జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ ఎంపిక పోటీలు ప్రారంభం


 


*జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్  ఎంపిక పోటీలు ప్రారంభం* 


పార్వతీపురం, అక్టోబర్ 17 (ప్రజా అమరావతి): 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు సోమ వారం ప్రారంభం అయ్యాయి. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమ వారం ఉదయం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు పరిచయ కార్యక్రమం జరిగింది.  విల్లు ఎక్కుపెట్టి షూట్ చేసి క్రీడల ఎంపిక పోటీలు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి సారిగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు పార్వతీపురం ప్రసిద్ది చెందిన ప్రాంతమని, ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం వలన మరింత స్ఫూర్తి కలుగుతుందని ఆయన చెప్పారు. క్రీడాకారులకు సహకారం అందిస్తామని, జిల్లాలో మరిన్ని పోటీలు నిర్వహించుటకు, క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానించుటకు తోడ్పాటు అందిస్తామని ఆయన చెప్పారు. క్రీడలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. 


శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక, శారీరక వికాసం కలుగుతుందని అన్నారు.


జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 19 వ తేదీ వరకు పార్వతీపురంలో ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతాయని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. సోమ వారం ఇండియన్ రౌండ్, మంగళ వారం రికర్వ్, బుధ వారం కాంపౌండ్ పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు


ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్లు కొండపల్లి రుక్మిణి, ఇందుకూరి గుణ్ణేశ్వర రావు, రాష్ట్ర ఆర్చిరి సెక్రటరీ చెరుకూరి సత్యం నారాయణ గారు, ప్రిన్సిపాల్  ఏ.రాజు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షులు డి.టి.గాంధీ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.రామకృష్ణ, ఎం. మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments