషకరం, ఆహ్వనం పలికిన అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం ఇది, కర్ణాటక, తమిళనాడు బార్డర్‌లో ఉంటుంది, 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, 16 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉండి చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చాడు, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు, ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి. ఈ రోజు సీఎంగారు దేశంలో ఏ సీఏం చేయనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు కుప్పంలో వైయస్సార్‌ చేయూత మూడో విడత ఇక్కడ బటన్‌ నొక్కి ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మంది అక్కచెల్లెమ్మలకు శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన లబ్ధి అక్షరాలా రూ. 2,39,013.40 కోట్లు. ఇన్ని లక్షల కోట్లు ఏ సీఎం అయినా ఇచ్చారా, కుప్పం పట్టణంలో మొత్తం 10 వేల ఇళ్ళు మన ప్రభుత్వం ఇస్తుంటే చంద్రబాబు ఎన్ని ఇళ్ళు ఇచ్చాడో ఆలోచించాలి. చంద్రబాబు మాట్లాడితే పులివెందులకి నీళ్ళు ఇచ్చానంటాడు, మీకు కుప్పంలో ఏం పని అంటాడు, మరి కుప్పానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, హంద్రీనీవా కాలువను కుప్పం దాకా ఎందుకు తీసుకురాలేదు చంద్రబాబు, కానీ సీఎంగారు యుద్దప్రాతిపదికన హంద్రీనీవా పూర్తి చేయిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ది లేదంటున్నారు, నాడు నేడు క్రింద స్కూల్స్, ఆసుపత్రులు ఏ విధంగా అభివృద్ది చెందాయి, పేద పిల్లలంతా ఇంగ్లీష్‌ మీడియం చదవడం కోసం సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చారో అందరూ గమనించాలి. కుప్పం నియోజకవర్గంలో 93 సచివాలయాలకు గాను 81 సచివాలయాలు పూర్తయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో సంక్షేమ పధకాల క్రింద రూ. 1,639.19 కోట్లు చేరాయి. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నదే ఇక్కడ పేదలున్నారని, బీసీలు ఉన్నారని, వీరందరినీ మనం మోసం చేయచ్చు ఈజీగా గెలవచ్చు అని, చంద్రబాబు నువ్వు పులివెందుల వెళ్ళచ్చు కానీ సీఎంగారు కుప్పం రాకూడదా, చంద్రబాబు మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన్ను బలవంతంగా రాజీనామా చేయించి ఇక్కడ పాతుకుపోయి ఇక్కడి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేయడమే కాక ఇంకా కుప్పంపై ఆశలు పెట్టుకున్నావా, ఇది మంచిది కాదు. మేం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమాన్ని ఇచ్చాం, అందుకు ఈ రోజు కుప్పంలో శ్రీ జగన్‌ గారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. సీఎంగారు ఇక్కడి ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు, హంద్రీనీవా కాలువ పూర్తయితే దానికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా యామనూరు దగ్గర ఒక టీఎంసీ రిజర్వాయర్‌ మంజూరు చేయాలని కోరుతున్నాను. హంద్రీనీవా కాలువ కెపాసిటీని కూడా పెంచాలి, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని నాడు వైఎస్‌ఆర్‌ గారు పాలార్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే దానిని చంద్రబాబు కుయుక్తులతో తమిళనాడు ప్రభుత్వంతో కేసులు వేయించి దానిని ఆపించారు. దీనిపై సీఎంగారు పాలార్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కోరుతున్నాను. సీఎంగారు నాకు పులివెందుల ఒకటే కుప్పం ఒకటే అన్నట్లు దానిని చేతల్లో చూపుతున్నారు. భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎంగారు చెప్పారు కాబట్టి మీకు మంత్రిగా సేవలందించడానికి భరత్‌కు అవకాశం ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


*సుబ్బమ్మ, లబ్ధిదారు, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు*


అన్నా నేను మూడేళ్ళ క్రితం కూలీ పనులు చేసుకునేదానిని. నాకు మొదటి విడతలో రూ. 18,750 వచ్చాయి, దానికి బ్యాంకు లోన్‌ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను, రెండో విడత డబ్బులతో గడ్డి కటింగ్‌ మెషిన్‌ తీసుకొన్నాను, మా మహిళా సంఘం గ్రూప్‌ కూడా సీ గ్రేడ్‌ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది, బ్యాంకు వారు మాకు రూ. 20 లక్షలు ఇస్తే నాకు రూ. 2 లక్షలు వచ్చాయి, దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నాను, స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి, మన జగనన్న చల్లగా ఉండాలి, మా పాపకు విద్యాదీవెన డబ్బులు వచ్చాయి, తను హార్టికల్చర్‌ బీఎస్‌సీ చదువుతుంది, నా మేనమామ డబ్బుతో నేను చదువుకుంటున్నా అని పాప చెబుతుంది, నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్లు పాలు పోస్తున్నాను, ఖర్చులు పోను రూ. 60 వేలు మిగులుతున్నాయి, ఈ ఘనత మా జగనన్న ఇచ్చారు, నా పుట్టింటి వాళ్ళు కూడా ఇవ్వలేదు,


మహిళలకు ఆర్ధికంగా సాయం చేస్తున్నారు జగనన్న, మా అమ్మకు వచ్చిన మొత్తం ఫించన్‌ డబ్బులు దాచుకుని రెండు బంగారు గాజులు కొనుక్కుని నా పెద్ద కొడుకు ఇచ్చారని చెబుతుంది. కరోనా టైంలో కూడా జగనన్న మనకు చాలా సాయం చేశారు, మనమంతా మళ్ళీ మళ్ళీ అన్ననే సీఎంగా గెలిపించుకోవాలి. ధన్యవాదాలు.


*మరియమ్మ, లబ్ధిదారు, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా*


నమస్కారం, అన్న మాకు మొదటి విడత వచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా, రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ. 15 వేలు సంపాదిస్తున్నాను, గతంలో మేం కూలికి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు మా అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది, మేం ఇద్దరం ప్రతి రోజూ తలుచుకుంటాం, పిల్లలను కూడా పెద్ద చదువులు చదువుతున్నారు, మామ ఉన్నారు మేం పెద్ద చదువులు చదువుతాం అని వారు అంటున్నారు, ఈ రోజు మాకు మూడో విడత డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను, పాలకు కూడా మంచి ధర వస్తుంది, మీరు మాకు అండగా ఉన్నారు, మీరు ఈ సారి కూడా సీఎంగా విజయభేరి మోగిస్తారు, అన్నా మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతో ఉంటారు, ధన్యవాదాలు.

Comments