సమసమాజ నిర్మాణ కర్తలు గురువులే...



*సమసమాజ నిర్మాణ కర్తలు గురువులే...*



* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎస్.బి. అంజాద్ బాష*


* *వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన 250 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానం*


* *టెక్నాలజీపై పట్టు సాధించి.. నాణ్యమైన విద్యను  బోధించాలి : జిల్లా కలెక్టర్*


కడప, అక్టోబర్ 5 (ప్రజా అమరావతి): సమసమాజాన్ని తీర్చిదిద్దే కీలక బాధ్యత గురువులదేనని, గురువుల స్థానం ఎంతో గొప్పదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి. అంజాద్ బాష తో పాటు  పలువురు ప్రస్తావించారు. 


బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో భాగంగా.. వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానం ఘనంగా జరిగింది. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ భాష తోపాటు.. జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు.. ఉపాధ్యాయులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు.. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి. అంజాద్ భాష  మాట్లాడుతూ.. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. గురువులకు ఎన్ని పురస్కారాలు అందించినా వారి రుణం తీర్చుకోలేనిది అన్నారు. ఇంతటి మంచి గొప్ప కార్యక్రమానికి పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుల స్థానం ఎంతో గొప్పదని.. సమాజాన్ని చక్కదిద్దే బాధ్యత గురువులదేనని ప్రశంసించారు. సమాజంలో ఇంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది గురువుల చలువే అన్నారు. గురువులు నేర్పించిన విద్యాభ్యాసంతో పాటు.. వారు నేర్పిన మంచి నడవడికలు కూడా సమాజానికి మార్గదర్శకాలన్నారు.  


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు. అదే బాటలో ఆయన తనయుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో అనేక మార్పులను తీసుకొచ్చారన్నారు.  మనబడి నాడు-నేడు క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.  ఇది ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మారుతున్న సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దీటుగా ఉపాధ్యాయులు కూడా అప్డేట్ అయ్యి విద్యార్థులకు బోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 


** జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు మాట్లాడుతూ.. దేశం బాగుండాలంటే.. భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అన్నారు.  ప్రస్తుతం వస్తున్న అధునాతన సంకేతికతో సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా పిల్లల అలవాట్లు, ఆటపాతలు, విద్యా భ్యాసంలో ఎన్నో మార్పులొచ్చాయన్నారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా.. టెక్నాలజీపై ఉపాధ్యాయులు పట్టు సాధించి.. నైపుణ్యంతో విద్యను బోధించాలని సూచించారు.


** శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో గురువుల స్థానం ఎంతో గొప్పదని, విద్యతోనే సమ సమాజ నిర్మాణం చేయవచ్చన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఎంతో ఉన్నత స్థాయి వరకు ఎదిగే అవకాశం ఉందన్నారు. అందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి  విలువలతో కూడిన నాణ్యత గల విద్యను అందించాలని తెలిపారు. 


** కమలాపురం శాసనసభ్యులు పి.రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే.. విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువచ్చారన్నారు. ఇటు గురువులు, అటు విద్యార్థులకు.. ఉపయుక్తమైన.. విద్య సంస్కరణలు చేయడం జరిగిందన్నారు. అన్ని వృత్తుల్లోకెళ్ల.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది, పవిత్రమైనది.. అభివర్ణించారు. గురువుల స్థానం ఎప్పటికీ ఉన్నతంగా ఉంటుందన్నారు. ఆ స్థానాన్ని గుర్తుంచి.. ఉత్తమ సేవలు అందించిన గురువులకు.. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు అవార్డుతో సత్కరించటం గొప్ప విషయం అన్నారు.


** జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయునిగా ఉండి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదగాలంటే విద్య వల్లనే సాధ్యం అన్నారు. ఉపాధ్యాయుని స్థాయి ఎంతో గొప్పదని.. అప్పట్లో  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజున.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన ఉపాధ్యాయులను గౌరవంగా సత్కరించి పంపించారని.. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం గా జరుపుకుంతున్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచనతో అనేక పథకాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి తెచ్చారని ఈ సందర్భంగా తెలియజేసారు.


** చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యను దేనితోనూ విలువ కట్టలేమని.. ఎవరూ దొంగిలించలేని.. అతు విలువైన  ఆస్తి విద్య.. అని పేర్కొన్నారు. విద్య వల్లే ఆర్థిక సామాజిక అభివృద్ధి జరుగుతుందని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం... విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. బలోపేతం చేస్తోందన్నారు. అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదని.. ప్రతి ఉపాధ్యాయుడు.. ఉన్నత విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని కోరారు.


** అనంతరం సేవలు అందించిన వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల 250 మంది ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు చేతుల మీదుగా అందించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో కడప జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్య, కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి, కడప అన్నమయ్య జిల్లాల విద్యాశాఖ అధికారులు జయరాజు,  రాఘవరెడ్డి, కడప జడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి, జడ్పి కోఆప్షన్ మెంబర్ అన్వర్ భాష, రాష్ట్ర ప్రవేటు పాఠశాలల అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Comments