రెడ్ క్రాస్ కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.70 లక్షల విరాళం
ఈ నిధులతో రక్తనిధి ఆధునీకరణ చేసేందుకు ఒప్పందం
ఒప్పందంపై సంతకాలు చేసిన జిల్లా కలెక్టర్, పవర్ గ్రిడ్ అధికారులు
విజయనగరం, అక్టోబర్ 31 (ప్రజా అమరావతి): జిల్లాలోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలోని రక్తనిధిని రూ.70 లక్షల వ్యయంతో ఆధునీకరించి రానున్న రోజుల్లో రోగుల అవసరాలకు అనుగుణంగా ప్లేట్ లేట్ లు వంటివి అందించనున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ అందించే రూ.70 లక్షల విరాళంతో రెడ్ క్రాస్ రక్తనిధిని ఆధునీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, పవర్ గ్రిడ్ సంస్థకు చెందిన సికింద్రాబాద్ లోని దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ పి.కె.హరినారాయణన్ మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పవర్ గ్రిడ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రెడ్ క్రాస్ రక్తనిధి ఆధునీకరణ కు నిధులు సమకూరుస్తుంది. ఈ నిధులతో రెండు నెలల్లో జిల్లా కేంద్రంలోని రక్తనిధిలో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసి మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్లేట్ లేట్ లు తగ్గిన వారికి వాటిని అందించడం కోసం రక్తదాతలు దానం చేసిన రక్తాన్ని సెల్ ల రూపంలోకి మార్పు చేసి నిల్వ చేస్తారు. వచ్చే జనవరి నెలాఖరుకు రక్త నిధి ఆధునీకరణ పూర్తి చేస్తామని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కె.ఆర్.డి.ప్రసాద రావు చెప్పారు.
పవర్ గ్రిడ్ సంస్థ గతంలో అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబు లెన్స్ కుడా రెడ్ క్రాస్ సంస్థకు అందజేసిందని పేర్కొంటూ జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలకు సహకరిస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్ర నిధిని కుడా ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. రక్త నిధి ఆధునీకరణ ద్వారా ఈ జిల్లాలో రోగుల అవసరాలను తీర్చేందుకు మరిన్ని సౌకర్యాలు సమకూరు తాయని పవర్ గ్రిడ్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ పి.కె.హరిహరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ సీనియర్ డి.జి.ఎం. చంద్ర సేన్, రెడ్ క్రాస్ కార్యదర్శి సత్యం, ముఖ్య ప్రణాలికా అధికారి పి.బాలాజీ, రెడ్ క్రాస్ కోశాధికారి హేమా రావు తదితరులు పాల్గొన్నారు. పవర్ గ్రిడ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జ్ఞాపిక బహుకరించారు.
addComments
Post a Comment