నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలోని ముత్తుకూరు మండలం, నేలటూరు వద్ద నిర్మించిన ఎపి జెన్కో మూడో యూనిట్ ను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీన రానున్న సందర్భంగా, ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా ఎస్.పి శ్రీ సి.హెచ్. విజయ రావు, ఎపి జెన్కో రాష్ట్ర డైరెక్టర్ శ్రీ జి. చంద్రశేఖర్ రాజు లతో కలసి పరిశీలించారు. తొలుత బహిరంగ సభ వేదిక, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి, అధికారులను ఆదేశించారు.
అనంతరం హెలిప్యాడ్ స్థలాన్ని, పైలాన్ ఏర్పాట్లను మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. తదుపరి మూడో యూనిట్ కంట్రోల్ పాయింట్ ను మంత్రి పరిశీలించారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముత్తుకూరు మండలం, నేలటూరు వద్ద నిర్మించిన దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబందించిన 3వ యూనిట్ ను ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ముత్తుకూరు మండల పరిధిలో సుధీర్గ కాలంగా పెండింగ్ లో వున్న నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కి సంబంధించి అర్హత వున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 2019 సంవత్సరంలో ఏప్రిల్ మాసం నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ ప్యాకేజీ క్రింద ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని, లబ్ధిదారుల జాబితాను కూడా సిద్దం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2019 సంవత్సరం ఎన్నికలకు ముందు కొంతమందికి ఈ ప్యాకేజీ కింద 14 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేయడం జరిగిందని, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 25 వేల రూపాయల్లో అందచేసిన ఆర్ధిక సహాయాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని అందచేయడం జరుగుతుందని, అర్హత వుండి ఇంకా ఎవరికైనా నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అందక పోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు. వీటితో పాటు జిల్లాకు సంబందించి ఇతర అనేక అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండవ సారి సర్వేపల్లి నియోజక వర్గానికి రానున్న సంధర్భంగా ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్నీ ఏర్పాట్లు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు అనుమతులు తీసుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట నుడా వైస్ ఛైర్మన్ శ్రీ టి. బాపిరెడ్డి, ఆర్.డీ.ఓ శ్రీ మాలోల, ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, తహశీల్దార్ శ్రీ మనోహర్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment