విద్య‌, వైద్య శాఖ‌ల్లో మూడు నెల‌ల్లోగా ప‌దోన్న‌తులు

 


విద్య‌, వైద్య శాఖ‌ల్లో మూడు నెల‌ల్లోగా ప‌దోన్న‌తులు


సి.పి.ఎస్‌.పై రెండు నెల‌ల్లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం

వ‌చ్చే నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగుల‌కు పి.ఆర్‌.సి. ప్ర‌కారం జీతాలు

త్వ‌ర‌లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్‌

చ‌ర్చ‌ల ద్వారానే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వార్షిక స‌భ‌లో పాల్గొన్న మంత్రి


విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబరు 10 (ప్రజా అమరావతి):

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీము కంటే మెరుగైన ప‌రిష్కారాన్ని సి.పి.ఎస్‌. ఉద్యోగుల‌కు చూపి మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఆదేశించార‌ని, ఈ మేర‌కు వ‌చ్చే రెండు నెల‌ల్లోనే దీనిపై ప్ర‌భుత్వ నిర్ణ‌యం వుంటుంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని మంత్రి పేర్కొన్నారు. సి.పి.ఎస్‌.ర‌ద్దుపై త‌మ పార్టీ హామీ ఇచ్చిన విష‌యాన్ని తాము కాద‌న‌డం లేద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లో 95శాతం హామీలు నెర‌వేర్చింద‌ని, అందులో 5 శాతం హామీలు మిగిలి వున్నాయ‌ని, అందులో సి.పి.ఎస్‌.ర‌ద్దు ఒక‌ట‌ని పేర్కొన్నారు. సి.పి.ఎస్‌.కు ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ప‌రిష్కారాల‌ను ఉద్యోగుల ముందు వుంచామ‌ని మంత్రి చెప్పారు. స్థానిక జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో శ‌నివారం జ‌రిగిన‌ ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం 4వ జిల్లా మ‌హాస‌భ‌ల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్య‌, వైద్య శాఖ‌ల ఉద్యోగుల‌కు అన్ని స్థాయిల్లోని వారికి వ‌చ్చే మూడు నెల‌ల్లో ప‌దోన్న‌తులు క‌ల్పిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్న విష‌యాన్ని గుర్త‌చేస్తూ ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్‌కు విద్య‌, వైద్యం రెండు క‌ళ్ల వంటివ‌ని పేర్కొన్నారు. ఈ రెండు శాఖ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టార‌ని చెప్పారు. రాష్ట్రంలోని పి.హెచ్‌.సి.లు, సి.హెచ్‌.సిల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ వుండ‌కుండా నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో నోటిఫికేష‌న్‌లు జారీచేసి పోస్టుల‌న్నీ భ‌ర్తీ చేయాల‌ని సి.ఎం. ఆదేశాలిచ్చార‌ని తెలిపారు. అదేవిధంగా తన విద్యాశాఖ‌లోనూ టీచ‌ర్ నుంచి ప్రొఫెస‌ర్ వ‌ర‌కు అన్ని స్థాయిల్లో బోధ‌న సిబ్బందికి ప‌దోన్న‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. డిసెంబ‌రులోగా విద్యాశాఖ‌లో ప‌దోన్న‌తులు పూర్తిచేస్తామ‌న్నారు.


రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు వున్నార‌ని, వీరిలో కోర్టు నిబంధ‌న‌ల మేర‌కు అర్హులైన వారంద‌రికీ రెగ్యుల‌ర్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేశార‌ని చెప్పారు. నెల‌రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్‌పై నిర్ణ‌యం వుంటుంద‌న్నారు.


రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త పి.ఆర్‌.సి. ప్ర‌కారం జీతాల చెల్లింపు వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.


త‌మ‌ది ఉద్యోగుల అనుకూల ప్ర‌భుత్వ‌మ‌ని పేర్కొంటూ వారి ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా ఆలోచ‌న చేయ‌బోమ‌న్నారు. ఉద్యోగులు, ప్ర‌భుత్వం వేరు కాద‌ని వారు ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన డి.ఏ. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ త‌దిత‌ర అంశాల్లో త్వ‌ర‌లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.


అంతకు ముందు ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు కె.ఆర్‌.సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.72 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు త‌మ సంఘంలో స‌భ్యులుగా వున్నార‌ని చెప్పారు. వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఉద్యోగులు యాప్‌ల వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌న్నారు.


స‌మావేశంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్షుడు పి.రామ‌చంద్ర‌రావు, కార్య‌ద‌ర్శి కంది వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Comments